ప్రజా వైద్యం.. పెనుభారం!

0
280
Spread the love

రాష్ట్రంలో ప్రజా వైద్యం పెనుభారంగా మారనుంది. కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణం, నాడు-నేడు పథకాలు ఇటు ప్రభుత్వానికి అటు ప్రజలకు తలకు మించిన భారంగా మారనున్నాయి. వీటికోసం ప్రభుత్వం బ్యాంకుల నుంచి రూ.12,219 కోట్ల రుణం తీసుకుంటోంది. ఇందులో నాడు-నేడు పనులకు రూ.4,096 కోట్లు, కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణానికి రూ.8,123 కోట్లు కేటాయించనుంది. ఈ రుణం తీర్చేందుకు తిరిగి ప్రజల వద్దనుంచే ఫీజుల రూపంలో వసూళ్లు చేసేలా ఆరోగ్యశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ప్రభుత్వానికి రుణం ఇచ్చేందుకు ఇప్పటికే ఐదు బ్యాంకులు ముందుకొచ్చాయి. ఈ క్రమంలో బ్యాంకులు విధించిన షరతులకు అధికారులు తలొగ్గారు. ప్రతి వైద్య కళాశాలలో 4 ఎకరాల స్థలం గ్యారంటీగా పెట్టడంతో పాటు రుణం చెల్లింపుల కోసం ఏటా బడ్జెట్‌లో కొంత మొత్తాన్ని కేటాయించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణం 2025 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. బ్యాంకులకు రీపేమెంట్‌ కూడా 2025 నుంచి ప్రారంభించి 2035 వరకూ అంటే సుమారు 11ఏళ్ల పాటు చెల్లించాలని నిర్ణయించింది. ఈ సమయంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా బ్యాంకులకు చెల్లింపుల కోసం బడ్జెట్‌లో కేటాయింపులు చేసేలా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు 2025-36 వరకూ బడ్జెట్‌లో రూ.48,979 కోట్లు కేటాయింపులు చేయాల్సిందే. ఇదే సమయానికి పాత, కొత్త మెడికల్‌ కాలేజీల నిర్వహణతో కూడా కలిపి 11ఏళ్ల పాటు ప్రభుత్వంపై రూ.54,356 కోట్లు భారం పడనుంది. మొత్తంగా ఏటా బ్యాంకులకు చెల్లించాల్సిన వడ్డీ, రీపేమెంట్‌, కాలేజీల నిర్వహణకు దాదాపు రూ.5వేల కోట్లు బడ్జెట్‌లో అదనంగా కేటాయించాల్సి ఉంటుంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీ మినహా మరే పథకానికి నిధులు విదల్చడం లేదు. గత రెండేళ్లలో ఆరోగ్యశాఖకు ఏటా కేటాయించిన బడ్జెట్‌ రూ.8 వేల కోట్లే. కొత్త మెడికల్‌ కాలేజీలు, నాడు-నేడు కోసం ప్రస్తుతం ఇస్తున్న రూ.8వేల కోట్లు కాకుండా మరో రూ.5వేల కోట్లు అదనంగా కేటాయించాలి. అంటే ఒక్క ఆరోగ్యశాఖకే ఏటా రూ.14 వేల కోట్ల వరకూ బడ్జెట్‌ కేటాయింపులు చేయాల్సి ఉంటుంది.

ఆరోగ్యశ్రీ ఇన్సెంటివ్‌లు కట్‌

కొత్త మెడికల్‌ కాలేజీలు, ‘నాడు-నేడు’ పుణ్యమా అని వైద్యుల ఆదాయానికి కూడా ప్రభుత్వం ఎసరు పెడుతోంది. ప్రస్తుతం బోధనాస్పత్రుల్లో పేదలకు ఆ మాత్రం వైద్య సేవలు అందుతున్నాయంటే ఆరోగ్యశ్రీ ఇన్సెంటివ్స్‌ కారణం. చాలామంది వైద్యులు వాటికోసమే శస్త్ర చికిత్సలు చేస్తుంటారు. కొన్ని బోధనాస్పత్రుల్లో వైద్యులకు జీతం కంటే ఇన్సెంటివ్‌ల ఆదాయమే ఎక్కువగా ఉంటుంది.

అయితే బ్యాంకు రుణాలు తీర్చేందుకు ఆరోగ్యశాఖ అధికారులు ఈ ఇన్సెంటివ్‌లను తగ్గించే ప్రతిపాదనలు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీలో రోగులకు చికిత్స చేస్తే ప్రస్తుతం వైద్యులకు 35 శాతం ఇన్సెంటివ్‌గా ఇస్తున్నారు. ఈ మొత్తాన్ని 15 లేదా 25 శాతానికి తగ్గించాలని భావిస్తున్నారు. ఈ నిర్ణయం అమలైతే ఆస్పత్రుల్లో అంతంత మాత్రంగానే కనిపించే వైద్యులు మళ్లీ పాతరోజుల్లో మాదిరిగా సంతకాలు పెట్టి వెళ్లిపోయే పరిస్థితి వస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఉన్న కాలేజీలను సక్రమంగా నిర్వహించలేని ప్రభుత్వం కొత్త కాలేజీల నిర్మాణం, పాత కాలేజీలకు రీ మోడలింగ్‌ పనులంటూ ప్రజలపై భారం మోపడానికి సిద్ధమైందన్న విమర్శలు వస్తున్నాయి.

