అరుదైన బౌల్‌.. ధర 3.6 కోట్లు!

0
336
Spread the love

ఓ పింగాణీ బౌల్‌ ధర ఎంతుంటుంది. మహా అయితే ఓ వంద, లేదంటే ఓ వెయ్యి రూపాయల వరకూ ఉండొచ్చు. మరింత కళాత్మకమైతే మరికాస్త ఎక్కువగా ధర పలకవచ్చు. కానీ అమెరికాలో వేలానికి వచ్చిన ఓ పింగాణీ బౌల్‌ ధర చూస్తే.. కళ్లు చెదరక మానవు. ఆ బౌల్‌ ధర సింపుల్‌గా రూ. 3.6 కోట్ల వరకూ ఉంటుందని వేలంపాట నిర్వాహకులు అంచనా వేశారు. ఎందుకు ఇంత ధర అంటే.. ఆ పాత్రకు కనీసం ఆరు వందల ఏళ్ల వయసు ఉంటుందట. ఈ పురాతన కప్పును ఈనెల 17న న్యూయార్క్‌లో సోథేబీ కంపెనీ వేలంపాటలో విక్రయించనుంది.

అది చైనీస్‌ కప్పు
కనెక్టికట్‌కు చెందిన ఓ పాత వస్తువుల వ్యాపారి గతేడాది ఆ బౌల్‌ను రూ. 2,500కు కొనుగోలు చేశాడు. కొంతకాలం తన దగ్గర ఉంచుకున్నాక దానిలో ఏదో ప్రత్యేకత ఉందని కనిపెట్టాడు. వెంటనే సోథేబీ కంపెనీని సంప్రదించాడు. ఆ బౌల్‌ చరిత్ర చెప్పాలని, విలువ కట్టాలని కోరాడు. బౌల్‌ను పరిశీలించిన కంపెనీ వాళ్లు కంగుతిన్నారు. ఇది అరుదైన బౌల్‌ అని, వేలం వేస్తే 5 లక్షల డాలర్ల వరకూ పలుకుతుందని చెప్పారు. దీంతో ఆ వ్యాపారి ఉబ్బితబ్బిబయ్యాడు. ఆ పాత్రను లోటస్‌ బౌల్‌గా పిలుస్తారు. ఆ బౌల్‌ 1403 నుంచి 1424 వరకూ చైనాను ఏలిన యోంగిల్‌ చక్రవర్తి కాలం నాటిది. ఇలాంటి కప్పులు మరో ఆరు మాత్రమే ఇప్పుడు ఉన్నాయని సోథేబీ కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. తైపీలోని నేషనల్‌ మ్యూజియంలో రెండు, లండన్‌ మ్యూజియంలో రెండు, టెహ్రాన్‌ మ్యూజియంలో ఒకటి అలాంటి కప్పులు ఉన్నాయట.

అందమైన ఆర్టు
అందమైన ఆర్టుతో ఉన్న ఈ బౌల్‌ను చూస్తే.. వావ్‌ అద్భుతం అనకుండా ఉండరేమో. 6 అంగుళాల తెల్లటి పాత్ర లోపల, బయటా నీలం రంగులో కళాత్మకంగా తీర్చిదిద్దిన పూల బొమ్మలతో ఆకట్టుకుంటుంది. ఆ బౌల్‌ను పట్టుకుంటే ఎంతో సున్నితంగా, సిల్కును తలపిస్తోంది. 15వ శతాబ్దపు రంగులు, డిజైన్లు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఆ పాత్ర ఎంతో అద్భుతంగా ఉందని సోథేబీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మెక్‌ అటీర్‌ అన్నారు. పాత్ర పెయింటింగ్, షేప్‌ ఎంతో యునిక్‌గా ఉందని ఆయన ముచ్చట పడుతూ చెప్పారు. ఇంత పురాతన వస్తువు పాత వస్తువుల వ్యాపారి వద్దకు ఎలా వచ్చిందనేది తెలియడం లేదన్నారు. తరతరాలుగా వారసుల చేతులు మారుతూ ఇక్కడికి వచ్చి ఉంటుందని, దాని విలువ తెలియక పోవడంతో వారు అమ్మేసుకుని ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి వస్తువులు ఇంకా ఉండటం సంతోషమని, దాని వేలం నిర్వహించడం గొప్పగా భావిస్తున్నామని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here