క్షమాపణలు కోరిన కపిల్‌ శర్మ

కాయస్థ సమాజానికి క్షమాపణలు: కపిల్‌ శర్మ

ముంబై: బాలీవుడ్‌ స్టార్‌ కమెడియన్‌ కపిల్‌ శర్మ కాయస్థ సామాజిక వర్గానికి క్షమాపణలు చెప్పాడు. తనకు ఎవరినీ కించపరిచే ఉద్దేశం లేదని.. తన బృందం తరఫున తాను క్షమాపణ కోరుతున్నట్లు పేర్కొన్నాడు. అసలు విషయమేమిటంటే.. మార్చి 28న ప్రసారమైన ది కపిల్‌ శర్మ షోలో చిత్రగుప్తుడి గురించి జోకులు పేల్చారు. ఈ నేపథ్యంలో తమ ఆరాధ్య దైవమైన చిత్రగుప్తుడి గొప్పతనాన్ని అసహాస్యం చేశారంటూ కాయస్థ సామాజిక వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో నెలరోజుల క్రితం అఖిల్‌ భారతీయ కాయస్థ సభ అధినేత కపిల్‌కు ఫోన్‌ చేసి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో కపిల్‌ శర్మను బాయ్‌కాట్‌ చేయడంతో పాటుగా.. అతడిపై ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేస్తామని హెచ్చరించారు.

ఇక ఈ విషయంపై స్పందించిన కపిల్‌ శర్మ తాజాగా వారిని క్షమాపణలు కోరాడు. ఈ మేరకు.. ‘‘ప్రియమైన కాయస్థ సమాజానికి నమస్కారం. చిత్రగుప్తుడిపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరుతున్నా. ఇతరుల మనోభావాలను కించపరిచే ఉద్దేశం మాకు లేదు. మీరంతా ఎల్లప్పుడూ సంతోషంగా, క్షేమంగా నవ్వుతూ ఉండాలని ఆ ఈశ్వరుడిని ప్రార్థిస్తున్నా. హృదయపూర్వక నమస్కారాలు’’అని కపిల్‌ ట్వీట్‌ చేశాడు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *