‘జగన్ పత్రికలో పనిచేసిన గుమాస్తా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. మనపై దాడులు చేస్తే ప్రభుత్వానికి సంబంధం లేదట. ఒళ్లు దగ్గర పెట్టుకో. నీ కార్యకర్తలకు చెప్పు. ఎక్కడైనా మా కార్యకర్తలపై చేయిపడితే ఖబడ్దార్’ అని టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. తాను ఇప్పటివరకు ఎందరో ముఖ్యమంత్రులను చూశానని.. జగన్‌వంటి ఉన్మాద సీఎంను చూడలేదని చెప్పారు. అధికార పార్టీ అరాచకాలతో భయబ్రాంతులకు లోనైన ప్రజల్లో చైతన్యం తీసుకు రావలసి ఉందని, దీని కోసం కుప్పం నుంచే ప్రజా చైతన్య ఉద్యమం ప్రారంభించి రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని ప్రకటించారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా రెండోరోజైన శుక్రవారం పలు మండలాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘జగన్ ఓ నియంత. ఆ బాటలోనే ఆయన పార్టీ నాయకులు కూడా నడుస్తున్నారు. ధైర్యం ఉంటే నేరుగా ఎన్నికల్లోకి రా..! రాజారెడ్డి రాజ్యాంగం కాకుండా అంబేడ్కర్ రాజ్యాంగం ప్రకారం నడుచుకోండి. ఒక్కరోజులో ఇంటికి పంపుతాం. నేను మీలా అనుకుని ఉంటే పుంగనూరు పుడింగి (మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి) ఉండేవాడు కాదు. అక్రమంగా డబ్బులు వసూలు చేసి కుప్పం ప్రజలను కొనాలని చూస్తున్నాడు. కుప్పం నుంచి ఇప్పుడు చిత్తూరుకు పోతున్నాడు’ అని దుయ్యబట్టారు. ‘టీడీపీ కార్యకర్తలపై పోలీసులు ఐదు తప్పుడు కేసులు పెడితే తిరిగి యాభై కేసులు పోలీసులపై పెడతాం. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసులను ఏమి చేయాలో అదే చేద్దాం’ అని చెప్పారు. ఇంకా ఏమన్నారంటే..

నాకు కొత్తగా పదవి అక్కర్లేదు..
నేను 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశా. నాకు కొత్తగా పదవి అవసరం లేదు. నా రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేరు. రాష్ట్రాన్ని దోచుకోవడానికి నేను రాలేదు. జగన్ రాష్ర్టాన్ని షేవ్ చేస్తున్నాడు. నేను సేవ్ చేసేందుకు వస్తున్నా. కోడికత్తి డ్రామాను ఇప్పుడు గుర్తు చేసుకుంటే జగన్ కుట్రలు అర్థమవుతాయి. ఇప్పుడా కోడికత్తి కేసు ఏమైందో తెలియదు. ప్రత్యేక హోదాతో పాటు విశాఖ ఉక్కు కూడా పోయింది. అమరావతి విధ్వంసమైంది. ఊరూరా తిరిగి ముద్దులు పెట్టాడు. ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నాడు. ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. ప్రజల రక్తాన్ని తాగే జలగల్లా వైసీపీ నాయకులు తయారయ్యారు. నన్ను మానసికంగా దెబ్బతీయాలని చూస్తున్నారు. వైసీపీకి ఓటేస్తే కరెంటు తీగలు పట్టుకున్నట్లేనని నేను ఆనాడే చెప్పా. వాళ్లు ఒక్క చాన్సిమ్మని అడుక్కున్నారు. మీరు ఇచ్చారు. ఇప్పుడు బాధ పడుతున్నారు. మీ బాధను చూడలేక, దాన్ని తొలగించాలనే నేను పోరాడుతున్నా.
జూ.ఎన్టీఆర్ ప్రచారానికి రావాలి..
జూనియర్ ఎన్టీఆర్‌ను ప్రచారానికి తీసుకురావాలని టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు పర్యటనలో డిమాండ్ చేశారు. అదే సమయంలో లోకేశ్‌కు పార్టీ పగ్గాలు అప్పగించాలన్న డిమాండ్ కూడా చేయడం విశేషం. శాంతిపురంనుంచి రామకుప్పం వెళ్లే మార్గంలో రాజుపేట రోడ్డు వద్ద గుమికూడిన ప్రజలనుద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. ప్రసంగం ప్రారంభించబోయే ముందు ఓపెన్‌టా్‌ప వాహనం చుట్టూ ఉన్న కార్యకర్తలు.. ‘జూనియర్ ఎన్టీఆర్‌ను తీసుకు రావాలి. ప్రచారానికి దింపాలి’ అంటూ బిగ్గరగా డిమాండు చేశారు. చంద్రబాబు తలూపి ఊరుకున్నారు. రాజుపేటలో మాట్లాడుతుండగా.. పార్టీ వీరాభిమాని ఒకరు కాన్వాయ్‌లోని వాహనమెక్కారు. అతడిని వారించేలోపు.. ‘లోకేశ్‌ను కుప్పానికి పంపించండి. లోకేశ్‌కు పగ్గాలివ్వండి’ అని బిగ్గరగా నినదించాడు. ‘లోకేశ్‌కు పగ్గాలిస్తే నాయకులందరూ భయపడి పని చేస్తారు. కార్యకర్తలకు కూడా ధైర్యమొస్తుంది. పరిస్థితులు చక్కబడతాయి. విజయం మన వశమవుతుంది’ అని విన్నవించాడు. దీనిపై చంద్రబాబు స్పందించారు. ‘నేను వెళ్లాక లోకేశ్ వస్తాడు. ఇద్దరం తరచూ వస్తాం. రాబోయే ఎన్నికలన్నిటిలో విజయం మనదే. అధైర్యపడొద్దు. అంతా సర్దుకుంటుంది’ అని భరోసా ఇచ్చారు.
గెస్ట్ హౌస్‌కు కరెంట్ కట్
కుప్పంలో చంద్రబాబు బసచేసిన ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో పలుమార్లు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. దీనిపై మాజీ మంత్రులు అమరనాథ్‌రెడ్డి, పరసారత్నం మండిపడ్డారు.
మా వూరికొచ్చినావు కదా.. కనబడిపోదామని..
చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం ఆకందగానిపల్లెకు చెందిన సుబ్బక్క అనే ఈ వృద్ధురాలు శుక్రవారం సాయంత్రం చంద్రబాబును రామకుప్పంలో కలిసింది. ఏం కావాలమ్మా అని ఆయన అడుగగా.. ‘నాకేమొద్దు సామీ.. మీ ప్రభుత్వంలోనే ఇల్లిస్తిరి. పింఛనిచ్చిరి. మావూరికొచ్చినావు కదా అందుకే కనపడిపోదామనొస్తిని’ అంటూ బదులిచ్చింది. ఆమె క్షేమ సమాచారాలను వాకబు చేసిన చంద్రబాబు.. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమ్మా అని చెప్పి పంపారు.