ఆ పోలీసులను శిక్షించండి!

0
180
Spread the love

ఎన్నికల్లో పంచాయతీలను ఏకగ్రీవం చేసుకోవడంలో వైసీపీ నేతలకు పోలీసులు సహకరిస్తున్నారని రాష్ట్ర ఎన్నికల సంఘానికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఫిర్యాదు చేశారు. గుంటూరుజిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో టీడీపీ నేతలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసినట్టు ఎస్‌ఈసీకి తెలిపారు. ‘‘టీడీపీ కార్యకర్తలపై పోలీసులు దాడులకు తెగబడుతూ, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ప్రతిపక్ష అభ్యర్థులను బెదిరిస్తున్నారు. కర్నూలు జిల్లా డోన్‌ డీఎస్పీ నరసింహారెడ్డి, డోన్‌, ప్యాపిలి, జలదుర్గం, బేతంచర్ల సీఐలు, ఎస్‌ఐలపై చర్యలు తీసుకోవాలి’’ అంటూ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌కు చంద్రబాబు సోమవారం వేర్వేరుగా లేఖలు రాశారు. ‘‘కర్నూలు జిల్లా డోన్‌ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి..పోలీసులను ప్రభావితం చేస్తున్నారు. కొమ్మెమర్రి గ్రామంలో ప్రతిపక్ష అభ్యర్థి సుంకాలమ్మ, భర్త సుంకన్నను ఈనెల12న ప్యాపిలి, జలదుర్గం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్‌అండ్‌బీ రోడ్డు ధ్వంసం చేశారని వారిపై అక్రమ కేసు బనాయించారు.

ఆర్‌అండ్‌బీకి వారు రూ.8వేలు జరిమానా చెల్లించారు. ఇంజనీరు ఆ కేసు వెనక్కి తీసుకున్నారు. అయినా, సుంకాలమ్మ కుమారుడు నరసింహులును కస్టడీలోకి తీసుకుని, వేధిస్తున్నారు. గుంటూరు జిల్లా క్రోసూరు మండలం ఆవులవారిపాలెంలో ప్రతిపక్షాలు బలపరిచిన అభ్యర్థులను పోలీసులు బెదిరిస్తున్నారు. అక్కడి సర్పంచ్‌ అభ్యర్ధి శ్రీనివాసరావుతో పాటు 10మంది టీడీపీ మద్దతుదారులను అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల విధులకు అడ్డు పడ్డారన్న నెపంతో శ్రీనివాసరావుపై అక్రమ కేసు బనాయించారు. నామినేషన్‌ ఉపసంహరించుకోవాలని బెదిరించారు. పోలీ్‌సస్టేషన్‌ ముందు తెలుగుదేశం కార్యకర్తలు ధర్నా చేయడంతో విడుదల చేశారు. ఈ అక్రమ అరెస్టులపై సమగ్ర విచారణ జరపాలి’’ అని ఆ లేఖల్లో చంద్రబాబు కోరారు. చిత్తూరుజిల్లా కుప్పం, గుండేపల్లి, శాంతిపురం, రామకుప్పం మండలాల్లో 41 గ్రామ పంచాయతీల్లో సంఘ విద్రోహశక్తులు శాంతిభద్రతలకు విఘాతం కలిస్తున్నాయని తన ఫిర్యాదులో చంద్రబాబు తెలిపారు. ‘‘చిత్తూరుజిల్లా డీసీసీ అధ్యక్షుడు సురేశ్‌బాబుపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రతిపక్ష నాయకులపై దాడులకు పాల్పడుతున్నారనడానికి ఇదో ఉదాహరణ. కుప్పం పరిధిలో ఈనెల17న జరిగే పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు అవరోధం సృష్టించాలని చూస్తున్నారు. స్థానికులు ఇచ్చిన ఈ సమాచారంపై ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలి. సమగ్ర విచారణ జరిపి, ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలి. పులివెందుల నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న టీడీపీ మద్దతు అభ్యర్థుల పొలాలను నాశనం చేస్తున్నారు. వారిని గుర్తించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలి’’ అని కోరారు.

వైసీపీకి సిగ్గురావట్లా

విద్వేషం, విధ్వంసం, అజెండాతో వైసీపీ నేతలు రాష్ట్రాన్ని రావణకాష్టంగా మారుస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల్లో అధికార పక్షం అరాచకాలకు పాల్పడుతున్నదని సోమవారం ఒక ప్రకటనలో చంద్రబాబు మండిపడ్డారు. ‘‘పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తున్నా..అధికార పార్టీ నేతలకు ఏమాత్రం సిగ్గురావడం లేదు. టీడీపీ అభ్యర్థులకు ప్రజల మద్దతు పెరుగుతుండటంతో అక్రమ అరెస్టులు, దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. పులివెందులలో టీడీపీ మద్దతుదారుల పొలాలను నాశనం చేయడం వైసీపీ నేతల అభద్రతాభావానికి నిదర్శనం. పోలీసుల ఉదాసీనత వల్లే వైసీపీ దాడులు, దౌర్జన్యాలు నానాటికీ పెరిగిపోతున్నాయి’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here