రాష్ట్రంలో సౌర విద్యుత్ కొనుగోలుకు తాజా టెండర్లలో వచ్చిన ధర విద్యుత్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గుజరాత్, రాజస్థాన్‌తో పోలిస్తే ఇక్కడ ఒక యూనిట్‌కు అర్ధ రూపాయి ఎక్కువకు టెండర్లు వచ్చాయి. కొనుగోలు ఒప్పందం అమల్లో ఉండే కాలాన్ని పరిగణనలోకి తీసుకొని లెక్కవేస్తే ఈ అర్ధ రూపాయి విలువే రూ. 17 వేల కోట్లు దాటనుంది. గుజరాత్‌లో నాలుగు నెలల వ్యవధిలో విడివిడిగా రెండుసార్లు టెండర్లు నిర్వహిస్తే ఇదే విద్యుత్ ధర ఒక యూనిట్‌కు 80 పైసలు తగ్గిపోయింది. తగ్గిన ధరల ప్రయోజనం పొందడానికి ఆ రాష్ట్రం 4 నెలల ముందు పిలిచిన టెండర్లను రద్దు చేసింది. ధరల విషయంలో ఇతర రాష్ట్రాలు ఇంత ఖచ్చితంగా ఉండగా.. మన రాష్ట్రం ఏం చేయనున్నదనే చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో 6,600 మెగావాట్ల సౌర విద్యుదు త్పత్తి కేంద్రాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల టెండర్లు పిలిచింది. ఐదు సంస్థలు ఇందులో పాల్గొన్నాయి. అధికారు లు ఈ టెండర్లను తెరవడంతోపాటు రివర్స్ టెండరింగూ నిర్వహించారు. కానీ రివర్స్ టెండరింగ్‌లో పెద్దగా ధర తగ్గలేదు. ఒక యూనిట్ ధరను రూ.2.48 నుంచి రూ.2.58 వర కూ ఈ సంస్థలు కోట్ చేశాయి.

ఈ ప్రకారం అదానీ సంస్థకు 3 వేల మెగావాట్లు, షిరిడీ సాయి సంస్థకు 3,200 మెగావా ట్లు, ఎన్‌టీపీసీ సంస్థకు 600 మెగావాట్లు, టొరెంట్ పవర్‌కు 300 మెగావాట్లు, హెచ్‌ఈఎస్ ఇన్‌ఫ్రాకు 300 మెగావాట్ల ఉత్పత్తికి అనుమతి లభించే అవకాశం ఉందని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. ఈ ధరల్లో పన్నులు కూడా కలిపితే ఒక యూనిట్ ధర మరో పదిహేను నుంచి ఇరవైపైసలు అదనంగా ఉం టుందంటున్నారు. ఈ ధరలను ప్రభుత్వం ఆమోదిస్తే ఈ రేటుకు వాటి నుంచి విద్యుత్‌ను 30ఏళ్లపాటు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. పొరుగు రాష్ట్రాల్లో సౌరవిద్యుత్ ధర ఒక యూనిట్ రూ.2 లోపు సమయంలో, రాష్ట్రంలో అర్ధ రూపాయి ఎక్కువ రావడంపై విస్మయం వ్యక్తం అవుతోంది.
గుదిబండేనా!
‘‘ఇప్పుడు వచ్చిన టెండర్లలో ధరను మన రాష్ట్ర ప్రభుత్వం ఆమోదిస్తే అదే ధరను 30 ఏళ్లపాటు ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుంది. ఈ భారమంతా వినియోగదారులే మోయాల్సి ఉంటుంది. ఇప్పటికే రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ సంస్థలు భారీ నష్ట్రాల్లో ఉన్నాయి. ఈ సమయంలో మళ్లీ ఇంత అదనపు భారం తలకెత్తుకోవడం సమర్థనీయం కాదు. దేశవ్యాప్తంగా సౌర విద్యుత్ ధరలు తగ్గిపోతున్న సమయంలో ఇప్పుడు వచ్చిన ధరలు ఆమోదిస్తే అవి గుదిబండలా మారతాయి’’ అని ఓ నిపుణుడు హెచ్చరించారు. సౌర విద్యుత్ తయారీకి ఉపకరించే మాడ్యూల్స్ ధరలు బాగా తగ్గుతున్నాయని, టెక్నాలజీలో వస్తున్న మార్పుల వల్ల ఆ మాడ్యూల్స్‌లో ఉత్పత్తయ్యే సౌర విద్యుత్ పరిమాణం పెరుగుతోందని, అందువల్లే విద్యుత్ ధరలు తగ్గుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. మున్ముందు సౌర విద్యుత్ ధర ఒక యూనిట్ రూపాయిన్నరకు పడిపోతుందని అంచనాలు వస్తున్నాయని, దానిని పరిగణనలోకి తీసుకొంటే రాష్ట్రం అదనంగా చెల్లించే మొత్తం రూ.30 వేల కోట్లు దాటిపోతుందని మరో నిపుణుడు హెచ్చరించారు. తాజాగా తెరిచిన టెండర్లను ప్రభుత్వం ఇంకా ఖరారు చేయలేదు. వాటిని తెరవవచ్చుగాని ఖరారు చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. నిబంధనలకు విరుద్ధంగా టెండర్ నిబంధనలు ఉన్నాయంటూ టాటా పవర్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ ఉత్తర్వు జారీ అయింది.
ఇలా తగ్గించుకొన్నాయి..
రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలు ఇటీవల నిర్వహించిన సౌర టెండర్లలో ఒక యూనిట్ రూ. 1.99 పైసలకే సరఫరా చేస్తామని కొన్ని సంస్థలు ముందుకు వచ్చాయి. గుజరాత్‌లో ఇంకా ఆసక్తికర పరిణామం చోటు చేసుకొంది. గుజరాత్‌లో ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో ధొలెరో సౌర విద్యుత్ పార్కు కోసం నిర్వహించిన టెండర్లలో ఒక యూనిట్ ధర రూ. 2.78 నుంచి రూ. 2.81 వరకూ పలికింది. ఆ వెంటనే నిర్వహించిన రఘానెస్దా సౌర విద్యుత్ పార్క్‌లో విద్యుత్ ధర కొద్దిగా తగ్గి రూ. 2.73కు వచ్చింది. ఇదే రాష్ట్రం ఇటీవల డిసెంబరులో ఐదు వందల మెగావాట్ల కోసం మళ్లీ టెండర్లు పిలిస్తే ఈసారి ఆ ధరను రూ. 1. 99 పైసలకు తగ్గిస్తూ ఐదు సంస్థలు టెండర్లు వేశాయి. తగ్గిపోతున్న ధరల ప్రయోజనాన్ని అందుకోవడానికి ఆ రాష్ట్రం ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో పిలిచిన రెండు టెండర్లను రద్దు చేసేసింది.