తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో వైసీపీకి చెందిన కార్పొరేటర్ కంపర రమేశ్ దారుణహత్యకు గురయ్యారు. నిందితుడు కారుతో అత్యంత దారుణంగా రమేశ్‌ను తొక్కించి హతమార్చాడు. మద్యం మత్తులో ఉన్న నిందితుడు విచక్షణారహితంగా ప్రవర్తించాడు. ఈ ఘటనకు పాతకక్షలు, ఆర్థిక లావాదేవీలే కారణమని తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కాకినాడ నగరపాలక సంస్థ 9వ డివిజన్‌కు చెందిన సీనియర్ కార్పొరేటర్ కంపర రమేశ్ గురువారం రాత్రి కాకినాడ రూరల్ మండలం గంగరాజునగర్ సెంటర్‌లో ఓ కార్ వాష్ సెంటర్‌కు వచ్చారు. ఆయన వెంట ముత్యాల సతీశ్, ఎస్.వాసు ఉన్నారు. ఐదు రోజులుగా నిందితుడు గురజాల చిన్న.. రమేశ్‌కు ఆర్థిక లావాదేవీల విషయమై ఫోన్ చేస్తున్నాడు. అదేవిధంగా మెసేజ్‌లు కూడా చేస్తున్నాడు. అయినప్పటికీ రమేశ్ స్పందించలేదు. ఈ నేపథ్యంలో రమేశ్ గురువారం రాత్రి గురజాల చిన్నకు ఫోన్ చేసి కారు షెడ్ వద్దకు రమ్మన్నారు. దీంతో రాత్రి 12 గంటలు దాటిన తర్వాత చిన్న తన సోదరుడితో కలసి అక్కడకు వచ్చాడు. ఇరువురు మద్యం తాగి.. అనంతరం గొడవకు దిగారు.

పరస్పరం తిట్టుకుంటూ పిడిగుద్దులు కురిపించుకున్నారు. స్నేహితులు వారిద్దరికి సర్ది చెప్పి పంపించే ప్రయత్నం చేశారు. అయితే, తన కారు తాళం కనిపించడం లేదంటూ గురజాల చిన్న కారుకి రమేశ్ అడ్డంగా నిలబడ్డారు. ఈ క్రమంలో విచక్షణ కోల్పోయిన చిన్న వెంటనే కారుని స్టార్ట్ చేసి ఒక్కసారిగా స్పీడ్ పెంచడంతో కారు కార్పొరేటర్ మీదికి వేగంగా దూసుకువెళ్లింది. దీంతో ఆయన ఎగిరి రోడ్డు మీద పడ్డారు. అంతటితో ఆగని చిన్న.. కారును రివర్స్ చేసి ఒకసారి, ముందుకు వెళుతూ మరోసారి తొక్కించాడు. రమేశ్‌ను రక్షించేందుకు స్నేహితులు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. విషయం తెలిసిన సర్పవరం సీఐ నున్న రాజు సంఘటనా స్థలానికి వెళ్లి రమేశ్‌ను ట్రస్ట్ ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని కాకినాడ జీజీహెచ్ మార్చురీకి తరలించారు. డీఎస్పీ వి.భీమారావు మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ గోవిందరాజు తెలిపారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్టు చెప్పారు.