‘‘ఇప్పటి వరకు గడిచిన పాలన ఒక ఎత్తు, ఇక నుంచి జరగబోయే పాలన మరో ఎత్తు’’ అని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఈ 20 నెలల పాలనలో అధికారులందరూ సమష్టిగా కృషి చేశారని, అయితే, వచ్చే రోజులు మరింత ప్రాధాన్యమైనవని విశ్రాంతికి అవకాశం లేకుండా అందరూ కష్టపడి పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు ‘నవరత్నాలు-20 నెలల పాలన’పై బుధవారం నిర్వహించిన సమీక్షలో సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘పరిపాలనలో ఇరవై నెలలు అంటే దాదాపు మూడో వంతు సమయం గడచిపోయింది. అంటే మిడిల్ ఓవర్లలోకి వచ్చాం. కాబట్టి ఇప్పుడు విశ్రాంతికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు. ఒకవేళ అదే జరిగితే మనం వెనుకబడిపోకతప్పదు. ఇప్పుడు మనమంతా దృష్టిని తిరిగి కేంద్రీకరించాల్సి ఉంది. ఇప్పటి వరకు ఏం చేశాం? ఇంకా ఏమైనా మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందా? అన్ని శాఖల మధ్య సమన్వయం ఉందా? వంటి విషయాలపై దృష్టి పెట్టాలి. ఆ మేరకు అన్నింటినీ సరిచూసుకోవాలి. సహజంగా ఈ సమయంలో అందరూ బ్రేక్ తీసుకుంటారు. అది జరగకూడదు. అప్పుడే మరింత ముందుకు వెళ్లగలుగుతాం. నో రిలాక్స్’’ అని ప్రభుత్వశాఖల కార్యదర్శులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు.

ఈ 20 నెలల్లో కలెక్టర్లు, ఎస్పీల సమావేశం మినహా.. పాలనపై ఏకమొత్తంలో తొలిసారిగా ప్రభుత్వ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ సమావేశాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సీఎం జగన్ మాట్లాడుతూ.. పేదల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చే నవరత్నాలను రాష్ట్ర ప్రభుత్వం సొంతం చేసుకోవాల్సి ఉందని కార్యదర్శులకు సూచించారు. ‘‘పాలనలో ఇక విరామం లేదు. సమష్టిగా 20 నెలల పాలన అందించాం. క్రికెట్‌లో కెప్టెన్ ఒక్కడి వల్లనే గెలుపు సాధ్యం కాదు. మొత్తం జట్టంతా కలసి కృషి చేస్తేనే విజయం సాధ్యం. రాష్ట్రంలో ప్రభుత్వ శాఖలకు సమర్ధులైన కార్యదర్శులు ఉన్నందుకు దేవుడికి కృతజ్ఞతలు చెబుతున్నా. మీలో ప్రతి ఒక్కరూ ఎంతో నిష్ణాతులు. అందరూ సమష్టిగా కృషి చేయడం వల్లే రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగలిగాం. దిశ చట్టంతో మహిళలు పిల్లలకు భద్రతను కల్పించడంలో విప్లవాత్మక పరిణామం తీసుకువచ్చాం. ఆ తర్వాత గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ఇలా చెప్పుకుంటూపోతే జాబితాలో ఇంకా ఎన్నో ఉన్నాయి’’ అని సీఎం అన్నారు.
సీఎ్‌సకు అభినందన
20 నెలల ప్రభుత్వ పాలనపై సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌ను సీఎం జగన్ ప్రత్యేకంగా అభినందించారు. నిజానికి ఇలాంటి సమావేశాలు తరచూ జరగాల్సి ఉందన్నారు. ఈ సమావేశాల వల్ల వివిధ శాఖల మధ్య మరింత సమన్వయం పెరుగుతుందన్నారు. ఆర్థికపరమైన సమస్యల పరిష్కారానికి ఆ శాఖ కార్యదర్శికి తగిన నిర్దేశాలు ఇస్తానని చెప్పారు. విశేషానుభవం ఉన్న కార్యదర్శులు తమ ఆలోచనలు నిస్సంకోచంగా తనకు తెలియజేయాలని జగన్ సూచించారు. కార్యదర్శులు అందించే సూచనలు, సలహాలు అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ‘‘ఎన్నికల మేనిఫెస్టోను.. ఎన్నికల తర్వాత చెత్తబుట్టలో వేసే నాయకులను నేను చూశా. కానీ, మన ప్రభుత్వం ప్రతిరోజూ మేనిఫెస్టో కళ్ల ముందు కనిపించేలా.. కర్తవ్యాన్ని గుర్తు చేసేలా గోడకు తగిలించాం’’ అని సీఎం చెప్పారు. తాను అధికారం చేపట్టేనాటికి రూ.60 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని.. వాటిలో దాదాపు రూ.21 వేల కోట్లు విద్యుత్ సంస్థలకు సంబంధించినవిగా ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రావత్ తనకు వివరించారని సీఎం జగన్ తెలిపారు. గత ప్రభుత్వంలో గ్రామస్థాయిలో అవినీతి జరిగిందని, కేంద్రంతో పాటు పొరుగు రాష్ట్రాలతోనూ సఖ్యత లేదన్నారు