పల్లెల్లో కాదు.. పట్టణాల్లో కమలం వికసిస్తుందంటూ గాంభీర్యం ప్రదర్శించిన బీజేపీ నేతలకు ఏపీ అర్బన్ ఓటర్లు షాకిచ్చారు. రాష్ట్రంలోనే అతిపెద్ద నగరమైన విశాఖలో కమలనాథులకు ఉక్కు దెబ్బ తగిలింది. తిరుపతి ఉప ఎన్నిక బరిలో గెలిచేది ఆ పార్టీయేనని ప్రకటించిన మరుసటిరోజే, వెంకన్న పాదాల చెంత కమలం పార్టీని ఓటర్లు జీరో చేశారు. మిత్రుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సైతం.. గాజుగ్లాసులో నీరుపోసి, అందులో పెట్టినా కమలం వికసించే అవకాశం లేదని తెలుసుకున్నట్లు కనిపిస్తోంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ‘‘బీజేపీ మనల్ని చాలాచోట్ల అవమానిస్తోంది. కొన్నాళ్లు సంయమనంతో వ్యవహరించాలి’’ అని కీలక వ్యాఖ్యలు చేశారు.

గుడివాడలో మంత్రి నానిపై పవన్ నిప్పులు చెరిగితే…అదే మంత్రిని ‘నా తమ్ముడు’ అంటూ వీర్రాజు వ్యాఖ్యానించడం, ప్రభుత్వంపై పోరాటం చేయకుండా దేవుళ్ల ఫొటోలతో ట్విట్టర్ వ్యాఖ్యలు, రీ ట్వీట్‌లు.. సామాజిక మాధ్యమాల్లో ఫార్వర్డ్‌తో ఓట్లు రాలతాయా? ఈ చెలిమి మనకు నష్టం కలిగించక ముందే మేలుకోవాలన్న ఒత్తిళ్లు పవన్‌కు కేడర్ నుంచి వస్తున్నట్లు సమాచారం. పురపోరులో వామపక్షాలతో పోల్చిచూస్తే బీజేపీ సాధించింది తక్కువేనన్న విషయం కూడా నేతలు ప్రస్తావించినట్లు తెలిసింది. దీంతో పవన్ ఆలోచనలో పడ్డారని, అందుకే ఆ వ్యాఖ్యలు చేశారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
కారణం ఇదేనా..!
13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో 75 మున్సిపాలిటీలు, 12 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగితే బీజేపీ ఎక్కడా ప్రభావం చూపలేదు. దీనికి రాజకీయ విశ్లేషకులు చెబుతున్న కారణాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ప్రతిపక్షం ఎప్పుడైనా అధికార పార్టీ తప్పులపై పోరాటం చేయాలి. సోము వీర్రాజు టీమ్ ఎక్కడా ఆ పని చేయడంలేదు. రెండోది సొంత పార్టీని బలోపేతం చేసుకోవాల్సి ఉండగా, బలమైన నాయకులు, కేడర్‌కు నేతలే అడ్డంకులు వేస్తున్న వైనం స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికల బరిలో మిత్రుల సహకారం ఎంతో అవసరం కాగా, జనసేనతో ఎక్కడా సమన్వయం కనిపించడంలేదు. ఇవన్నీ కాకుండా కేంద్రం నుంచి భారీగా నిధులు తెచ్చి రాష్ట్రానికి ఏదైనా చేస్తున్నారా? అంటే తిరుపతి నుంచి విశాఖ వరకూ విక్రయాలే తప్ప ఊతం లేదు.
ముందుండే నాయకుడు ఏడి?
తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్ నుంచి ఎలాంటి ఇబ్బందులు కార్యకర్తలకు ఎదురైనా బండి సంజయ్ నేరుగా వెళ్లారు. ఏపీలో మాత్రం ఏది జరిగినా సొంత పార్టీకే సోము వీర్రాజు ఆంక్షలు విధిస్తారు. స్వయంగా ప్రధాని మోదీపై వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలి నాని వాహనానికి అడ్డుపడేందుకు తిరుపతిలో సిద్ధమైన బీజేపీ నేతలకు బ్రేకులు వేయడం నుంచి ఇటీవల గుంటూరు జిల్లాలో సీతమ్మ కొండపై శిలువ సందర్శనకు ఎక్కువ మంది వెళ్లకుండా ఆంక్షలు విధించడం వరకూ రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ బీజేపీ ఎంతో సహకారం అందిస్తోందని ఆ పార్టీలోనే పెదవి విరుపులు కనిపిస్తున్నాయి. కేంద్రం నుంచి అమరావతి, పోలవరం, రైల్వేజోన్, ఉక్కు పరిశ్రమ ఇలా ఏ విషయంలోనూ బీజేపీ రాష్ట్ర నాయకత్వం అర్థవంతంగా చర్చిస్తోందన్న సంకేతాలు కూడా ప్రజల్లోకి వెళ్లలేదు. సొంత లాభాలు చూసుకొంటూ రాష్ట్రంలో బీజేపీని నలుగురు నేతలు దెబ్బతీస్తున్నారన్న ఆవేదన ఆ పార్టీ కార్యకర్తల్లోనే వ్యక్తమవుతోంది.
పోరాడే తీరు ఇదేనా.?
ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా బీజేపీ జాతీయ నాయకత్వం చాలాకాలం ముందు నుంచే ప్రణాళికలు రచించి ఓటమి తప్పదని సర్వేలు వెల్లడించిన బిహార్ లాంటి చోట కూడా విజయ కేతనం ఎగుర వేసింది. అటువంటి పార్టీ రాష్ట్ర శాఖ మాత్రం స్థానిక ఎన్నికలు జరుగుతుంటే వినతిపత్రంతో ఢిల్లీకి చేరింది. రెండేళ్ల కింద జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నోటా కన్నా తక్కువ ఓట్లు సాధించిన ఏకైక రాష్ట్రం ఏపీ అనేది ఢిల్లీ బీజేపీ కార్యాలయంలో ఇప్పటికీ వినిపిస్తున్న మాట. ఈ దుస్థితి నుంచి గట్టెక్కేందుకు ఏపీ నేతలు చేసిన ప్రయత్నాలేంటని ఆరా తీస్తే.. తిరుపతిలో నెలల తరబడి తిష్టవేసి ఒక్కటంటే ఒక్క వార్డులో కూడా విజయం సాధించలేకపోయారు. పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకుంటామని రెండు, మూడు స్థానాల కోసం వైసీపీ, టీడీపీ మధ్య పోటీ ఉందని పార్టీ వేదికలపై వ్యాఖ్యలు చేస్తూ చప్పట్లు కొట్టించుకునే రాష్ట్ర సహ ఇన్‌చార్జి సునీల్ దియోధర్ తిరుపతిలో ఏకంగా ఇల్లు అద్దెకు తీసుకుని ఆశ్రమాలకు సైతం వెళుతూ పని చేస్తున్నారు.
రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తిరుపతిలో కూర్చుని సర్జికల్ స్ర్టైక్స్ చేస్తామంటారు. ఆ పార్టీ అధ్యక్షుడైతే తన సామాజిక వర్గం అధికంగా ఉందంటారు. ఢిల్లీ నుంచి వచ్చే కేంద్ర మంత్రులు బాలాజీ ఆశీర్వాదం ఉందంటారు. కపిలతీర్థం నుంచి రామతీర్థం అని నినాదాలిచ్చారు. కానీ రెండో స్థానంలో కూడా తిరుపతిలో బీజేపీ నిలవలేదు.