‘ఎమ్మెల్యేలు, ఎంపీలను కలెక్టర్ లెక్కచేయటం లేదు. మమ్మల్ని వెధవలను చూసినట్లు చూస్తున్నాడు. చివరికి మంత్రుల పట్ల కూడా అదేరీతిన వ్యవహరిస్తున్నాడు’ అని కలెక్టర్ గంధం చంద్రుడిపై ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాడిమర్రి మండలం చిల్లవారిపల్లిలో కాటకోటేశ్వరస్వామి ఊరేగింపును పోలీసులు, రెవెన్యూ అధికారులు శుక్రవారం అడ్డుకున్నారు. ఆలయ తలుపులు మూయించారు. దీంతో ఆ గ్రామానికి చెందిన రామేశ్వరరెడ్డి, బాలిరెడ్డి మనస్తాపం చెంది, పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. వారు అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి శనివారం ఆ ఆస్పత్రికి వెళ్లి, పరామర్శించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ కలెక్టర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కలెక్టర్ గంధం చంద్రుడు అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఊరేగింపును అడ్డుకోవటం సిగ్గుమాలిన చర్యన్నారు. చిల్లవారిపల్లిలో కులాల మధ్య చిచ్చురేపే ప్రయత్నం చేయడం మంచిది కాదన్నారు. విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని కేతిరెడ్డి స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై దళిత సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు, మేధావివర్గాలు ఖండించాయి.