ఖరీదు కానున్న ప్రభుత్వ వైద్యం

ప్రభుత్వం చేసిన అప్పుల భారాన్ని ప్రజలపై కూడా మోపడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఓపీ దగ్గర నుంచి రక్తపరీక్షల వరకూ అన్నింటికీ కొంత మొత్తాన్ని ఫీజు రూపంలో వసూలు చేసేవిధంగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. రోగులు ఆస్పత్రుల్లో వైద్యుడికి చూపించుకోవడానికి కన్సల్టేషన్‌ రూపంలో కూడా ఫీజు నిర్ణయిస్తారు. ఇప్పటికే ఎంబీబీఎస్‌, నర్సింగ్‌ సీట్ల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయాన్ని బ్యాంకులకు గ్యారంటీగా పెట్టింది. వీటితో పాటు బోధనాస్పత్రుల పరిధిలో ఉన్న ఖాళీ భూములను ప్రైవేటు వ్యక్తులకు లీజుకు ఇచ్చే ప్రతిపాదనలు తెరపైకి తీసుకొస్తున్నారు. 11 పాత బోధనాస్పత్రులు, 16 కొత్త బోధనాస్పత్రుల్లో ఖాళీగా ఉన్న స్థలాలను మెడికల్‌, ఇతర షాపుల యజమానులకు అద్దెకు ఇస్తారు.

వారు ఆ ఆస్పత్రుల్లోనే నచ్చిన వ్యాపారం పెట్టుకోవచ్చు. ఆరోగ్యశాఖకు అద్దె చెల్లిస్తే సరిపోతుంది. ఇప్పటికే విజయవాడ, విశాఖ, కర్నూలు, చిత్తూరుల్లోని బోధనాస్పత్రుల్లో ప్రైవేటు వ్యక్తులకు స్థలాలు ఇచ్చింది. వాటిని వెనక్కి తీసుకోవడానికి అధికారులు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఆరోగ్యశాఖ అధికారుల కొత్త ప్రతిపాదనలతో బోధనాస్పత్రుల స్థలాలు మొత్తం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

రీ పేమెంట్‌ ఇలా…

బ్యాంకుల నుంచి రుణంగా తీసుకునే రూ.12,219 కోట్ల రీ పేమెంట్‌ కోసం ప్రభుత్వం మార్గాలను ఆన్వేషిస్తోంది. దీనిలో భాగంగా ఆరోగ్యశ్రీ నిధులను కూడా కాలేజీలకు వచ్చే ఆదాయం కింద చూపించారు. ఆరోగ్యశ్రీ ద్వారా పాత, కొత్త మెడికల్‌ కాలేజీలకు ఏటా రూ.300 కోట్లు వస్తుందని అంచనా వేశారు. 2036 నాటికి ఈ మొత్తం రూ.600 కోట్ల వరకూ పెరుగుతుందని పేర్కొంటూ ఈ మొత్తాన్ని రీ పేమెంట్‌కు గ్యారంటీ పెట్టినట్లు సమాచారం. మరోవైపు పాత, కొత్త మెడికల్‌ కాలేజీల్లో ఎంబీబీఎస్‌ సీట్లు అమ్మితే సుమారు రూ.150కోట్ల వరకూ ఆదాయం వస్తుందని పేర్కొన్నారు.

ప్రస్తుతం ఉన్న 11 కాలేజీల్లో 1,885 ఎంబీబీఎస్‌ సీట్లను ఒక్కోటీ రూ.పది వేల చొప్పున భర్తీ చేస్తున్నారు. కొత్త కాలేజీల్లో 1,850 సీట్లను ఏ, బీ కేటగిరీలుగా విభజించారు. ఏ-కేటగిరీ సీటు ధర రూ.20 వేలుగా, బీ-కేటగిరీ సీటు ధర రూ.12లక్షలుగా నిర్ణయించారు. 2025 నాటికి కొత్త, పాత కాలేజీల్లో ఎంబీబీఎస్‌ సీట్లు అమ్మగా సుమారు రూ.120కోట్లు, 2036 నాటికి రూ.550కోట్ల వరకూ ఆదాయం వస్తుందని అంచనా వేశారు. వీటితో పాటు మరిన్ని మార్గాల్లో మెడికల్‌ కాలేజీలకు ఆదాయం వస్తుందని ఆరోగ్యశాఖ అధికారులు బ్యాంకులకు చూపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here