అమరావతి: వైసీపీ నేతలు భయపెడితే మేం ఊడిగం చేయాలా?.. ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగాయా? అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన ఆయన సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఎన్నికల కమిషన్ అమలు చేయలేదని విమర్శించారు. ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా ఎస్‌ఈసీ చర్యలు తీసుకోలేదని, ఎన్నికల కమిషన్.. అధికారాలు ఎందుకు ఉపయోగించుకోవట్లేదని చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు. టీడీపీ గెలిచిన స్థానాల్లో వైసీపీ గెలిచినట్లు అధికారులు ప్రకటించారని మండిపడ్డారు. సంక్షేమ పథకాలను నిలిపివేస్తామని ప్రజల్ని బెదిరిస్తారా? అంటూ చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

జమిలి ఎన్నికలు వచ్చే వరకు మంత్రి పెద్దిరెడ్డి ఉంటారేమో.. తర్వాత మిమ్మల్ని బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని చంద్రబాబు అన్నారు. ఇది ప్రజల తిరుగుబాటన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ప్రజలు కన్నెర్ర చేస్తే మీ ఊర్లోనే మీకు పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. కొందరు అధికారులు వైసీపీ నేతలకు ఊడిగం చేస్తున్నారని ఆరోపించారు. కుప్పంలో టీడీపీని లేకుండా చేస్తామని చెబుతున్నారని, అది వాళ్లను పుట్టించిన దేవుడి వల్ల కూడా కాదని చంద్రబాబు అన్నారు. ఇప్పటి వరకు తన మంచితనం చూశారని.. ప్రజల కోసం ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉంటామని చంద్రబాబు స్పష్టం చేశారు.
మంచిగా ఉంటే మర్యాద ఇస్తామని.. పిచ్చిగా వ్యవహరిస్తే ఖబడ్దార్ అంతు చూస్తామని చంద్రబాబు హెచ్చరించారు. జగన్ ఒక ఫేక్ ముఖ్యమంత్రిగా అభివర్ణించారు. వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు చంపారో ఇప్పటి వరకు తేల్చలేదని ఎద్దేవా చేశారు. అంబేద్కర్ రాజ్యాంగం పక్కనపెట్టి.. రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారని విమర్శించారు. తనకు అధికారం ముఖ్యం కాదని.. రాష్ట్రం నాశనం అవకూడదని పోరాడుతున్నామన్నారు. తాను తీవ్రవాదులు, ముఠా నాయకులకే భయపడలేదని చంద్రబాబు అన్నారు.