ధమాకా సేల్‌

0
217
Spread the love

‘గంగవరం పోర్టులో మెజారిటీ వాటాల కొనుగోలుకు చర్చలు జరుపుతున్న అదానీ గ్రూప్‌! రూ.10వేల కోట్లు చెల్లించేందుకు సిద్ధం’… ఇది సుమారు ఆరేళ్ల కిందటి వార్త! దీనిని… పోర్టు వర్గాలతోపాటు అదానీ గ్రూప్‌ కూడా ధ్రువీకరించింది. అయితే… గంగవరం పోర్టు విలువ రూ.10వేల కోట్లు అనే అంచనా అప్పుడే వెలువడింది. ఆరేళ్ల కాలం గడిచి, పోర్టు బాగా అభివృద్ధి చెందిన నేపథ్యంలో దీని విలువ మరింత పెరిగి ఉండాలి. కానీ… పోర్టులో 89.6 శాతం వాటాను అదానీ గ్రూప్‌ రూ.5,558 కోట్లకే సొంతం చేసుకుంది. ఆరేళ్ల కిందటి అంచనాతో పోల్చితే ఇది సగం మాత్రమే. మిగిలిన 10.4 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది.

అసలేం జరిగింది…

ఒక కంపెనీని మరొక కంపెనీ టేకోవర్‌ చేయడం కొత్తేమీ కాదు. అయితే… గంగవరం పోర్టు డీల్‌ వెనుక ఇతరత్రా కారణాలున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోర్టు ప్రమోటర్‌ డీవీఎస్‌ రాజు అయిష్టంగానే తన వాటాను పూర్తిగా వదులుకున్నారని చెబుతున్నారు. గంగవరం పోర్టులో విదేశీ కంపెనీ వార్‌బర్గ్‌ పింక్‌సకు 31.5 శాతం వాటా ఉండేది. తొలుత అదానీ ఈ వాటాను కొనేసింది. ఒక్కో షేరు రూ.120 చొప్పున రూ.1954 కోట్లకు కొన్నట్టు రికార్డుల్లో చూపించారు. గంగవరం పోర్టు విలువతో పోల్చితే ఇది చాలా తక్కువ ధర అని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. వార్‌బర్గ్‌ పింక్‌సకు మరో డీల్‌లో భారీ ప్రయోజనం కలిగించి… గంగవరం పోర్టులో వాటాను తక్కువ ధరకు కొన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నెల మొదటి వారంలో ఈ డీల్‌ ముగిసింది. ఇక… డీవీఎస్‌ రాజు వంతు వచ్చింది. వార్‌బర్గ్‌ పింకస్‌ ఒక్కో షేరు రూ.120కి ఇచ్చేసినందున… అదే ధర ప్రామాణికమంటూ తేల్చేశారు. 58.1 శాతం వాటా ఇచ్చేయాలని డీవీఎస్‌ రాజును కోరినట్లు తెలిసింది. మంచి లాభాల్లో ఉన్న పోర్టులో వాటా వదులుకోవడానికి, అందులోనూ అంత తక్కువ ధరకు విక్రయించడానికి డీవీఎస్‌ రాజు సంస్థ సుముఖత చూపలేదని తెలిసింది.

ఒత్తిడి వ్యూహం…

బేరం కుదరకపోతే… అంతటితో వదిలేయాలి. కానీ, గంగవరం పోర్టులో ఇలా జరగలేదని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ‘ఒత్తిడి వ్యూహం’ అమలు చేసినట్లు సమాచారం. గంగవరంలో పోర్టు రోడ్డులో ప్రజలు, వాహనాల రాకపోకలకోసం 100 అడుగుల రహదారిని నిర్మించారు. అయితే… దాదాపు ఒక కిలోమీటరు పొడవునా రోడ్డును 40 అడుగుల మేర పోర్టు యాజమాన్యం ఆక్రమించింది. ఏకంగా గోడ కట్టేసి మరీ స్థలాన్ని సొంతానికి వాడుకుంటోంది. రహదారి వెడల్పు తగ్గిపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తడంతోపాటు తరచూ ప్రమాదాలూ జరుగుతున్నాయి.

