మిగులు భూములు అమ్మితే స్టీల్‌ప్లాంట్ సమస్యలన్నీ తీరిపోతాయన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు, భూనిర్వాసితులు భగ్గుమంటున్నారు. ఎవరి భూముల్ని ఎవరికి అమ్ముతారని తీవ్ర స్థాయిలో నిర్వాసితులు ధ్వజమెత్తుతున్నారు. ‘‘పరిశ్రమ వస్తే మా బతుకులు బాగుపడతాయని ఆనాడు భూములు ఇచ్చాం. ఇప్పుడు ఆ భూములతో వ్యాపారం చేస్తామంటే సహించేది లేదు’’అని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం భూములు వద్దనుకుంటే నిర్వాసిత నిరుద్యోగులకు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ నిర్మాణం కోసం నెలిముక్కు, సిద్ధేశ్వరం, నడుపూరు, గంగవరం, దిబ్బపాలెం, కణితి, అప్పికొండ, వడ్లపూడి, కొండయ్యవలస పంచాయతీల పరిధిలో గల 64 గ్రామాల్లో 1971లో 15 వేల ఎకరాలు ఆనాడు సేకరించారు. అప్పట్లో ఎకరానికి రూ.1,200 చొప్పున చెల్లించారు. ఆ మొత్తం సరిపోదని నిర్వాసితులు ఆందోళన చేయడంతో 1973లో మూడు వేల రూపాయలు చొప్పున ఇచ్చారు.

ప్లాంట్ అవసరాల నిమిత్తం భూమి ఇంకా అవసరమని భావించి.. ఆ తరువాత మరో 11 వేల ఎకరాలు సేకరించారు. అప్పట్లో 16 వేల మందిని నిర్వాసితులుగా గుర్తించారు. భూములు కోల్పోయిన వారికి నష్ట పరిహారం, ఇల్లు కోల్పోయిన వారికి 107 గజాల స్థలం, నిర్వాసితులుగా గుర్తించే కార్డు (ఆర్-కార్డు) ఇచ్చారు. ఇలా సేకరించిన మొత్తం 26 వేల ఎకరాల్లో 18 వేల ఎకరాలు ప్లాంట్ నిర్మాణం, టౌన్‌షిప్ కోసం వినియోగించారు. ఇంకా ప్లాంట్ వద్ద సుమారు ఎనిమిది వేల ఎకరాల భూమి ఉంది. ఇదిలాఉండగా 16 వేల మంది నిర్వాసితుల్లో ఇప్పటివరకూ ఎనిమిది వేల మందికి ఉపాధి కల్పించగా, మరో ఎనిమిది వేల మంది ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నారు. ఇంతలో విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయంతో కేంద్రం ముందుకు రావడం, ఆ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఉక్కు సంఘాలు విశాఖ కేంద్రంగా కొన్నివారాలుగా ఉద్యమిస్తుండటం తెలిసిందే. బుధవారం విశాఖ విచ్చేసిన ముఖ్యమంత్రి జగన్ ఈ సమస్యపై స్పందించారు. స్టీల్‌ప్లాంట్ వద్ద నిరుపయోగంగా ఉన్న ఏడువేల ఎకరాలు విక్రయిస్తే ప్రైవేటీకరణ అవసరం లేకుండానే నిధుల సమస్య తీరిపోతుందని తనను కలిసిన కొందరు కార్మిక సంఘాల నేతల వద్ద అభిప్రాయపడ్డారు. అయితే, సీఎం సూచనను నిర్వాసితులు జీర్ణించుకోలేకపోతున్నారు. అలా చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని గట్టిగానే హెచ్చరిస్తున్నారు. ప్లాంట్ విస్తరణతో ఉపాధి లభిస్తుందని ఆశతో ఎదురుచూస్తున్న సమయంలో ఇలా మాట్లాడటం తగదని నిరుద్యోగ నిర్వాసితులు మరింతగా వాపోతున్నారు. ముందస్తు ప్రణాళికతో భాగంగానే ముఖ్యమంత్రితో జరిగిన సమావేశానికి నిర్వాసితులను పిలవలేదని నిర్వాసితుల ఐక్య సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు.
భూముల విక్రయం…కుదరదంతే!!
