ఇలా అయితే ఎలా అయ్యేను.. ఆంధ్రుల జీవనాడి పోలవరం పనులపై ప్రభుత్వం ఉదాసీనత.. ప్రాజెక్టు పనుల మందగమనానికి నిదర్శనంగా కనిపిస్తోంది. ప్రాజెక్టు పనుల్లో అలసత్వంతో అంచనాలు, ఖర్చు పెరిగిపోయి ప్రాజెక్టు మూడు అడుగులు ముందుకు పడితే.. ఆరడగులు వెనక్కి నెట్టినట్లు కనిపిస్తోంది.

పోలవరం రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా మార్చే ప్రాజెక్టు.. జీవనది గోదావరిపై నిర్మిస్తున్న ప్రాజెక్టు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చురుగ్గా సాగిన పనులు వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒకింతమందకొడిగా పునఃప్రారంభమయ్యాయి. గ్రావిటీ ద్వారా నీరు ఇవ్వాలంటే ప్రధానంగా స్పిల్‌వే పనులు పూర్తి కావాల్సి ఉండగా.. పనులు మందకొడిగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు 34 గేట్లు మాత్రమే బిగించారు. గేట్లు పనిచేయడానికి వీలుగా స్పిల్‌వే పిల్లర్లలోపల హైడ్రాలిక్ సిలిండర్లను అమరుస్తున్నారు. ఒక్కో గేటుకు రెండు సిలిండర్ల చొప్పన మొత్తం 96 సిలిండర్లు అమర్చాల్సి ఉండగా ఇప్పటి వరకు 25 గేట్లకు మాత్రమే వాటిని బిగించారు. మరికొన్ని సిలిండర్లు జర్మనీ నుంచి రావాల్సి ఉంది. స్పిల్‌వే చానల్ కాంక్రీట్ పనులు కొనసాగుతున్నాయి. గత ఏడాది వరదల వల్ల ఈ పనులకు తీవ్ర ఆటంకం ఏర్పడడంతో అప్పట్లో ఈ పనులు నిలిపివేశారు.