మున్సిపల్ ఎన్నికల్లో సరికొత్త గందరగోళం మొదలైంది. గతంలో ఆపినచోటి నుంచే ప్రక్రియ ప్రారంభించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం రాజకీయ పార్టీలను అయోమయానికి గురిచేస్తోంది. ఈ ఏడాది కాలంలో కొన్నిచోట్ల అభ్యర్థులు పార్టీలు మారిపోయారు. మరికొన్ని చోట్ల ఎన్నికల బరిలో నిలిచినవారు మృతిచెందారు. ఇంకొన్నిచోట్ల రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. ఇవన్నీ పార్టీల నాయకత్వాలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. సరిగ్గా 11నెలల కిందట మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయితీల్లో నామినేషన్ల దాఖలు, పరిశీలన పూర్తయింది. నామినేషన్ల ఉపసంహరణల గడువు మాత్రం మిగిలి ఉంది. ఆ దశలో కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఆపినచోట నుంచే మొదలుపెట్టాలని కమిషన్ నిర్ణయించడంతో ఇప్పుడు ఉపసంహరణలకే అవకాశం మిగిలింది. అయితే నాటినుంచి క్షేత్ర స్థాయిలో అనేక పరిణామాలు చోటు చేసుకొన్నాయి. కొందరు అభ్యర్థులు పార్టీలు మారడంతో ప్రధానంగా ప్రతిపక్షాలు చిక్కులు ఎదుర్కొంటున్నాయి.

ప్రకాశం జిల్లా చీరాలలో టీడీపీకి ఇది పెద్ద తలనొప్పిగా మారింది. విశాఖ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ ఇటీవల వైసీపీలో చేరారు. ఆయన పరిధిలోని 13 డివిజన్లలో ఇద్దరు అభ్యర్థులు ఆయన వెంట వెళ్లారు. మిగిలినవారంతా టీడీపీలోనే ఉండిపోయారు. ఆ డివిజన్లలోనూ ఇతర టీడీపీ నేతలు నామినేషన్లు వేసి ఉండటంతో వారిని ఇప్పుడు అధికారిక అభ్యర్థులుగా చేసే ప్రయత్నంలో ఆ పార్టీ ఉంది. ఇటువంటి ఘటనలు చాలాచోట్ల ఉన్నాయని, ఒకటి రెండుచోట్ల అధికార పార్టీ కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటోందని ఒక నేత చెప్పారు. అభ్యర్థి పార్టీ మారినచోట మరొకరు దొరికే అవకాశం ఉందా అని పార్టీల నాయకత్వాలు వేట మొదలుపెట్టాయి. వారికి పార్టీ అధికారిక అభ్యర్థిగా గుర్తింపు ఇస్తూ బీ-ఫాం ఇవ్వాలని యోచిస్తున్నాయి. ఒకవేళ గతంలో వేరే అభ్యర్థికి ఇచ్చినా నామినేషన్ల ఉపసంహరణ గడువులోపు మరొకరికి ఇచ్చే అవకాశం ఉండటంతో ఈ అవకాశాన్ని వినియోగించుకొనే యోచనలో పార్టీలున్నాయి. రీనోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని పార్టీలు అభిప్రాయపడుతున్నా ఎస్‌ఈసీ దానికి అవకాశం ఇవ్వకుండా ఎన్నికల ప్రక్రియ కొనసాగిస్తుండటంతో సమస్యల పరిష్కారానికి కుస్తీలు పడుతున్నాయి.
అక్కడ ఎన్నిక రద్దే…
కొన్నిచోట్ల ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు మరణించారు. వారికి ఇప్పటికే బీ-ఫాం ఇచ్చి ఉంటే అక్కడ ఎన్నిక రద్దవుతుంది. దీంతో వారికి బీ-ఫాం ఇచ్చామో, లేదోనని పార్టీలు ఆరా తీస్తున్నాయి. రాజకీయ సమీకరణాలు మారిపోవడం కూడా మరో సమస్యగా తయారైంది. తాము బరిలోకి దింపిన అభ్యర్థి తర్వాత బలహీనమైనట్లు పార్టీలు గుర్తించాయి. ఇప్పటికే వారు నామినేషన్ వేసి ఉండటంతో దీనిపై తర్జనభర్జనలు సాగిస్తున్నారు. మరోవైపు అభ్యర్థుల మనోగతం వేరుగా ఉంది. తామే అభ్యర్థులమనుకొని ఏడాదిగా చాలా ఖర్చు చేశామని, కొత్త నోటిఫికేషన్ ఇస్తే పార్టీల నాయకత్వాలు వేరేవారిని వెతుక్కొంటే తమ పరిస్థితేంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఖర్చు సమస్య ఒకటే కాదని, తమ పరువు కూడా పోతుందని వాదిస్తున్నారు.