చిత్తూరు కార్పొరేషన్‌లో ఫోర్జరీ సంతకాలతో టీడీపీ అభ్యర్థుల ఉపసంహరణలు జరిగాయని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. వీడియో రికార్డింగ్ పరిశీలన జరిగే వరకూ అక్కడ ఏకగ్రీవాలను ప్రకటించకుండా నిలిపివేయాలని ఆయన రాష్ట్ర ఎన్నికల సంఘాని(ఎ్‌సఈసీ)కి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం లేఖ రాశారు. కొందరు అధికారులు, పోలీసుల సహకారంతో వైసీపీ నేతలు చిత్తూరులో టీడీపీ అభ్యర్థుల సంతకాలను ఫోర్జరీ చేసి పోటీ నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు నకిలీ లేఖలు సమర్పించారని చెప్పారు. కొన్ని డివిజన్లలో టీడీపీ అభ్యర్థుల పేరుతో వేరే వ్యక్తులను రిటర్నింగ్ అధికారి ముందు హాజరుపరచి.. పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు లేఖలు ఇప్పించారని తెలిపారు. ఇటువంటి ప్రయత్నాలు జరిగే అవకాశం ఉందని ఫిర్యాదులు రావడంతో అభ్యర్థుల ఉపసంహరణ ప్రక్రియను వీడియో రికార్డింగ్ తీయాలని, ఆ రికార్డును భద్రపరచాలని ఎస్‌ఈసీ ఆదేశించిందని గుర్తుచేశారు.

అక్రమాలకు పాల్పడుతున్న చోట్ల వైసీపీ నేతలు ఇలా వీడియో రికార్డింగ్ జరగకుండా చూశారని.. వారికి అధికారులు సహకరించారని.. ఇటువంటి మోసపూరిత ఉపసంహరణలపై వెంటనే కఠిన చర్య తీసుకోవాలని, వీడియో రికార్డింగ్‌లను తనిఖీ చేసే వరకూ చిత్తూరులో ఏకగ్రీవాల ప్రకటనను నిలిపివేయాలని చంద్రబాబు కోరారు.