న్యూఢిల్లీ: భారత యువ షూటర్ మను భాకర్‌కు ఢిల్లీ విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. శుక్రవారం భోపాల్‌లో శిక్షణకు వెళ్తున్న తనను ఎయిరిండియా సిబ్బంది ఘోరంగా అవమానించారని, నేరస్థురాలిగా చూశారని వాపోయింది. ‘ఆయుధాలు తీసుకెళ్లేందుకు అనుమతి పత్రాలున్నా.. విమానం ఎక్కనివ్వకుండా వేధింపులకు గురి చేశారు. మొబైల్ తీసుకొని ఫొటోలను డిలీట్ చేశారు. రెండు పిస్టళ్లు, బుల్లెట్లు తీసుకెళ్లేందుకు రూ. 10,200 లంచం అడిగార’ని మను ఆరోపించింది. తనకు ఎదురైన ఇబ్బందులను భాకర్.. కేంద్ర క్రీడా మంత్రి కిరణ్ రిజిజు, విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీకి ట్వీట్ చేసింది. వెంటనే క్రీడాశాఖ జోక్యంతో భాకర్ విమానం ఎక్కేందుకు మార్గం సుగమైంది.
