‘ప్రభుత్వాస్పత్రుల్లో కార్పొరేట్ తరహాలో సేవలు ఉండాలి. మౌలిక సదుపాయాలు, నిర్వహణ, శుభ్రత విషయంలో కార్పొరేట్ ఆస్పత్రుల్లో పాటిస్తున్న ప్రమాణాలన్నీ ప్రభుత్వాస్పత్రుల్లోనూ ఉండాలి. నాణ్యమైన సేవలు అందేలా కచ్చితంగా ప్రమాణాలు పాటించాలి. దీనికోసం ఎస్‌ఓపీలు తయారుచేసి, వాటిని అమలు చేయాలి’ అని ఆరోగ్యశాఖ అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఆస్పత్రుల నిర్వహణను తేలిగ్గా తీసుకోవద్దని స్పష్టం చేశారు. ఉత్తమ వైద్యం, ఉత్తమ నిర్వహణ, ఉత్తమ ప్రమాణాలు పాటించడమే లక్ష్యం కావాలన్నారు. మనం ఆస్పత్రులకు వెళ్లేటప్పుడు ఎలాంటి సదుపాయాలు, సౌకర్యాలు కోరుకుంటామో అవన్నీ ప్రభుత్వాస్పత్రుల్లో పేదవాడికి లభ్యం కావాలని ఆదేశించారు. బెడ్‌షీట్ నుంచి శానిటేషన్ వరకూ అన్ని అంశాల్లోనూ ఉత్తమ ప్రమాణాలు పాటించాలని, పేషెంట్‌కు ఇచ్చిన గది, పడకతో పాటు ఆస్పత్రి వాతావరణం, రోగులకు అందిస్తున్న భోజనం ఈ మూడు అంశాల్లో మార్పులు కచ్చితంగా కనిపించాలన్నారు. ఆరోగ్యశాఖలో ‘నాడు-నేడు’పై మంగళవారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ విద్య, వైద్యరంగాల్లో ‘నాడు-నేడు’ కార్యక్రమాలను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిందన్నారు. పనులకు సంబంధించి నిధుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నిర్దేశించుకున్న లక్ష్యంలోగా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

భూసేకరణతో పాటు ఏ విషయంలోనైనా సమస్యలొస్తే వెంటనే తన దృష్టికి తీసుకురావాలన్నారు. అప్పటికప్పుడే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం ఉన్న ఆస్పత్రులు, కొత్తగా నిర్మాణమవుతున్న ఆస్పత్రులు, బోధనాస్పత్రుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ‘ఏ ప్రభుత్వాస్పత్రిలోనూ అపరిశుభ్రత కనిపించకూడదు. పరికరాలు పనిచేయట్లేదనే మాట వినిపించకూడదు. కొత్త ఆస్పత్రుల నిర్మాణం ఎంత ముఖ్యమో, నిర్వహణ కూడా అంతే ముఖ్యం. ఇన్ని వేల కోట్లు ఖర్చుచేసి అభివృద్ధి కార్యక్రమాలు, కొత్త ఆస్పత్రుల నిర్మాణాలు చేసిన తర్వాత వైద్యులు, సిబ్బంది లేరన్నమాట రాకూడదు. ఎంతమంది వైద్యులు అవసరమో, అందర్నీ తీసుకొండి. ప్రతి ఆస్పత్రిని నిర్వహించే యంత్రాంగం సమర్థంగా ఉండాలి. ఈ రంగంలో అనుభవం ఉన్న నిపుణులను తీసుకురండి. ఆస్పత్రిలో పరిపాలన, క్లినికల్ వ్యవహారాలు రెంటినీ వేరుగా చూడాలి. విలేజ్ క్లినిక్‌ల నుంచి బోధనాస్పత్రుల వరకూ ఈ విధానం అమలుకావాలి. దీనికి అవసరమైన ఎస్‌ఓపీలు తయారు చేయాలి’ అని అధికారులను సీఎం ఆదేశించారు.
వైఎ్‌సఆర్ క్లినిక్‌లపై సమీక్ష
వైఎ్‌సఆర్ హెల్త్ క్లినిక్‌ల పునరుద్ధరణలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని, సెప్టెంబరు నాటికి నిర్మాణాలను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. వీటి కార్యకలాపాలకు సంబంధించి కూడా ఎస్‌ఓపీలను తయారు చేయాలన్నారు. అవసరమైన చోట్ల సిబ్బంది భర్తీకి చర్యలు తీసుకోవాలన్నారు. అర్బన్ ప్రాంతాల్లోని పీహెచ్‌సీల్లో అభివృద్ధి కార్యక్రమాలు, కొత్తవాటి నిర్మాణం త్వరితగతిన పూర్తిచేసే దిశగా కార్యాచరణ చేయాలని ఆదేశించారు. పాడేరు, పులివెందుల, పిడుగురాళ్ల, మచిలీపట్నం సహా కొత్త మెడికల్ కాలేజీలు, గిరిజన ప్రాంతాల్లో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు, తదితరాలపై సీఎం సమీక్షించారు. మార్చి నెలాఖరు కల్లా వైద్య కళాశాలలు, ఆస్పత్రుల నిర్మాణానికి సంబంధించి భూముల సేకరణ, వాటి చెల్లింపులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొత్తగా నిర్మించనున్న మెడికల్ కాలేజీలకు మే 15కల్లా టెండర్లు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెప్పారు. మిగిలినవాటిలోనూ అభివృద్ధి పనులకు ఏప్రిల్ నెలాఖరు కల్లా టెండర్లు ఖరారవుతాయన్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రస్తుత పరిస్థితిపై వారు మాట్లాడుతూ 69 ఆస్పత్రుల్లో 9,625 పడకలు అందుబాటులో ఉన్నాయన్నారు. వైరస్ వ్యాప్తి మునుపటి తరహాలో ఉధృతంగా లేకపోయినా అప్రమత్తంగానే ఉన్నామని సీఎంకు అధికారులు వివరించారు.