కానీ… హఠాత్తుగా దీనిపై ‘ఆందోళనలు’ మొదలయ్యాయి. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే, వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి ఎంపీ విజయసాయిరెడ్డి స్వయంగా వెళ్లి ఆ రహదారిని, పోర్టు ప్రాంతాన్ని పరిశీలించారు. ఆ తర్వాత రెండు రోజులకే రహదారిని ఆక్రమించి నిర్మించిన గోడలను కూలగొట్టారు. ఆ తర్వాత మరో మార్గంలో కూడా ఇలాగే నిర్మించుకున్న ఇంకో గోడను కూడా కూల్చివేస్తామని స్థానిక అధికారులు హెచ్చరించారు. దాంతో యాజమాన్యానికి అసలు విషయం అర్థమైంది. ఇకపై తమకు ప్రభుత్వ సహకారం ఉండదని, ఏదో ఒక పేరుతో వేధింపులు ఎదురవుతాయని గ్రహించే… వాటాను విక్రయించుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కొందరు పెద్దల తెరవెనుక ప్రయోజనాలు, సహకారం వల్లే ఈ డీల్‌ కుదిరినట్లు చెబుతున్నారు.

విశాఖ పోర్టులో చేదు అనుభవం…

అదానీ సంస్థకు విశాఖపట్నం పోర్టులో ఈక్యు-1 బెర్తును లీజుకు తీసుకున్నప్పటికీ… అంతగా కలిసి రాలేదు. ఇక్కడి టెర్మినల్‌ ద్వారా వచ్చే ఆదాయంలో 40.1 శాతం పోర్టుకు ఇస్తామని అదానీ సంస్థ ఒప్పందం చేసుకుంది. దాని కార్గో సామర్థ్యం 64 లక్షల టన్నులు. 2014లో టెర్మినల్‌ నిర్మాణం పూర్తికాగా కేవలం పదిలక్షల టన్నుల కోల్‌ను మాత్రమే హ్యాండిల్‌ చేసింది. 2016 నుంచి టెర్మినల్‌ అసలు పనిచేయడం లేదు. సంస్థ తీరు చూసి పోర్టు యాజమాన్యం అనేక నోటీసులు ఇచ్చింది. ఆఖరుకు గత నవంబరులో టర్మినేషన్‌ నోటీసు కూడా ఇచ్చింది. గంగవరం పోర్టు ప్రభుత్వానికి వార్షిక ఆదాయంలో 2 శాతం వాటా మాత్రమే ఇస్తుండగా… విశాఖపట్నం పోర్టుకు అదానీ ఇక్కడ 40 శాతం ఆఫర్‌ చేసింది. గంగవరం పోర్టుపై దృష్టి సారించడానికి ఇదీ ఒక కారణమని చెబుతున్నారు.

‘అదానీ’ లెక్కలో చూసుకున్నా!

గంగవరం పోర్టును సొంతం చేసుకున్న అదానీ సంస్థ విశాఖపట్నం పోర్టులో ఈక్యు-1 బెర్తును 2011లో 30 ఏళ్ల లీజుకు తీసుకుంది. అందులో ఒక టెర్మినల్‌ నిర్మించడానికి రూ.400 కోట్లు వెచ్చించింది. ఈ టెర్మినల్‌లో బొగ్గును మాత్రమే ‘హ్యాండిల్‌’ చేయగలరు. కానీ… గంగవరంలో తొమ్మిది బెర్తులు ఉన్నాయి. అందులోనూ… ఇంధనం వంటి ద్రవాలు మినహా ఎలాంటి వస్తువులనైనా (మల్టీ పర్పస్‌) ఎగుమతి/దిగుమతి చేయవచ్చు.

అంటే… అదానీ గ్రూపు లెక్క ప్రకారం చూసుకున్నా ఈ 9 బెర్తుల నిర్మాణానికే రూ.3600 కోట్లు అవసరమవుతాయి. పైగా గంగవరం డీప్‌ వాటర్‌ పోర్టు. 2 లక్షల టన్నుల సూపర్‌ క్యాప్‌ ఓడలు సైతం రేవులోకి రాగలవు. విశాఖ ఉక్కు కర్మాగారం రూపంలో ‘నమ్మకమైన’ లాభాలు సొంతమవుతున్నాయి. ఫ్యాక్టరీకి అవసరమైన ఐరన్‌ఓర్‌, కోకింగ్‌ కోల్‌ను గంగవరం పోర్టు నుంచే దిగుమతి చేసుకుంటున్నారు. అలాంటి ఓడరేవును ప్రమోటర్లు వదులుకోవడం వెనుక మరేదో కారణముందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here