‘అధికార’ అభ్యర్థులకు వలంటీర్ల ప్రచారం!

0
223
Spread the love

పురపాలక ఎన్నికల్లో వార్డు వలంటీర్లు అధికార పార్టీ అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని.. ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని ఫిర్యాదులు అందాయని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) హైకోర్టుకు నివేదించింది. ఈ నేపథ్యంలోనే వారిని ఎన్నికలకు దూరంగా ఉంచుతూ ఉత్తర్వులు జారీచేసినట్లు తెలిపింది. పంచాయతీ ఎన్నికల సందర్భంగా గ్రామ వలంటీర్లపై 600 ఫిర్యాదులు అందాయని.. అయితే అవి పార్టీరహిత ఎన్నికలు కావడంతో ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేయలేదని ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది అశ్వనీకుమార్‌ తెలిపారు. పురపాలక ఎన్నికలు పార్టీ గుర్తులపై జరుగుతున్నాయని.. అధికార పార్టీ అభ్యర్థికి కాకుండా ప్రత్యర్థికి ఓటేస్తారనుకున్న వారికి ఓటరు స్లిప్పులు పంపిణీ చేయడం లేదని.. వలంటీర్లు అధికార పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికలు నిష్పాక్షికంగా నిర్వహించడం కోసమే వారిని ఈ ప్రక్రియకు దూరంగా ఉంచామన్నారు. పెన్షన్‌ పంపిణీ విషయంలో తాము అభ్యంతరం చెప్పడం లేదని స్పష్టం చేశారు. మంగళవారం హైకోర్టులో వాదనలు ముగియడంతో న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎ్‌సఎస్‌ సోమయాజులు తీర్పును బుధవారానికి వాయిదా వేశారు. మున్సిపల్‌ ఎన్నికల్లో వార్డు వలంటీర్లను దూరంగా ఉంచుతూ ఎస్‌ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ప్రభుత్వం సోమవారం అత్యవసర పిటిషన్‌ దాఖలు చేసింది.

ఆ ఉత్తర్వులను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ గ్రామ/వార్డు సచివాలయాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.అజయ్‌ జైన్‌ వ్యాజ్యం వేశారు. మరోవైపు వార్డు వలంటీర్లు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని.. ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు వారిని విధులకు దూరంగా ఉంచాలని విశాఖ తూర్పు టీడీపీ ఎమెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై మంగళవారం విచారణ జరిగింది. ప్రభుత్వం తరఫు న్యాయవాది సి.సుమన్‌ వాదనలు వినిపిస్తూ.. ఎన్నికలతో వలంటీర్లకు సంబంధం లేదని.. ఓటర్‌ స్లిప్పుల పంపిణీ సచివాలయ సిబ్బంది చేపడతారని పేర్కొన్నారు. వలంటీర్ల వద్ద పథకాల లబ్ధిదారుల వివరాలు మాత్రమే ఉంటాయని.. మొత్తం డేటా ఉండదన్నారు. కరోనా టీకా విషయంలో ప్రస్తుతం వివరాలు సేకరిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన సెల్‌ ఫోన్లు లేకుండా వలంటీర్లు విధులు నిర్వహించలేరన్నారు.

పథకాలు నిలిపేస్తామని బెదిరింపులు

వెలగపూడి తరఫు న్యాయవాది ప్రణతి వాదనలు వినిపిస్తూ.. ‘అధికార పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేయకపోతే సంక్షేమ పథకాల ప్రయోజనాలను నిలిపివేస్తామని వలంటీర్లు బెదిరిస్తున్నారు. వారి దగ్గర సెల్‌ ఫోన్లలో ఉన్న లబ్ధిదారుల సమాచారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. అఽ కరోనా సమయంలో మొబైల్‌ ఫోన్లు లేకుండా పెన్షన్లు పంపిణీ చేశారు. ఎన్నికలు ముగిసేవరకు ఫోన్లు స్వాధీనం చేసుకోవడం వల్ల ఎలాంటి నష్టం జరగదు’ అని తెలిపారు. వలంటీర్లు ఓటర్లను ప్రభావితం చేస్తున్నారనడానికి సాక్ష్యాలు ఉన్నాయని ప్రభాకర్‌రెడ్డి తరఫు న్యాయవాది హరీశ్‌ అన్నారు. ఎన్నికలు ముగిసేవరకు వారి జోక్యాన్ని నిలువరించాలని కోరారు. అధికార పార్టీ అభ్యర్థికి ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని బెదిరిస్తున్నారని తెలిపారు.

వలంటీర్‌కు ఎమ్మెల్యే బెదిరింపు

సోషల్‌

మీడియాలో వైరల్‌

ద్వారకాతిరుమల, మార్చి 2: పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు వలంటీరును బెదిరించిన ఫోన్‌ సంభాషణ సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. రాజుపాలెం వలంటీర్‌తో ఎమ్మెల్యే ఫోన్‌ సంభాషణ ఇలా సాగింది. మొన్న ఎన్నికల్లో ఎవరికి చేశావు.. ఎదవ డ్రామాలు.. (అసభ్య పదజాలంతో దూషణ).. పార్టీ కావాలా నీకు.. ఉద్యోగం ఎవరిచ్చారు.. జగన్‌ ఇచ్చారా.. టీడీపీ వారు ఇచ్చారా.. వెధవ వేషాలు వేస్తున్నావంట… దేవరపల్లి వచ్చి కనిపించు… నేను ఎమ్మెల్యేను మాట్లాడుతున్నా.. నా వద్ద రిపోర్టు ఉంది.. అపుడు చెబుతాను.. ఈ ఫోన్‌ సంభాషణ ఇప్పుడు వైరల్‌ అవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here