పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వండి

0
193
Spread the love

త్రివర్ణ పతాకాన్ని అందించి.. దేశభక్తి పట్ల ప్రేరణ కల్పించిన పింగళి వెంకయ్యకు ‘భారతరత్న’ ఇవ్వాలని ప్రధాని మోదీని సీఎం జగన్‌ కోరారు. ఈ మేరకు ఓ లేఖ రాశారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర సంబరాలకు ప్రతీకగా శుక్రవారం నుంచి చేపడుతున్న ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా ఆయన గుంటూరు జిల్లా మాచర్లలో పింగళి కుటుంబ సభ్యులను కలిశారు. ప్రపంచవ్యాప్తంగా జాతీయ జెండాలన్నిటినీ పరిశీలించి.. భారత్‌కు మువ్వన్నెల పతాకాన్ని రూపొందించి ‘జెండా వెంకయ్య’గా ప్రఖ్యాతిగాంచిన పింగళికి.. 75 ఏళ్ల స్వాతంత్రోత్సవ సంబరాలకు ఖ్యాతి దక్కేలా ఆయనకు భారతరత్న ఇచ్చి సత్కరించడం.. దేశానికిచ్చే గౌరవానికి ప్రతీకగా జగన్‌ అభివర్ణించారు. మరణానంతరం కొందరికి భారతరత్న ఇచ్చారని.. పింగళి సేవలను కూడా గుర్తించి భారతరత్న ఇచ్చి గాంధీజీ ఆశయాలను ఆదర్శంగా తీసుకున్న దేశభక్తుడి రుణం తీర్చుకుందామని లేఖలో తెలిపారు. ప్రతి ఇంటా జాతీయ జెండా రెపరెపలాడాలన్న స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాన్ని చేపట్టారని మోదీని జగన్‌ ఈ సందర్భంగా ప్రశంసించారు.

పింగళి కుమార్తెకు సీఎం ఘనసత్కారం

మాచర్ల, మార్చి 12: జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుటుంబ సభ్యులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు. జాతీయ పతాకాన్ని రూపొందించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన కుమార్తె సీతామహాలక్ష్మిని ఘనంగా సత్కరించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి కాబోతున్న తరుణంలో దేశమంతటా ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ వేడుకలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. మన రాష్ట్రంలో ఈ వేడుకలను పింగళి వెంకయ్య కుటుంబసభ్యుల సన్మానంతో ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి మాచర్లకు వచ్చారు. ఇక్కడ నివాసముంటున్న వెంకయ్య కుటుంబసభ్యులను కలుసుకున్నారు. ముఖ్యమంత్రి తమ ఇంటికి రాగానే ఆ కుటుంబం ఒక్కసారిగా ఉద్వేగానికి లోనైంది.

జగన్‌ వారిని పేరుపేరునా పలకరించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మిని  ఘనంగా సత్కరించి.. ప్రభుత్వం ప్రకటించిన రూ.75 లక్షల చెక్కును అందజేశారు. కుటుంబ సభ్యుడు నరసింహాన్ని అడిగి పింగళి జీవిత విశేషాలను తెలుసుకున్నారు. అందుకు సంబంధించిన చిత్రాలను తిలకించారు. అరగంటపాటు వారితో గడిపిన జగన్‌.. అనంతరం వారి గృహ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.Ads by

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here