నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్న నేపథ్యంలో కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌పై ఆరెస్సెస్ సీనియర్ నేత రఘునందన్ శర్మ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

తోమర్‌కు అధికార మదం తలకెక్కిందని ఆయన విరుచుకుపడ్డారు. జాతీయతను బలపరిచే దిశగా పనిచేయాలని మంత్రికి సూచించారు. ‘‘నరేంద్రజీ! మీరు ప్రభుత్వంలో భాగం. రైతులకు సాయం చేయడమే మీ ఉద్దేశం కావొచ్చు. అయితే కొంతమంది తమకు సాయం వద్దంటున్నారు. వారికి బలవంతంగా మంచి చేసేందుకు ప్రయత్నించడం వల్ల ఏంటి లాభం? నగ్నంగా ఉండాలనుకుంటున్న వారికి బలవంతంగా దుస్తులు ధరింపచేయడం వల్ల లాభం లేదు. మీ కృషి వల్ల ఫలాలు వస్తున్నాయనుకుంటే అది మీ భ్రమ’’ అని శర్మ తన ఫేస్‌బుక్ పోస్టులో వ్యాఖ్యానించారు.