రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను 2019 ఓటర్ల జాబితా ప్రకారం నిర్వహించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ ప్రారంభించిందని.. ఈ సమయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. నిర్దిష్ట సమయానికి ఓటర్ల జాబితా అందుబాటులో లేనప్పుడు అప్పటికే ఉన్న ఓటర్ల జాబితాతో ఎన్నికలు నిర్వహించవచ్చని సుప్రీంకోర్టు కూడా తేల్చిచెప్పిందని పేర్కొంది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తాజా ఓటర్ల జాబితా అందుబాటులో లేకపోవడంతోనే ఎస్‌ఈసీ గత జాబితాతో ఎన్నికలు నిర్వహిస్తోందని తెలిపింది. ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించేలా జోక్యం చేసుకోకూడదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను గుర్తుచేస్తూ పిటిషన్లను డిస్మిస్ చేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూ్‌పకుమార్ గోస్వామి, జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది.
అర్హులకు ఓటు హక్కు కల్పించకుండా..

పంచాయతీ ఎన్నికలను 2021 ఓటర్ల జాబితాతో నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ విశాఖపట్నానికి చెందిన ఆలివర్ రాజురాయ్ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అర్హులకు ఓటు హక్కు అవకాశం కల్పించకుండా ఎన్నికలు నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధమంటూ గుంటూరు జిల్లా నంబూరుకు చెందిన విద్యార్థిని ధూళిపాళ్ల అఖిల మరో పిటిషన్ వేశారు. ఈ రెండు వ్యాజ్యాలపై గురువారం ధర్మాసనం ముందు విచారణ జరిగింది. రాజురాయ్ తరఫు న్యాయవాది ఎన్.జాయ్ వాదనలు వినిపిస్తూ.. 2019 ఓటర్ల జాబితాతో ఎన్నికలు నిర్వహించాలన్న ఎస్‌ఈసీ నిర్ణయంతో 3.6 లక్షల మంది యువ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోలేకపోతున్నారని తెలిపారు. ‘రాష్ట్రంలో రెండు బలమైన శక్తుల మధ్య పోరాటం సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం, ఎస్‌ఈసీ ఒకరికొకరు సహకరించుకోవడం లేదు. జనవరి 21 నాటికి 2021 ఓటర్ల జాబితా సిద్ధంగా ఉంటుందని ఓ వ్యాజ్యం విచారణ సందర్భంగా అడ్వకేట్ జనరల్ కోర్టు ముందు ప్రకటించారు. అర్హత కలిగిన ఓటర్లకు ఓటు హక్కు కల్పించకుండా ఎన్నికలు నిర్వహించడం న్యాయబద్ధం కాదు. న్యాయస్థానం జోక్యం చేసుకోవచ్చు’ అని తెలిపారు.
లక్షల మంది తమ ఓటు హక్కు కోల్పోతున్నా జోక్యం చేసుకోకపోతే న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతుందని అఖిల తరఫున న్యాయవాది శివప్రసాద్‌రెడ్డి అన్నారు. అయితే పంచాయతీరాజ్ చట్ట నిబంధనల ప్రకారం.. సవరించిన జాబితా సిద్ధంగా లేనప్పుడు అప్పటికే సిద్ధంగా ఉన్న పూర్వపు జాబితాను పరిగణనలోకి తీసుకోవచ్చని అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరాం తెలిపారు. కిషన్‌సింగ్ తోమర్ కేసులో సుప్రీంకోర్టు కూడా ఇదే విషయం చెప్పిందన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడానికి వీల్లేదని.. పిటిషనర్లు చాలా ఆలస్యంగా కోర్టుకు వచ్చారని కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ హరినాథ్ అన్నారు.
రాష్ట్ర సర్కారు సహకారం లేనందునే..
ఎస్‌ఈసీ తరఫున న్యాయవాది అశ్వనీకుమార్ వాదనలు వినిపిస్తూ.. 2021 ఓటర్ల జాబితా తయారీ అంశంలో రాష్ట్రప్రభుత్వ సహకారం లేకపోవడంతో 2019 ఓటర్ల జాబితాతో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక కోర్టులు జోక్యం చేసుకోజాలవని చెప్పారు. అన్ని పక్షాల వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. పిటిషన్లు చట్టం ముందు నిలబడవంటూ కొట్టివేసింది.
పంచాయతీ రిజర్వేషన్‌పై ఉత్తర్వులకు నో
కొన్నిపంచాయతీల రిజర్వేషన్ల ఖరారును సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో.. ఎన్నికల ప్రక్రియను నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న ఈ దశలో జోక్యం చేసుకోలేమని జస్టిస్ డీవీఎ్‌సఎస్ సోమయాజులు గురువారం ఆదేశాలిచ్చారు.