దొంగ అనుకుని.. కొట్టి చంపారు

0
180
Spread the love

పొలాల్లోకి బహిర్భూమికి వచ్చిన ఓ భక్తుడిని దొంగ అనుకుని రైతులు దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఆదోని మండలం నాగలాపురానికి చెందిన ఢనాపురం నరసప్ప (55) పరమ భక్తుడు. గురుబోధ కూడా తీసుకున్నాడు. శుక్రవారం కోసిగి మండల కేంద్రంలో సిద్ధారుడ స్వామి 5వ ఆరాధనోత్సవాలకు తన గ్రామానికే చెందిన లింగన్నతో కలిసి వెళ్లాడు. ఇద్దరూ శనివారం మధ్యాహ్నం వరకు ఆరాధనోత్సవాల్లో పాల్గొన్నారు. ఆ తరువాత గుంపులో ఇద్దరూ విడిపోయారు. లింగన్న సాయంత్రం 5 గంటలకు గ్రామానికి తిరిగొచ్చి.. నరసప్ప కనిపించకపోవడంతో ఒక్కడినే వచ్చానని నరసప్ప భార్య జయలక్ష్మికి తెలిపాడు. నరసప్ప శనివారం రాత్రంతా సిద్ధారుడ ఆశ్రమంలో ఉండిపోయాడు.

ఆదివారం తెల్లవారుజామున పక్కనే ఉన్న పొలాల్లోకి బహిర్భూమికి వెళ్లాడు. చుట్టుపక్క పొలాల్లో నిద్రిస్తున్న రైతులు అతడిని చూసి.. దొంగ అనుకుని కేకలు వేస్తూ నరసప్పపై దాడి చేశారు. తాను దొంగను కాదని చెబుతున్నా.. పొలాల్లో ఈడ్చుకుంటూ వెళ్లి చెట్టుకు కట్టేసి కొట్టారు. ఆ తర్వాత మరికొందరు చేరి.. తీవ్రంగా గాయపడిన నరసప్పను స్థానిక ఆసుపత్రికి, ఆ తర్వాత ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాధితుడు మరణించాడు.

అపర భక్తుడు.. సేవకుడు

నరసప్ప మరణ వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్థులు పెద్ద ఎత్తున ఆసుపత్రికి చేరుకున్నారు. నరసప్ప మృతదేహాన్ని చూసి గుండెపగిలేలా ఏడ్చారు. నరసప్ప అపర భక్తుడని, ఎక్కడ పూజా కార్యక్రమాలు ఉన్నా కాలినడకన వెళ్లి తిరిగి వస్తాడని వారు తెలిపారు. శ్రీశైలానికి నడిచి వెళ్లే భక్తులకు గ్రామ శివారులో అల్పాహారం, పాలు అందిస్తూ సేవ చేసేవాడని తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మృతుని భార్య జయలక్ష్మి ఫిర్యాదు మేరకు.. నరసప్పపై దాడిచేసిన కపటి ఈరన్న, గోవిందు, కిందిగేరి ఈరన్నతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశామని సీఐ ఈశ్వరయ్య, ఎస్‌ఐ ధనుంజయ తెలిపారు.

పోలీసుల తీరే పరోక్ష కారణమా?!!

కోసిగి సమీపంలోని పొలాల్లో కోతకు వచ్చిన పంటలు, కోసి సిద్ధం చేసిన ధాన్యాన్ని దొంగలు ఎత్తుకెళ్తున్నారని రైతులు చెబుతున్నారు. ఈ ఘటనలపై పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు కట్టడం లేదని ఆరోపిస్తున్నారు. పొలంలోకి వచ్చిన భక్తుడిని దొంగగా భావించి దాడి చేయడానికి పోలీసుల తీరే పరోక్ష కారణమని కొందరు ఆరోపిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here