
నష్టాలు వస్తున్నాయి. కష్టాలు ఉన్నాయి. ప్రైవేటీకరణ చేసేస్తాం’ అంటూ మొండి వాదన చేస్తున్న కేంద్రానికి… విశాఖ ఉక్కు కర్మాగారం కార్మికులు తిరుగులేని సమాధానం ఇచ్చారు. ఒక వైపు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తూనే… మరోవైపు రికార్డు స్థాయిలో ఉక్కు ఉత్పత్తి సాధించారు. 2020-21తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి స్టీల్‌ప్లాంటు రూ.18వేల కోట్ల విలువైన ఉత్పత్తులను విక్రయించింది. ఇది గత ఏడాదితో పోల్చితే 13 శాతం అధికం. అంతేకాదు… ఈ స్థాయి విక్రయాలు సాధించడం విశాఖ ఉక్కు చరిత్రలోనే ఇది రెండోసారి కావడం విశేషం. కర్మాగారం సీఎండీ పీకే రథ్ గురువారం మీడియాకు ఈ వివరాలు తెలిపారు. ‘‘ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యం 63 లక్షల టన్నులు. కానీ, ఈ ఏడాది అంతకు మించి ఉత్పత్తి జరిగింది. అందులో 45 లక్షల టన్నులు విక్రయించాం’’ అని తెలిపారు. విదేశాలకు 13 లక్షల టన్నులు ఎగుమతి చేశామని, ఇది అంతకు ముందు కంటే 261 శాతం అధికమని చెప్పారు. సామాజిక సేవా కార్యక్రమాలకు రూ.10 కోట్లు వెచ్చించామని తెలిపారు.
‘ఆందోళన’లు అధిగమించి…
విశాఖ ప్లాంటులో మూడు బ్లాస్ట్‌ఫర్నే్‌సలు ఉండగా… గత కొంతకాలంగా ఒక్కటే పనిచేస్తోంది. మరోవైపు… విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్మికులు ఆందోళనలూ చేస్తున్నారు. అయినా… ఉత్పత్తిపై ప్రభావం పడకుండా, అదనపు ఉత్పత్తి సాధించడం గమనార్హం. ఈ ఏడాది మార్చి నెలలోనే 7.11 లక్షల టన్నుల స్టీల్‌ను విక్రయించగా రూ.3,300 కోట్ల ఆదాయం వచ్చింది. కర్మాగారంలో ఒక్క నెలలో ఇంత ఆదాయం రావడం ఇదే తొలిసారి. విశాఖ ఉక్కుకు సొంత గనులు లేకపోవడంతో… ఇనుప ఖనిజం కొనుగోలుకు రూ.6000 కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇక… ఉక్కు కర్మాగారం విస్తరణ కోసం చేసిన రుణంపై రూ.1500 కోట్లు వడ్డీ చెల్లించారు. ఈ రెండు భారాలు లేకపోతే… విశాఖ ఉక్కుకు రూ.7500 కోట్లు ఆదా అయ్యేవి. స్టీల్‌ప్లాంటుకు సొంత గనులు ఇస్తే ఏడాదికి రూ.2,500 కోట్ల లాభాలు సాధిస్తామని ప్లాంటు గుర్తింపు యూనియన్ అధ్యక్షులు, పోరాట కమిటీ కన్వీనర్ అయోధ్యరామ్ పేర్కొన్నారు. ఇంతకు ముందు నష్టాలకు కారణం మార్కెట్ మందగమనం కొంత అయితే, సొంత గనులు లేకపోవడం మరొక కారణమని స్పష్టంచేశారు. స్టీల్‌ప్లాంటు నష్టాల్లో ఉందని పదే పదే చెబుతున్న కేంద్రం గత ఇరవై ఏళ్లలో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి సాయం చేయలేదని కార్మిక సంఘ నాయకుడు మంత్రి రాజశేఖర్ ఆరోపించారు. ఇంత చక్కటి పనితీరు ప్రదర్శిస్తూ, నాణ్యమైన ఉత్పత్తులు చేస్తున్న ప్లాంటును అమ్మాలనుకోవడం దారుణమని సీఐటీయూ నాయకుడు సీహెచ్ నరసింగరావు అన్నారు. ఇప్పటికైనా కేంద్రం పునరాలోచన చేసి, స్టీల్‌ప్లాంటుకు సొంత గనులు కేటాయించాలని సూచించారు.