‘ఇల్లు కాలి ఏడుస్తుంటే…చుట్ట అంటించుకోవడానికి నిప్పు అడిగినట్టుగా’ సీఎం వైఎస్ జగన్ వ్యవహరిస్తున్నారని విపక్షాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా చూడాలని, సొంత గనులు కేటాయించాలని అంతా డిమాండ్ చేస్తుంటే… ఆయన రియల్ ఎస్టేట్ కబుర్లు చెప్పడం ఏమిటని మండిపడుతున్నారు. ఆయన నిబంధనలు తెలిసే మాట్లాడుతున్నారా… తెలియకుండా మాట్లాడుతున్నారా..అంటూ వామపక్ష నాయకులు ప్రశ్నిస్తున్నారు. ‘‘భారీ పరిశ్రమ కోసం సేకరించిన భూములను లేఅవుట్లు వేసి అమ్ముకోవడం భూసేకరణ నిబంధనలకు విరుద్ధం. దానిని మేం పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం’’ అని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ నరసింగరావు పేర్కొన్నారు. సీఎంకి చిత్తశుద్ధి ఉంటే…సొంత గనులు కేటాయించాలని కేంద్రంపై ఒత్తిడి తేవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పీ మధు డిమాండ్ చేశారు.
స్టేడియం కోసమే ఇవ్వలేదు
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అగనంపూడిలో స్టీల్‌ప్లాంట్‌కు చెందిన 250 ఎకరాల భూములను స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణం కోసం అడిగారు. నాలుగైదుసార్లు చర్చలు జరిగాయి. తమ చేతుల్లో ఏమీ లేదని, కేంద్రం నుంచే అనుమతులు తెచ్చుకోవాలని ప్లాంట్ అధికారులు స్పష్టంచేశారు. దానికి కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ అంగీకరించలేదు. దాంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రతిపాదన విరమించుకుందని కార్మిక నాయకులు గుర్తు చేస్తున్నారు.
అలాచేస్తే విస్తరణ ఎలా?
స్టీల్‌ప్లాంట్‌ను దశల వారీగా 20 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో నడపాలనే ఉద్దేశంతో ఆనాడు 26 వేల ఎకరాల భూములు సేకరించారు. మూడు దశాబ్దాల అనంతరం 7.3 మిలియన్ టన్నుల సామర్థ్యానికి చేరుకుంది. ఇంకా 12.7 మిలియన్ టన్నుల లక్ష్యం సాధించాల్సి ఉంది. అందుకు భూములు చాలా అవసరం. స్టీల్‌ప్లాంట్ పరిసరాల్లో ఉష్ణోగ్రతలు చాలా అధికంగా ఉంటాయి. వాటిని తగ్గించడానికి, పర్యావరణాన్ని సమతుల్యం చేయడానికి పెద్ద సంఖ్యలో మొక్కలు పెంచాలని పర్యావరణ నిబంధనలు చెబుతున్నాయి. ఆ మేరకు ఇక్కడ నాలుగు వేల ఎకరాల్లో మొక్కలు పెంచుతున్నారు. ఉత్పత్తి సామర్థ్యం పెంచితే…మరిన్ని మొక్కలు వేయాల్సి ఉంటుంది. అవన్నీ దృష్టిలో పెట్టుకొనే నాడు భూములు సేకరించారు. ఇప్పుడు ఆ భూములు ఖాళీగా ఉన్నాయని చెప్పి వాటిని విక్రయిస్తే…స్టీల్‌ప్లాంట్ విస్తరణకు ఫుల్‌స్టాప్ పడినట్టే. ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్లీ అన్ని వేల ఎకరాలు సేకరించాలంటే.. అసాధ్యమని వామపక్ష నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అవసరం లేకపోతే మాకే ఇవ్వండి
‘‘ముఖ్యమంత్రి వ్యాఖ్యలు సరికాదు. ప్లాంట్ కోసం భూములు, స్థలాలు ఇచ్చిన నిర్వాసితులు నేడు దుర్భరమైన జీవితం గడుపుతున్నారు. ఒకవేళ భూములు అవసరం లేదనుకుంటే తిరిగి మాకు ఇచ్చేయండి’’
- పితాని భాస్కరరావు, నిర్వాసితుల ఐక్య సంఘం అధ్యక్షుడు
రియల్ ఎస్టేట్ కోసమే ఈ నాటకాలు
‘‘మా భూములతో వ్యాపారం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోంది. పరిశ్రమ కోసం ఇచ్చిన భూములతో వ్యాపారం చేసుకుంటామంటే సహించం. రియల్ ఎస్టేట్ చేసుకోవడానికే ప్రైవేటీకరణ నాటకమాడుతున్నారు. ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ప్రభుత్వం చేతులెత్తేయడం సరికాదు’’
- డి.నరసింగరావు, ఉక్కు నిర్వాసిత నిరుద్యోగి