ఏక్షణాన్నైనా పరిపాలనా రాజధానిని విశాఖకు తరలిస్తామని పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ మూడు రాజధానులపై కోర్టుకు వెళ్లి, అభివృద్ధిని అడ్డుకుంటోందని ఆరోపించారు. మూడు రాజధానులపై ఇప్పటికే చట్టం చేశామని.. కోర్టులో చిన్నచిన్న సమస్యలున్నాయని.. కోర్టును ఒప్పించి, మెప్పిస్తామని స్పష్టం చేశారు. ఆదివారమిక్కడ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ఒక వర్గానికి, 20 గ్రామాలకే అమరావతి రాజధాని. సీఎం జగన్ 13 జిల్లాల అభివృద్ధి కోసమే విశాఖకు పరిపాలనా రాజధాని, అమరావతిలో లెజిస్లేటివ్ రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ, మిగిలిన 32 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, సహకార సంఘాల ఎన్నికలు త్వరలోనే పూర్తి చేస్తాం.
మున్సిపాలిటీల్లో ఎస్సీ, బీసీ జనాభా లెక్కలు, వార్డుల పునర్విభజన ఏప్రిల్లో పూర్తి చేస్తాం. మే నెలలో ఎన్నికల సంఘానికి వివరాలు ఇస్తాం’ అని తెలిపారు. రాజమహేంద్రవరం కార్పొరేషన్‌లో ఇప్పటికే 10 గ్రామాలు విలీనమయ్యాయని.. మరో రెండు గ్రామాలను కలిపే ప్రయత్నంలో ఉన్నామని.. వాటిని కలిపాకే ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. కొత్తగా ఎన్నికైన మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్‌పర్సన్లు, వైస్‌చైర్‌పర్సన్లకు ఈనెల 31 నుంచి రెండు రోజులపాటు విజయవాడలో వర్క్ షాప్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో సీఎం కూడా పాల్గొంటారన్నారు. సమావేశంలో రాష్ట్ర మంత్రులు చెల్లుబోయిన వేణు, కురసాల కన్నబాబు, ఎంపీ మార్గాని భరత్‌రామ్ తదితరులు పాల్గొన్నారు.
