ఆ టీకా ఒక్క డోసు చాలు

0
267
Spread the love

కరోనాతో అతలాకుతలమవుతున్న అగ్రరాజ్యం అమెరికా మూడో వ్యాక్సిన్‌కి అనుమతులు మంజూరు చేసింది. జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సంస్థ తయారు చేసిన టీకా వినియోగానికి శనివారం అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ) అనుమతినిచ్చింది. జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ టీకా ఒక్క డోసు ఇస్తే సరిపోతుందని, రెండు డోసులు అవసరం లేదని సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు. ఇప్పటికే అమెరికా ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్‌లకు అనుమతిచ్చింది. దేశవ్యాప్తంగా విస్తృతంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పుడు మూడో కంపెనీకి చెందిన వ్యాక్సిన్‌కి ఎఫ్‌డీఏ అనుమతులు రావడంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ హర్షం వ్యక్తం చేశారు.

US to Approve Johnson And Johnson Covid Vaccine - Sakshi

కరోనాపై పోరాటం ఇక తుది దశకు చేరుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా ప్రజలందరికీ ఇది అత్యంత ఉత్సాహాన్నిచ్చే వార్తని బైడెన్‌ వ్యాఖ్యానించారు. ‘‘జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వ్యాక్సిన్‌ను అన్ని విధాలుగా పరీక్షించి, రకరకాలుగా ప్రయోగాలు నిర్వహించి సంతృప్తి చెందిన తర్వాతే ఎఫ్‌డీఏ అత్యవసర వినియోగానికి అనుమతినిచ్చింది. కరోనాని తరిమికొట్టడానికి ఈ వ్యాక్సిన్‌ కూడా కీలకపాత్ర పోషిస్తుంది’’అని బైడెన్‌ చెప్పారు. వీలైనంత తొందరగా దేశంలో అత్యధిక మందికి వ్యాక్సిన్‌ డోసులు ఇస్తేనే కరోనా ఉధృతిని కట్టడి చేయగలమని అన్నారు. ప్రపంచంలోనే కరోనా వైరస్‌తో అత్యధికంగా అమెరికాలోనే 5 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.

దక్షిణాఫ్రికా స్ట్రెయిన్‌ను అడ్డుకోగలదు
అమెరికా, లాటిన్‌ అమెరికా, దక్షిణాఫ్రికాలో నిర్వహించిన ప్రయోగాల్లో జేఅండ్‌జే వ్యాక్సిన్‌ అత్యంత సురక్షితమైనది, సామర్థ్యమైనదని తేలింది. కరోనా వైరస్‌పై 85% సామర్థ్యంతో ఈ వ్యాక్సిన్‌ పని చేస్తుందని వివిధ ప్రయోగాలు వెల్లడించాయి. దక్షిణాఫ్రికా వేరియెంట్‌పైన కూడా ఈ టీకా అద్భుతంగా పని చేస్తోందని ప్రాథమికంగా నిర్వహించిన అధ్యయనంలో తేలింది. ఈ ఏడాది చివరి నాటికి కోటి డోసుల్ని ఉత్పత్తి చేయాలని సంస్థ లక్ష్యంగా నిర్ణయించింది. జాన్సన్‌ వ్యాక్సిన్‌ నిల్వ చేయడం కూడా చాలా సులభం. ఫైజర్, మోడెర్నా మాదిరిగా అత్యంత శీతల వాతావరణంలో ఉంచాల్సిన పని లేదు. సాధారణ రిఫ్రిజిరేటర్లలో కూడా మూడు నెలల పాటు ఈ టీకా నిల్వ ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here