గోదా‘వరి’కి నీటి ఎద్దడి

0
145
Spread the love

తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో కాటన్‌ బ్యారేజీ పరిధిలోని ఉభయగోదావరి జిల్లాల డెల్టాలలో రబీ వరి సాగుకు నీటి సమస్య ఏర్పడిందని, మార్చి 31న కాలువలు మూసివేస్తామనడం సరికాదని, ఏప్రిల్‌ 15వరకూ కాలువలకు నీటి సరఫరా చేయాలని టీడీపీ నేతలు నిమ్మకాయల చినరాజప్ప, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, గుడా మాజీ చైర్మన్‌ గన్నికృష్ణ డిమాండ్‌ చేశారు. ఉభయగోదావరి జిల్లాలో పలు ప్రాంతాల్లో పర్యటించిన తెలుగురైతు నేతలు.. రాజప్ప, గోరంట్ల, గన్నితో కలిసి ధవళేశ్వరం ఇరిగేషన్‌ ఎస్‌ఈకి వినతిపత్రం ఇచ్చారు. అనంతరం రాజమహేంద్రవరంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం వెంటనే స్పందించి యాజమాన్య పద్ధతులు అవలంభించి రైతులకు ఇబ్బందిలేకుండా చేయకపోతే రైతుల తరపున ఉద్యమిస్తామని హెచ్చరించారు.

ఉభయగోదావరి జిల్లాల్లో 8.96 లక్షల ఎకరాల్లో వరి సాగు ఉందని, డెల్టా ప్రాంతంలో కాలువలు, మెట్టలో ఎత్తిపోతల ద్వారా నీటి సరఫరా జరుగుతుందని చెప్పారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో వరిపంట చిరుపొట్ట దశలో ఉందని, నీటి అవసరం ఎక్కువ ఉందని, నీరు సమృద్ధిగా ఉంటేనే పంట దిగుబడి అధికంగా ఉంటుందన్నారు. కానీ గోదావరిలో నీటి లభ్యత సరిగా లేదనే కారణంతో ఇరిగేషన్‌ అధికారులు వంతుల వారీ విధానం అమలు చేస్తున్నారని, నెల రోజుల నుంచి నీటి యాజమాన్య పద్ధతి అవలంభించడంలో ఇరిగేషన్‌శాఖ విఫలమైందన్నారు. ప్రభుత్వ నిర్లిప్తత వల్లే గోదావరి జలాలు అడుగంటాయని, తెలంగాణ నుంచి  పూర్తిస్థాయిలో నీరు తేవడంలో ప్రభుత్వం విఫలమైందని, ఒడిశా ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం చర్చించకపోవడంతో బలిమెల నుంచి నీరు వచ్చే అవకాశం లేకుండా పోయిందని వారు ఆందోళన వ్యక్తంచేశారు. ఈ సమయానికి గోదావరిలో 2.93 టీఎంసీల నీటి నిల్వ ఉండవలసి ఉండగా, 2.13 టీఎంసీలు మాత్రమే ఉందన్నారు. ప్రభుత్వ రంగాలను ప్రైవేటీకరిస్తూ ప్రధాని మోదీ గుజరాతీకరణ చేస్తూ, అక్కడి వాళ్లనే అభివృద్ధి చేస్తున్నారని గోరంట్ల ఆరోపించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంతా సీఎం జగన్‌రెడ్డికి తెలిసే జరుగుతుందన్నారు. అరబిందో రెడ్డి విజయసాయిరెడ్డికి బంధువని తెలిపారు. సీఎం జగన్‌ ఆర్థిక ఉగ్రవాదని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని తప్పుడు కేసుల్లో ఇరికించి, అన్యాయం చేశారన్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here