ఆంధ్రప్రదేశ్ : ఎన్నికల వేళ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు సంయమనంతో మాట్లాడాలని ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సూచించారు. ఎస్‌ఈసీపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయరాదని సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తుచేశారు. ప్రభుత్వ అధికారులతో తనకెలాంటి ఇబ్బందిలేదని ఆయన పేర్కొన్నారు.
విజయవాడలోని తన కార్యాలయంలో సాయంత్రం విలేకరులతో ఎస్‌ఈసీ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఆదిత్యనాథ్, డీజీపీ గౌతమ్ సవాంగ్‌తో తనకు వ్యక్తిగతంగా మంచి సంబంధాలున్నాయని పేర్కొన్నారు.
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణను సుప్రీంకోర్టు సమర్థించిన విషయాన్ని గవర్నర్‌కు తెలియజేసినట్లు ఆయన చెప్పారు. ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నిర్మాణాత్మక సూచన చేసింది.
ఎవరి ప్రాపకం కోసమో తాను అధికారులపై చర్యలు తీసుకుంటున్నట్లు ఓ మంత్రి విమర్శించడాన్ని ఆయన ఖండించారు. తాను ఎవరిపై వ్యక్తిగత కక్ష సాధించడం లేదని, అధికారులను కేవలం సెన్సూర్ మాత్రమే చేశానని పేర్కొన్నారు. తానూ ప్రభుత్వ సర్వీస్ నుంచే వచ్చానని అన్నారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు సక్రమంగా జరుగుతున్నాయని నిమ్మగడ్డ తెలిపారు.
ఏకగ్రీవాల కోసం ప్రభుత్వం పత్రికల్లో ప్రకటన ఇచ్చింది. ప్రకటన ఇచ్చేటప్పుడు ఎస్‌ఈసీని సంప్రదించాలని సూచించారు. ఏకగ్రీవాలపై ఐఅండ్ పీఆర్ ఇచ్చిన ప్రకటనపై ఆ విభాగాన్ని వివరణ కోరినట్లు తెలిపారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఏకగ్రీవాలపై అనేక ఆరోపణలున్నాయని అన్నారు. ఏకగ్రీవాలకు ఎవరూ అభ్యంతరం చెప్పరని, అసంబద్ధంగా పెరిగితే మాత్రం పరిశీలిస్తామని చెప్పారు. ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో ఎస్‌ఈసీ విధులకు భంగం కలిగిస్తే కోర్టుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.