నాలుగో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం శుక్రవారంతో ముగిసింది. ప్రలోభాల తెర లేచింది. ఆదివారం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం నుంచే తాయిలాల పంపిణీ మొదలైపోయింది. దాదాపు ఎన్నికలు జరుగుతున్న ప్రతిచోటా ఇలాంటి పరిస్థితి ఉంది. కొన్నిచోట్ల నోట్ల కట్టలతోపాటు మద్యం పంపిణీ చేస్తుండగా.. ఈదఫా ఎన్నికల్లో వాటితోపాటు.. చికెన్, తిరుపతి లడ్డూలు వంటివి ఓటర్లకు ఎరగా వేశారు. ఓ అభ్యర్థి ఓటుకు రూ.రెండు వేల చొప్పున.. నలుగురున్న కుటుంబానికి రూ.8వేలు పంపిణీ చేస్తే.. అదే ఓటర్లను తమవైపునకు తిప్పుకోవడానికి ప్రత్యర్థివర్గం ఏకంగా రూ.20 వేలవరకు ఇచ్చినదాఖలాలు వెలుగుచూశాయి. మరికొందరు ఓట్లు కొల్లగొట్టేందుకు నగదుకు బదులుగా ఫ్రిజ్ వంటి కానుకలు ఎరగా వేశారు. ప్రధానంగా గుంటూరు డివిజన్ పంచాయతీ ఎన్నికల్లో ప్రలోభాలు పతాక స్థాయికి చేరాయి. ఆదివారం పోలింగ్ నేపథ్యంలో తాయిలాల పంపిణీకి తెరలేపారు.

మిగిలిన డివిజన్లకు భిన్నంగా ఇక్కడ పలు పంచాయతీల్లో అధికారపార్టీకి ధీటుగా ప్రతిపక్షాలు బలపరిచిన అభ్యర్థులు పోటీలో నిలిచారు. గెలుపుకోసం అభ్యర్థులు మద్యం, డబ్బు, గిఫ్ట్‌లు, పలావు పాకెట్లు పంచుతున్నారు. వట్టిచెరుకూరు మండలం కారంపూడిపాడులో ఓటేయమని కొంతమందికి రూ.30 వేల వరకు పంపిణీ చేసినట్లు తెలిసింది. రాజపాలెం మండలంలో ఓ అభ్యర్థి రూ.2వేల నోటు, కిలో చికెన్‌తోపాటు గిఫ్ట్‌ప్యాక్‌లు, బెల్లంకొండ మండలం ఎమ్మాజిగూడెంలో నాలుగు ఓట్లకు ఫ్రిజ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారని తెలిసింది. ఈ విషయం తెలిసి మరో అభ్యర్థి అదే ఇంట్లోని వారికి రూ.20 వేలు ఇచ్చారని సమాచారం. కోవెలమూడి, గుంటూరు మండలం మల్లవరం, తాడికొండ మండలం బండారుపల్లి, మోతడక, పెదనందిపాడు మండలం పాలపర్రుతోపాటు, ప్రత్తిపాడు, మేడికొండూరు, అమరావతి, క్రోసూరు, పెదకూరపాడు తదితర మండలాల పరిధిలోనూ తాయిలాల పంపిణీ జోరుగా సాగుతోంది. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం రెవెన్యూ డివిజన్‌లో అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రలోభాలకు తెర లేపారు.
మద్యం బాటిళ్లతోపాటు బిర్యానీలు, చీరలు, కుక్కర్లు, ఆర్థికపరమైన ప్రలోభాలతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ముమ్మిడివరం నియోజకవర్గానికి యానాం నుంచి తరలివస్తున్న రూ.3.05 లక్షలు విలువైన 2380 మద్యం బాటిళ్లను స్పెషల్ స్క్వాడ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొత్తపేట మండలం పలివెలలో 700 చీర్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు బాధ్యులపై కేసు నమోదు చేశారు. ఇక ఓటర్లకు రూ.300 నుంచి రూ.500 వరకు ఇచ్చి ఓట్లు కొనుగోలు చేసేందుకు అధికార వైసీపీ నాయకులతోపాటు అభ్యర్థులు పైరవీలు చేస్తున్నారు. అమలాపురం రూరల్ మండలం భట్నవిల్లిలో 6, 11 వార్డుల్లో పోటీచేస్తున్న అభ్యర్థులు పంపిణీ చేసేందుకు తీసుకువచ్చిన ప్రెషర్ కుక్కర్లను బొంతు వెంకటరమణ ఇంట్లో దాచి ఉంచగా, పోలీసులకు సమాచారం అందడంతో స్వాధీనం చేసుకున్నారు.
ఓటుకు రూ.10 వేలు!
పశ్చిమగోదావరి జిల్లా కొల్లేరు ఆయకట్టు మేజర్ పంచాయతీలోని ఒక వార్డులో ఓటుకు భారీ డిమాండ్ పెరిగింది. గ్రామంలో 12 వార్డులకు గాను మూడు వేలకు పైచిలుకు ఓట్లున్నాయి. పంచాయతీ సర్పంచ్ పదవి రిజర్వుడు (ఎస్సీ మహిళ) కావడంతో ఆమెను ముందుంచి అధికారం చేజిక్కించుకోవాలనే ప్రయత్నం ఇరువర్గాలు గట్టిగా కృషి చేస్తున్నాయి. ఇక ఓసీ సామాజిక వర్గానికి ఉపసర్పంచ్ పదవి కేటాయించడంతో పోటీ బాగా పెరిగి ఖర్చుకు ఏమాత్రం వెనుకాడడం లేదు. ఉపసర్పంచ్ అభ్యర్థి పోటీ చేస్తున్న వార్డులో 266 ఓట్లు ఉండగా, ఇక్కడ గెలుపు కోసం ఒక అభ్యర్థి ఓటుకు ఏకంగా రూ.10,000 నజరానా ఇవ్వడానికి ఇప్పటికే ఏర్పాట్లు జరిగిపోయాయి. ఇదేవార్డులో రెండో అభ్యర్థి మాత్రం వైద్య సహాయం కోసం ప్రజలకు ఒక వాహనాన్ని కొనుగోలు చేస్తానని హామీ ఇచ్చారు.