అంతా మా ఇష్టం!

0
183
Spread the love

అంతా మా ఇష్టం’.. ఇదీ హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) తీరు. ‘మెజారిటీ క్లబ్‌లు మావే.. డివిజన్‌ లీగ్‌ల్లో ఆడే జట్లు మావే. మేం చెప్పిందే వేదం’ అనే రీతిలో హెచ్‌సీఏ పాలకులు వ్యవహరిస్తూ ప్రతిభావంతులైన వర్ధమాన క్రికెటర్ల కెరీర్‌ను ఫణంగా పెడుతున్నారు. గత ఐపీఎల్‌లో మెరిసిన దేవదత్‌ పడిక్కళ్‌ (ఆర్‌సీబీ), రుతురాజ్‌ గైక్వాడ్‌ (సీఎ్‌సకే), తమిళనాడు లెగ్‌ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి (కేకేఆర్‌), సూర్యకుమార్‌ యాదవ్‌ (ముంబై ఇండియన్స్‌).. ఆయా రాష్ట్ర క్రికెట్‌ సంఘాలు నిర్వహించిన స్థానిక టీ20 లీగ్‌ల ద్వారానే వెలుగులోకి వచ్చినవారే. ఈ లీగ్‌లే ఇతర రాష్ర్టాల క్రికెటర్లకు వరమవుతుండగా.. హైదరాబాద్‌ క్రికెటర్లకు ఆ అవకాశం లేకుండా పోయింది.

తెలంగాణ ప్రీమియర్‌ లీగ్‌ ఏమయ్యే?

గతేడాది నవంబరు 6వ తేదీన హెచ్‌సీఏ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘తెలంగాణ ప్రీమియర్‌ లీగ్‌ నిర్వహణకు వచ్చిన ప్రతిపాదనలపై అపెక్స్‌ కౌన్సిల్‌లో చర్చి ంచాం. ‘టీ స్పోర్ట్స్‌’ అనే సంస్థతో కలిసి త్వరలో లీగ్‌ను నిర్వహించబోతున్నాం. లీగ్‌ నిర్వహణకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తాం’ అని హెచ్‌సీఏ అధ్యక్షుడు అజరుద్దీన్‌, సెక్రటరీ విజయానంద్‌ పేరిట ప్రకటన వెలువడింది. మూడు నెలలైనా మళ్లీ ఆ ఊసే లేదు. మరోవైపు కర్ణాటక ప్రీమియర్‌ లీగ్‌, తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌, టీ20 ముంబై లీగ్‌ ఆయా రాష్ట్రాల్లో విజయవంతంగా సాగుతున్నాయి. ఐపీఎల్‌ తరహాలోనే నిర్వహిస్తున్న ఈ టోర్నీల్లో 6-10 జట్ల వరకు పోటీ పడుతున్నాయి. ఎక్కువ జట్లు ఆడే అవకాశం ఉండడంతో ముంబై, బెంగళూరు, చెన్నై వంటి మెట్రో నగరాలకు చెం దిన క్రికెటర్లే కాకుండా మారుమూల ప్రాంతాల్లోని ఆట గాళ్లూ వెలుగులోకి వస్తున్నారు. హజారే, రంజీల్లో ఆడే అవకాశం రాని క్రికెటర్లకు వారి ప్రతిభను నిరూపించుకోవడానికి ఈ లీగ్‌లు మంచి వేదికగా మారుతున్నాయి. ఫలితంగా ఈ రాష్ట్రాలకు చెందిన క్రికెటర్లు ఐపీఎల్‌లో ఆడే చాన్స్‌ దక్కించుకుంటుంటే, హైదరాబాదీలు మాత్రం బిక్కచూపులు చూస్తున్నారు.

బినామీల పేరిట క్లబ్‌లు:

అజరుద్దీన్‌ మినహా హెచ్‌సీఏ ప్రస్తుత పాలకుల్లోని ప్రతి ఒక్కరికి 5-10కి పైగా బినామీల పేర్లతో క్లబ్‌లున్నట్టు ఆరోపణలున్నాయి. బంధువుల పేర్లు, చిరునామాలతో వారి కనుసన్నల్లోనే ఆ క్లబ్‌లను నడుపుతున్నారు. ‘నా పేరున ఒకటే క్లబ్‌ ఉంది. ఇతర క్లబ్‌లు నా పేరిట లేవు కాబట్టి మామీద ఎలా చర్యలు తీసుకుంటారు’ అని హెచ్‌సీఏలో కొందరు పెద్దలు ధీమాగా మాట్లాడుతున్నారు. ఒక క్లబ్‌ను తమ అధీనంలో ఉంచుకుని మిగిలిన వాటిని ప్రైవేట్‌ అకాడమీలకు లీజుకిచ్చి ఏడాదికి లక్షల్లో ఆదాయాన్ని దండుకుంటున్న విమర్శలూ వినిపిస్తున్నాయి. క్రికెట్‌ను వ్యాపారంగా మార్చేస్తే ప్రతిభావంతులు ఏమైపోవాలని పలువురు హెచ్‌సీఏ క్లబ్‌ సెక్రటరీలు, క్రికెటర్ల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here