రాష్ట్రంలో కరోనా కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. వైరస్ రెండో దశ విజృంభిస్తుందేమోనన్న భయం సర్వత్రా నెలకొంది. దీంతో వైరస్ వ్యాప్తి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. రాష్ట్రవ్యాప్తంగా ‘నో మాస్క్.. నో ఎంట్రీ’ విధానాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సూచనల మేరకు రాష్ట్రంలో 15 రోజులపాటు విస్తృత ప్రచారం చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ క్యాంపెయిన్‌లో భాగంగా కరోనాతో పాటు వ్యాక్సినేషన్‌పై కూడా ప్రజల్లో అవగాహన కల్పించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గురువారం మొదలయ్యే ఈ క్యాంపెయిన్ ఏప్రిల్ 7 వరకూ సాగుతుంది. ఈ నెల 24న జిల్లా కలెక్టర్లు అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి కార్యచరణను ప్రకటిస్తారు. కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు క్షేత్రస్థాయిలో ఎంఆర్‌వోలు కూడా పాల్గొనాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నెల 25న అవగాహన ర్యాలీలు నిర్వహిస్తారు. చివరగా ఏప్రిల్ 7న మండల కేంద్రాల్లో కరోనాకు వ్యతిరేకంగా క్యాండిల్ ర్యాలీలు నిర్వహించాలని ఆదేశించారు.
24 గంటల్లో 310 కేసులు
రాష్ట్రంలో గత 24 గంటల్లో 35,375 శాంపిల్స్‌ను పరీక్షించగా 310 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 51 మందికి వైరస్ సోకగా.. తూర్పుగోదావరిలో 43, విశాఖపట్నంలో 43, గుంటూరులో 28, కృష్ణాలో 26 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా రాష్ట్రంలో ఇప్పటివరకూ 8,94,044 మంది కరోనా బారినపడ్డారు. ఒకరోజు వ్యవధిలో 114 మంది కోలువడంతో రికవరీల సంఖ్య 8,84,471కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,382 యాక్టివ్ కేసులున్నాయి. తాజాగా కర్నూలుతో మరో ఇద్దరు చనిపోవడంతో మొత్తం మరణాలు 2,382కి పెరిగాయి. విజయనగరం జిల్లాలో కొన్ని నెలల తర్వాత తొలి కరోనా మరణం నమోదైంది.
కాలేజీలు, పాఠశాలల్లో కలకలం..
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ మండలం కాతేరులోని ఓ జూనియర్ కాలేజీలో ఏకంగా 140 మంది విద్యార్థులకు వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఇక్కడ వేలల్లో విద్యార్థులు ఇంటర్ చదువుతున్నారు. వీరిలో వందలాది మంది వసతిగృహాల్లో ఉంటున్నారు. వీరికి టెస్ట్‌లు నిర్వహించగా.. సోమవారం ఒక్కరోజే 140 మం దికి వైరస్ సోకినట్టు తేలింది. దీంతో అప్రమత్తమె ౖన అధికారులు బాధితులను వసతిగృహాల్లోనే ఐసోలేషన్‌లో ఉంచారు. ఇక్కడ పాజిటివ్‌ల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో ఈ ప్రాంతాన్ని కట్టడి జోన్‌గా ప్రకటించారు. అలాగే రామచంద్రపురం పట్టణం లో ఎనిమిది మందికి, ముమ్మిడివరం బాలికోన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న ముగ్గురు బాలికలకు పాజిటివ్‌గా తేలింది. రావులపాలెం జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఎనిమిది విద్యార్థికి కొవిడ్ సోకింది.
నెల్లూరులో 10 మంది పోలీసులకు పాజిటివ్
నెల్లూరులోని బాలాజీనగర్ పోలీసుస్టేషన్‌లో పది మంది సిబ్బందికి కరోనా సోకింది. స్టేషన్‌లో సిబ్బంది పలు ప్రాంతాల్లో బందోబస్తు విధుల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో పలువురు సిబ్బందికి జ్వరం, తీవ్ర తలనొప్పి రావడంతో కరోనా పరీక్షలు చేయించుకోగా 10 మందికి కరోనా సోకినట్లు తెలిసింది. దీంతో మిగిలిన వారు కూడా నిర్ధారణ పరీక్షలు చేయించుకునేందుకు సిద్ధమవుతున్నారు.
మాస్కు ధరించకుంటే ఫైన్ వెయ్యి
కరోనా సెకండ్ వేవ్ దృష్ట్యా ప్రతి ఒక్కరూ విధిగా మాస్కు ధరించాలని నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ దినే్‌షకుమార్ స్పష్టం చేశారు. మాస్కు ధరించని వారి నుంచి రూ.1000 జరిమానా వసూ లు చేస్తామని హెచ్చరించారు. మంగళవారం నుంచే ఇది అమలులోకి వస్తుందని తెలిపారు.