పంచాయతీ ఎన్నికలు ఆపడానికి చేసిన చివరి ప్రయత్నం కూడా గురువారం కోర్టు ఇచ్చిన తీర్పుతో వీగిపోయిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ అన్నారు. సుహృద్భావ వాతావరణంలో ఎన్నికలు జరపడానికి అన్ని అడ్డంకులూ తొలగిపోయాయని తెలిపారు. గురువారం ఆయన నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల అధికారులతో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. అనంతరం నెల్లూరు, ఒంగోలు, గుంటూరుల్లో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) తాజాగా తీసుకొచ్చిన ఈ-వాచ్ యాప్‌పై ఎలాంటి అపోహలు అవసరం లేదన్నారు. ‘పూర్తి పారదర్శకంగా, సత్వర న్యాయం అందేవిధంగా యాప్‌ను రూపొందించాం. ఇది స్వయంగా మేం తయారు చేసిందే. అనుభవజ్ఞుడైన సెక్రటరీ ద్వారా చేయించాం. దీనిపై కూడా హైకోర్టులో నాలుగు కేసులు పడ్డాయని విన్నాం. అవేమీ నిలబడేవి కావు. కేంద్ర ఎన్నికల సంఘానికి సీ-విజిల్ ఉన్నా వారు ఇతర వ్యవస్థలతో పంచుకోరు. వ్యవస్థలపై అందరం నమ్మకం ఉంచాలి

ఎస్‌ఈసీకి విస్తృతాధికారాలు ఉన్నాయి. అయితే ఎన్నికల వరకే మా పరిధి. నేనెప్పుడూ పరిధి దాటి వ్యవహరించలేదు. ఎన్నికల వల్ల గ్రామాల్లో వాతావరణం కలుషితమవుతుంది.. కక్షలు పెరుగుతాయని కొందరు అంటున్నారు. ఆ వాదన సరికాదు. అందరి ఆమోదంతో జరిగే ఏకగ్రీవాలను స్వాగతిస్తాను. ప్రలోభాలతోనో, బెదిరింపులతోనో జరిగితే ఉపేక్షించను. అసెంబ్లీ, పార్లమెంటుకు ఏకగ్రీవాలు జరగవు కదా! మరి స్థానిక సంస్థలకు ఎందుకు? ఏకగ్రీవాలను గుడ్డిగా ఆమోదించొద్దు.. వాటిని తులనాత్మకంగా పరిశీలించాలని కలెక్టర్లకు సూచించాను. గతంలో రెండు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరిగేవి. కానీ ఉద్యోగుల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ సారి నాలుగు దశల్లో నిర్వహిస్తున్నాం. నిజాయితీ, నిబద్ధతతో ఎన్నికలు నిర్వహిస్తామని ఉద్యోగులు చెప్పడం శుభపరిణామం’ అని తెలిపారు.