చిత్తూరు పలమనేరు రోడ్డులోని ఓ కాంప్లెక్సులో కొంగారెడ్డిపల్లె సమీపంలోని సత్యనారాయణపురానికి చెందిన భాస్కర్ బార్బర్‌షాప్ నిర్వహిస్తున్నాడు.

శుక్రవారం తన షాపునకు సంబంధించిన కరెంటు బిల్లును ఫోన్లోని ఓ పేమెంట్ యాప్ ద్వారా కట్టాడు. బ్యాంకు ఖాతా నుంచి డబ్బు డెబిట్ కాగా.. బిల్లు మాత్రం ఫెయిల్డ్ అయినట్లు మెసేజ్ వచ్చింది. గాబరాపడిన ఆయన పక్కనున్న వారికి చెప్పగా.. వారు కస్టమర్ కేర్‌ను సంప్రదించాలని ఓ నెంబరు ఇచ్చారు. దానికి ఫోన్ చేసి విషయం చెప్పగా.. అవతలి వ్యక్తి వేరే పేమెంట్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే ఇటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పాడు. ఇందుకోసం ఓ నెంబరు ఇస్తానని దానికి ఫోన్‌చేసి తనను కాన్ఫరెన్స్‌లో పెట్టమన్నాడు.
అతను చెప్పినట్లే భాస్కర్ మరో నెంబరుకు ఫోన్‌చేసి, కాన్ఫరెన్స్ పెట్టాడు. ఈ సందర్భంగా వారిద్దరూ.. బాధితుడి బ్యాంకు ఖాతా, పిన్ నెంబరు, ఫోన్‌నెంబరు తదితర వివరాలన్నీ తీసుకున్నారు. మరో పేమెంట్ యాప్‌ను భాస్కర్ ఫోన్లో ఇన్‌స్టాల్ చేయిస్తున్నట్లు నమ్మించి.. రూ.99,650 కొట్టేశారు. డబ్బు పోయిందన్న విషయం ఫోన్ పెట్టేశాక తెలిసి.. ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ మోహన్ కుమార్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.