ఔను… అప్పులు బాగా చేశాం

0
184
Spread the love

రాష్ట్ర ప్రభుత్వం అంచనాలకు మించి అప్పులు చేసిందని, అది నిజమేనని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి అంగీకరించారు. ‘ప్రజల కోసం అప్పులు చేయక తప్పలేదు’ అని తెలిపారు. అలా అప్పు చేసిన మొత్తాన్ని సంక్షేమ పథకాల ద్వారా ప్రజల్లోకి పంప్‌ చేశామని, ఫలితంగా జీఎస్టీ వసూళ్లల్లో దేశంలోనే రాష్ట్రం రెండో స్థానంలో నిలిచిందని బుగ్గన వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం రోజురోజుకూ అప్పుల ఊబిలో కూరుకుపోతున్న సంగతి తెలిసిందే! ఈ నేపథ్యంలో శుక్రవారం బుగ్గన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ‘‘ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.48,290 కోట్లు అప్పులు చేయాలన్నది బడ్జెట్‌లో చూపించిన అంచనా. కానీ… ఇప్పటికే రూ.73వేల కోట్ల అప్పులు తీసుకొచ్చాం. సంక్షేమం కోసమే అప్పులు చేశాం. ఇందులో ఎలాంటి దాపరికం లేదు. ప్రజల కోసం అప్పులు చేశాం. ప్రభుత్వానికి వేరే మార్గం లేదు’’ అని సూటిగా చెప్పారు. కొవిడ్‌ కారణంగా ప్రపంచమే ఆర్థికంగా దిగజారిందని… ఏపీ ఇందుకు మినహాయింపు కాదని చెప్పారు.

‘సంక్షేమం ఎక్కడా ఆగిపోకూడదని సీఎం జగన్‌ భావించారు. అందుకే… ఆదాయం లేకపోయినా భారీగా అప్పులు తీసుకొచ్చి పథకాలు అమలు చేశాం. కేవలం ప్రజల కోసమే ప్రభుత్వం భారీగా రుణాలు సమీకరించాల్సి వచ్చింది. నగదు ఏదో ఒక రూపంలో ప్రజలకు చేరాలన్నదే మా ప్రభుత్వ ఉద్దేశం’’ అని బుగ్గన చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయేనాటికి కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన అప్పులు రూ.60వేల కోట్లు ఉంటే, అవి ఇప్పుడు రూ.లక్ష కోట్లకు చేరినట్లు ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కొవిడ్‌ పరిస్థితుల్లోనూ కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఆర్థికంగా స్థిరంగా ఉన్నాయని, ఎక్కువ రాష్ర్టాల పరిస్థితి దిగజారిందని చెప్పారు. ‘‘ ఈ క్రమంలో కొన్ని రాష్ర్టాలు సంక్షేమ పథకాలను నిలిపివేసి ఉండొచ్చు. కానీ… ఏపీలో సంక్షేమం ఆగలేదు. గత ఏప్రిల్‌, మే నెలల్లో రాబడి తగ్గిపోవడంతోపాటు వైద్య రంగానికి వందలకోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది’’ అని చెప్పారు. రాష్ట్ర రుణ పరిమితిని కేంద్ర ప్రభుత్వం 3 శాతం నుంచి 5శాతానికి పెంచిందని బుగ్గన తెలిపారు. కరోనా నేపథ్యంలో కేంద్రమే రుణ పరిమితిని పెంచిందని తెలిపారు. జీఎ్‌సడీపీలో ఏపీ రుణం 32.7శాతం ఉండగా… కేరళ 30.3శాతం, పంజాబ్‌ 38శాతం, ఉత్తరప్రదేశం 33శాతం, పశ్చిమ బెంగాల్‌ 34శాతం అప్పులు చేశాయని వివరించారు. రాష్ట్రంలో ఉద్యోగుల జీతాలు రూ.29వేల కోట్ల నుంచి రూ.33వేల కోట్లకు పెరిగాయన్నారు.

మందు ఆదాయం తగ్గలేదు

రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్సైజ్‌ ఆదాయం ఏమాత్రం తగ్గలేదని బుగ్గన తెలిపారు. మద్యం ధరలు పెంచడం వల్ల ఇది సాధ్యమైందన్నారు. 2019-20 జూన్‌లో రెవెన్యూ రాబడి రూ.3540 కోట్లు రాగా… ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌ రూ.3780 కోట్లు వచ్చిందని తెలిపారు. జూలై, సెప్టెంబరు నెలల్లోనూ ఇలాగే రాబడి పెరిగిందని… దీనికి ఏకైక కారణం ప్రభుత్వం పథకాల ద్వారా నగదు పంపింగ్‌ చేయడమేనని చెప్పారు. పన్నేతర ఆదాయం మాత్రం అంతకుముందు ఆర్థిక సంవత్సరం జనవరి వరకు రూ.70వేల కోట్లు రాగా… ఈ ఏడాది రూ.61వేల కోట్లు వచ్చిందని తెలిపారు. ‘గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌’లోనూ కేంద్రం నుంచి భారీగా నిధులు తెచ్చుకోగలిగామన్నారు. మొత్తంగా చూస్తే ఏపీలో తొలి త్రైమాసికంలో 13 శాతం, రెండో క్వార్టర్‌లో 9.9 శాతం, మూడో క్వార్టర్‌లో 5.5 శాతం, నాలుగో క్వార్టర్‌లో 4.3శాతం ఆదాయం తగ్గిందన్నారు. రెవెన్యూ లోటు 5.8శాతంగా ఉందన్నారు. ‘‘ఇలాంటి పరిస్థితుల్లోనూ సంక్షేమం సాగడం వల్ల ప్రజలు ఆర్థిక ఇబ్బందులు అధిగమించారు. ఫలితంగా జీఎస్టీ వసూళ్లలో జాతీయ సగటుకంటే ఎక్కువగా, దేశంలో రెండో స్థానంలో నిలిచాం. 2019 జూన్‌ నుంచి డిసెంబరు వరకు జీఎస్టీ వసూళ్లు రూ.14,940 కోట్లు ఉంటే, 2020 అదే కాలంలో రూ.16,169 కోట్లు వచ్చాయి’’ అని బుగ్గన వివరించారు.

పాత కారు, అపార్ట్‌మెంట్‌లోనే..

తాను మైనింగ్‌లో అక్రమంగా సంపాదిస్తున్నానని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆరోపించడం విడ్డూరంగా ఉందని బుగ్గన వ్యాఖ్యానించారు. 1918లోనే తమ ముత్తాత మైనింగ్‌ వ్యాపారం చేశారని, ఇప్పుడు వందేళ్ల తర్వాత ఇంకా తాను పాత ఇన్నోవా కారులోనే తిరుగుతున్నానని, అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నానని అన్నారు. అవినీతికి పాల్పడాల్సిన అవసరం తనకు లేదని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here