రాష్ట్రవ్యాప్తంగా బోధనాస్పత్రుల్లోని 3,500 మంది వైద్యులను ప్రభుత్వం నిలువునా ముంచింది. 6వ పీఆర్‌సీకి, 7వ పీఆర్‌సీకి సంబంధమే లేకపోవడంతో 2016 నుంచి వారు పడిన కష్టానికి ఫలితం లేకుండా పోయింది. 2005 వరకూ రాష్ట్ర స్కేల్‌లో ఉన్న బోధనాస్పత్రుల వైద్యులను అప్పటి సీఎం వైఎ్‌సఆర్ 2006 తర్వాత యూజీసీ పరిధిలోకి తీసుకొచ్చారు. 2006లో కేంద్రం ఇచ్చిన 6వ పీఆర్‌సీ ప్రకారం 2010లో బోధనాస్పత్రుల వైద్యుల స్కేల్స్ రివైజ్ చేశారు. నిబంధనల ప్రకారం 2006 నుంచి వారికి రావాల్సిన ఎరియర్స్ కూడా చెల్లించారు. డీఏ, హెచ్‌ఆర్‌ఏతో పాటు పెన్షన్లకు కమ్యూటేషన్ అవకాశం కల్పించారు. నాటి సీఎం వైఎ్‌సఆర్ వైద్యులకు ఇవ్వాల్సిన మొత్తం బెనిఫిట్స్ ఇవ్వగా… ప్రస్తుతం ఆయన తనయుడు జగన్ మాత్రం వారికి దక్కాల్సినవి ఇవ్వకపోగా వైద్యుల నుంచి ఎదురు లాక్కుంటున్నారని ఆరోపణలొస్తున్నాయి. యూజీసీ పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు ప్రతి పదేళ్లకు ఒకసారి వేతన సవరణ చేయాలి. 2006 తర్వాత 2016లో పీఆర్‌సీ ఇవ్వాల్సి ఉండగా. కేంద్రం 2018లో అమలు చేసింది. దీని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీలు, ఉన్నత విద్యాశాఖలో విధులు నిర్వహిస్తున్న వారిందరికీ 2019 ఫిబ్రవరి నుంచే స్కేల్ రివైజ్ చేసింది. బోధనాస్పత్రుల వైద్యులకు పీఆర్‌సీ అమలుపై అప్పటి ప్రభుత్వం ఆరోగ్యశాఖ ప్రత్యేక సీఎస్ పూనం మాలకొండయ్య నేతృత్వంలో కమిటీని నియమించింది. వైద్యులందరికీ అన్ని రకాల బెనిఫిట్స్ కల్పిస్తూ పీఆర్‌సీ అమలు చేయాలని సూచిస్తూ ప్రభుత్వానికి కమిటీ నివేదిక సమర్పించింది. ఆ తర్వాత రెండేళ్లకు పీఆర్‌సీ అమలు చేసిన ప్రభుత్వం… వైద్యుల బెనిఫిట్స్ మొత్తం ఖజానాకు మళ్లించింది.

పెన్షనర్లకు షాక్
2016-21 ఫిబ్రవరి మధ్యకాలంలో పదవీ విరమణ పొందిన సీనియర్ వైద్యులంతా పీఆర్‌సీ అమలైతే భారీగా ఎరియర్స్ వస్తాయని ఎదురు చూశారు. వారి ఆశలను ప్రభుత్వం ఆడియాసలు చేసింది. వారికి కమ్యూటేషన్ కూడా లేకుండా చేసింది. ప్రస్తుతం వస్తున్న పెన్షన్‌లో 40శాతం ముందుగానే తీసుకునే అవకాశం పెన్షనర్లకు ఉంది. దీన్నే కమ్యూటేషన్ అంటారు. దీనిని కూడా జీఓలో పొందుపరచలేదు. ప్రభుత్వ నిర్ణయంతో 2021 ఫిబ్రవరిలో రిటైర్ అయిన వైద్యులు ఒక్కొక్కరు సుమారు రూ.15లక్షల వరకూ నష్టపోయారు. ప్రస్తుతం పెరిగిన వేతనాల వల్ల కూడా పెన్షనర్లకు ఒరిగిందేమీ లేదని రిటైర్డ్ వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యులకు పీఆర్‌సీ ఇచ్చామని చెప్పుకోవడానికే జీఓ ఇచ్చినట్లుందని మండిపడుతున్నారు.
పదోన్నతులకు దూరం
బోధనాస్పత్రుల్లో వైద్యులకు ఏళ్ల తరబడి పదోన్నతులు లేవు. దీనిని అధిగమించేందుకు 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం వైద్యులందరికీ టైమ్ బౌండ్ పదోన్నతులు, స్కేల్ ఇచ్చింది. 2018 తర్వాత వైద్యులకు టీబీపీఎస్ ఒక్కసారే అమలు చేశారు. ఆ తర్వాత ఇప్పటి వరకూ వారికి పదోన్నతులు కల్పించలేదు. దీంతో 2014లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరినవారు ఇప్పటికీ అదే హోదాలో విధులు నిర్వహిస్తున్నారు. సీనియారిటీ జాబితా తయారీలో డీఎంఈ అధికారుల నిర్లక్ష్యంతో వీరికి కనీసం టైమ్ బౌండ్ పదోన్నతులు కూడా దక్కలేదు. ప్రస్తుత పీఆర్‌సీలో ట్యూటర్లకు 6వేలు, అసిస్టెంట్ ప్రొఫెసర్లకు 7వేలు, అసోసియేట్‌కు 8వేలు, ప్రొఫెసర్లకు 9వేలు యాన్యువల్ గ్రేడ్ పే అమలుచేస్తారు.
2014లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేసిన వైద్యులకు టీబీపీఎస్ అమలుచేస్తే వారు సీనియర్ అసోసియేట్ ప్రొఫెసర్ స్థా యిలో ఉండేవారు. కానీ ఇప్పుడు వారంతా 7వేల ఏజీపీకే పరిమితమయ్యారు. డీఎంఈ నిర్వాకంతో అసిస్టెంట్ ప్రొఫెసర్లు మరో పదేళ్ల పాటు సుమారు రూ.20లక్షల వరకూ నష్టపోతున్నారు. ఇలా ప్రతి కేడర్ వారికీ పీఆర్‌సీలో తీవ్ర అన్యాయం జరిగింది. దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని, అందరికీ ఎరియర్స్ ఇవ్వాలని వైద్యులు డిమాండ్ చేస్తున్నారు.