పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లూ చేశామని జిల్లా కలెక్టర్లు పంచాయతీరాజ్ ఉన్నతాధికారులకు తెలిపారు.

సోమవారం ఆ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి కన్నబాబు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మొదటి దశ ఎన్నికలకు చేసిన ఏర్పాట్లను సమీక్షించారు. జిల్లాల్లో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అన్ని పంచాయతీలకు సరిపడినన్ని బ్యాలెట్ బాక్సులు తమకు అందాయని, వాటిని ఇప్పటికే శుభ్రపరిచామని.. అలాగే పోలింగ్‌కు అవసరమైన పరిమాణంలో ఇండెలిబుల్ ఇంకు సిద్ధంగా ఉందని కలెక్టర్లు తెలిపారు. ఇప్పటికే పోలింగ్ అధికారుల నియామకం, వారికి శిక్షణ పూర్తయ్యాయని.. రిసెప్షన్, డిస్ట్రిబ్యూషన్, కౌంటింగ్ కేంద్రాలను గుర్తించామని, బ్యాలెట్ పేపర్ల వెరిఫికేషన్ పూర్తి చేశామని వివరించారు. ఎన్నికల నియమావళి అమలుకు ప్రత్యేక అధికారులను నియమించామని, ఎన్నికల గుర్తుల కేటాయింపు, సరిపడినన్ని బ్యాలెట్ పేపర్లు సిద్ధం చేశామన్నారు.కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా మాస్కులు, శానిటైజర్లు సిద్ధం చేయాలని.. ప్రతి జిల్లాకు సరిపడినంత బడ్జెట్‌ను డీపీవోల ఖాతాలకు జమ చేశామని ముఖ్య కార్యదర్శి, కమిషనర్ తెలిపారు. కాగా.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌తో ఎన్నికల కమిషన్ కార్యదర్శి కె.కన్నబాబు సమావేశమయ్యారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా సచివాలయంలో సీఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు