ప్రముఖ రాయలసీమ కథా రచయిత, సాహిత్య విమర్శకుడు సింగమనేని నారాయణ(78) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గురువారం మధ్యాహ్నం 12.30కు తుదిశ్వాస విడిచారు. తెల్లటి పంచెకట్టు, అంతకంటే తెల్లనైన పాలవంటి నవ్వు.. ‘ఎందప్పా’ అనే ఆప్యాయమైన పలకరింపు… సహ రచయితలు, అభిమానులకు గుర్తుండిపోయే సింగమనేని రూపం ఇది. రైతులను కథల్లో ప్రతిష్ఠించి, తెలుగు భాష, రాయలసీమ అభివృద్ధి కోసం ప్రత్యక్ష ఉద్యమాల్లో పాల్గొన్న కార్యశీల కలం ఆయనది. సింగమనేని ఇటీవల కరోనా బారిన పడ్డారు. కొద్దిరోజులకే బయటపడ్డప్పటికీ క్రమక్రమంగా ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. పది రోజుల క్రితం మరింతగా నీరసించిపోవడంతో అనంతపురంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే, చికిత్సకు గురువారం ఆయన దేహం సహకరించలేదని, తమ ప్రయత్నాలు ఫలించలేదని వైద్యులు తెలిపారు. ఆయన భౌతికకాయానికి శుక్రవారం స్వగ్రామం అనంతపురం జిల్లా కనగానపల్లిలో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. సింగమనేనికి భార్య గోవిందమ్మ, కుమార్తెలు రాజ్యలక్ష్మి, సృజన, రాధ, కుమారుడు శ్రీకాంత్ ఉన్నారు.

బోధన, రచనే జీవితం..
అనంతపురం జిల్లా రాప్తాడు మండలం మరూరు బండమీదిపల్లెకు చెందిన వ్యవసాయ కుటుంబంలో సంజీవమ్మ, రామప్ప దంపతులకు 1943 జూన్ 26న సింగమనేని జన్మించారు. తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర ప్రాచ్యకళాశాలలో విద్వాన్ చదివారు. కర్నూలులో తెలుగు పండిత శిక్షణ పూర్తిచేసి, 1969లో ఉపాధ్యాయుడిగా ఉద్యోగజీవితం ప్రారంభించారు. 2001 జూన్‌లో పదవీవిరమణ పొందారు. సింగమనేని వృత్తిరీత్యా ఉపాధ్యాయుడే అయినప్పటికీ రచనలు చేయడం ప్రవృత్తి. 43కు పైగా కథలను రాశారు. మొట్టమొదటి కథ ’న్యాయమెక్కడ?’1960లో కృష్ణాపత్రికలో అచ్చయింది. జూదం (1968), సింగమనేని నారాయణ కథలు (1999), అనంతం (2007), సింగమనేని కథలు (2012) అనే కథాసంపుటాలను వెలువరించారు. ‘సీమ కథలు’, ‘ఇనుపగజ్జెల తల్లి’, ‘తెలుగు కథలు-కథన రీతులు’ తదితర పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. ‘సంభాషణ’ పేరుతో వ్యాస సంపుటి వెలువరించారు. ‘ఆదర్శాలు – అనుబంధాలు’, ‘అనురాగానికి హద్దులు’, ‘ఎడారి గులాబీలు’ అనే నవలలను సింగమనేని వెలువరించారు. 2014లో అప్పాజోస్యులు విష్ణుభొట్ల కందాళం ఫౌండేషన్…సింగమనేని నారాయణకు ‘సాహిత్య సేవామూర్తి జీవితకాల సాధన పురస్కారం’ను అందజేసి సత్కరించింది. 2017లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కళారత్న పురస్కారంతో సింగమనేనిని సత్కరించింది. 1997లో అరసం గుంటూరు జిల్లాశాఖ ఆయనను పులుపుల వెంకటశివయ్య సాహితీ పురస్కారంతో సత్కరించింది. విద్య, సాహిత్యపరంగానే కాక సింగమనేని నారాయణ సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొనేవారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా
‘రైతు ఆత్మవిశ్వాస యాత్రలు’ నిర్వహించారు.
నివాళులు..: రాజకీయ నాయకులు, అధికారులు, సాహితీ ప్రముఖులు అనంతపురంలోని సింగమనేని నివాసానికి చేరుకుని ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. సింగమనేని నారాయణ మరణం బాధాకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విశాలాంధ్ర ఎడిటోరియల్ బోర్డు మెంబరుగా నారాయణ పనిచేసిన రోజులను ఆయన గుర్తుచేసుకున్నారు.