కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించడాన్ని నిరసిస్తూ ఏపీ ప్రజలు చేస్తున్న పోరాటానికి టీఆర్‌ఎస్ తరఫున మద్దతు తెలుపుతున్నామని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. అవసరమైతే సీఎం కేసీఆర్ అనుమతితో ఉద్యమంలో కూడా పాల్గొంటామని తెలిపారు. బుధవారం జలవిహార్‌లో తెలంగాణ రికగ్నైజ్‌డ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాఠశాలల కరస్పాండెంట్లు, టీచర్లతో ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రత్యేక సమావేశంలో, మేడ్చల్‌లో తెలంగాణ విద్యుత్తు ఇంజనీర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ఏపీ పునర్విభజన చట్టంలో తెలంగాణ ఏర్పాటు చేసుకున్నప్పుడే చెప్పినరు.

తెలంగాణలోని బయ్యారంలో సెయిల్ ద్వారా ఒక ఉక్కు కర్మాగారం పెడతం. వేలమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఇప్పుడేం చేస్తున్నరు.. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అని మన సోదరులు పోరాడి సాధించుకున్న ఉక్కు కర్మాగారాన్ని అమ్మేసే ప్రయత్నం చేస్తున్నరు. అక్కడ వేలాదిమంది రోడ్డునపడ్డ ఉద్యోగులు ఉద్యమాలు చేస్తున్నరు. వారికి ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్న. మీకు మేమందరం నైతికంగా అండగా ఉన్నాం. అవసరమైతే కేసీఆర్ అనుమతి తీసుకొని వైజాగ్‌కు వచ్చి ప్రత్యక్షం గా మద్దతు తెలుపుతాం. ఇవాళ విశాఖ ఉక్కు అమ్ముతున్నరు.
రేపు బీహెచ్‌ఈఎల్, ఎల్లుండి సింగరేణి అమ్ముతరు. తర్వాత రాష్ట్రప్రభుత్వం ఎందుకూ వీటిని కూడా ప్రైవేట్‌పరం చేయమంటరు. ప్రభుత్వరంగ సంస్థలను అమ్మే క్రమంలో తెలంగాణలో ఏమైనా జరిగినా ఏపీ సోదరులు మాతో కలిసి రావాలని కోరుతున్నాం’’ అని కేటీఆర్ అన్నారు. ఇదిలా ఉండగా, విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు చేపట్టిన ఉద్యమానికి సంఘీభావం తెలిపిన తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కృతజ్ఞతలు తెలిపింది.