పంచాయితీ ఎన్నికల్లో తమ పార్టీ బలపరిచిన అభ్యర్థులను వీలైనంత వరకూ ఏకగ్రీవం చేసుకోవాలని వైసీపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. మరీ ముఖ్యంగా ఎన్నికల్లో కచ్చితంగా 90శాతం వైసీపీ బలపరిచిన అభ్యర్థులే గెలవాలని మంత్రులు, వైసీపీ నేతలకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు ఇవ్వడంతో నేతలు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో తమకు వచ్చిన ప్రతి అవకాశాన్ని.. ఆఖరికి బెదిరింపులకు దిగి మరీ అనుకున్నది సాధించుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే టీడీపీ బలపరిచిన అభ్యర్థుల్లో పలువుర్ని బెదిరించడం, వార్నింగ్స్ ఇవ్వడం, కిడ్నాప్ చేయడం, కొట్టడం ఇలాంటి ఘటనలు చాలానే వెలుగుచూశాయి.

అయితే తాజాగా మరో కొత్త ప్లాన్‌కు వైసీపీ తెరలేపింది. నవ్యాంధ్రకు మూడు రాజధానులు చేయొద్దని అమరావతే ముద్దని గత కొన్నిరోజులుగా రైతులు, రైతు కూలీలు నిరసనలు చేపడుతున్నారు. ఈ నిరసనలో గుంటూరు, విజయవాడకు చెందిన పలు ప్రాంతాలు రైతులు ఉన్నారు. ఈ ప్రాంతాల్లో తాము బలపరిచిన అభ్యర్థులు ఓడిపోయే పరిస్థితి ఉండటంతో కృష్ణా జిల్లాలో గెలిచేందుకు వైసీపీ కొత్త ఎత్తుగడలు వేస్తోంది. ఏకంగా పోలింగ్ కేంద్రాలనే మార్చేందుకు వైసీపీ నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
కృష్ణా జిల్లా కంచికచెర్లలో పోలింగ్ బూత్‌లు 195,196 మరొక చోటికి మార్చేందుకు అధికారులు, వైసీపీ నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. గతంలో ఉన్న పోలింగ్ కేంద్రం కాకుండా.. ఇప్పుడు ఎందుకు మారుస్తున్నారని కలెక్టర్, ఎన్నికల కమిషన్‌కు టీడీపీ ఫిర్యాదు చేసింది. పాత పోలింగ్ బూత్‌లలోనే వద్దనే ఎన్నికలు నిర్వహించాలని టీడీపీ నేతలు, స్థానికంగా ఉన్న ఓటర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పోలింగ్ బూత్‌ను మారిస్తే ఒప్పుకోమని గ్రామస్థులు చెబుతున్నారు. వెంటనే ఈ విషయంలో అధికారులు, ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుని పరిష్కరించాలని వార్డు ఓటర్లు కోరుతున్నారు.