‘బియ్యం’తో బొక్కుడు!

0
234
Spread the love

కాకినాడ యాంకరేజ్‌ పోర్టు… ఇది రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న రేవు!

ఇక్కడి నుంచి ఏటా 20 లక్షల టన్నుల బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తారు. తద్వారా ఏటా రూ.60 కోట్ల వరకు ఆదాయం వస్తోంది. ఒకరకంగా ఈ పోర్టు ఆర్థిక మనుగడకు బియ్యం ఎగుమతులే కీలకం! పక్కనే ప్రైవేటు నిర్వహణలో డీప్‌ వాటర్‌ పోర్టు నుంచి గ్రానైట్‌, యూరియా, పాస్పేట్‌, ముడిచమురు వంటివి దిగుమతి చేసుకుంటారు. అయితే… రాష్ట్ర ప్రభుత్వం బియ్యం ఎగుమతులను కూడా ప్రైవేటు పోర్టుకు అప్పగిస్తూ అనూహ్య నిర్ణయం తీసుకుంది. అసలు విషయం ఏమిటంటే… ఈ ప్రైవేటు పోర్టులో 41.12 శాతం వాటా ఇటీవలే సర్కారు పెద్దలకు సన్నిహితులైన ‘అరబిందో’ కంపెనీకి దక్కింది. డీప్‌వాటర్‌ పోర్టు నిర్వహణ వాటాను అరబిందోకు అప్పగించేలా పైస్థాయిలో పావులు కదిపినట్లు విమర్శలున్నాయి. ఇది జరిగిన రెండు నెలలకే… అరబిందో వారి పోర్టుకు అదనపు లాభం చేకూర్చేలా బియ్యం ఎగుమతులను యాంకరేజ్‌ పోర్టునుంచి తప్పించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఎన్నో ఏళ్లుగా…

యాంకరేజ్‌ పోర్టు చాలా పాతది. దేశం నుంచి ఏటా 50 లక్షల టన్నుల బియ్యం ఎగుమతి జరుగుతుండగా… అందులో 20 లక్షల టన్నులు ఇక్కడి నుంచే విదేశాలకు వెళతాయి. ఈ పోర్టుపై కొన్ని వేల మంది కార్మికులు ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. సంవత్సరాల తరబడి ఆధునికీకరణకు నోచుకోని యాంకరేజ్‌ పోర్టుకు బియ్యం ఎగుమతుల ద్వారా మాత్రమే ఆదాయం సమకూరుతోంది. గత కొన్నేళ్లుగా ఇక్కడి నుంచి ఆఫ్రికా దేశాలకు బియ్యం ఎగుమతులు భారీగా పెరిగాయి. నౌకల రద్దీకి అనుగుణంగా వేగంగా బియ్యం లోడింగ్‌ జరగడం లేదు. దీంతోపాటు ఈ పోర్టుకు వచ్చే మార్గంలో డ్రెడ్జింగ్‌ను ఎన్నో ఏళ్ల కిందట నిలిపివేశారు. దీంతో బియ్యం లోడింగ్‌ కోసం వచ్చే నౌకలు ఈ పోర్టుకు చాలా దూరంలో నడి సముద్రంలో నిలిచిపోతాయి. యాంకరేజ్‌ పోర్టు నుంచి సరుకు రవాణా బార్జిల్లో బియ్యం లోడ్‌చేసి నౌకల వద్దకు తరలిస్తారు. దీనివల్ల బియ్యం లోడింగ్‌ బాగా ఆలస్యమవుతోంది. యాంకరేజ్‌ పోర్టును ఆధునీకరించడంతోపాటు, డ్రెడ్జింగ్‌ చేయడమే దీనికి పరిష్కారం! దీనికి చొరవ తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే. కానీ… ఈ విషయాన్ని పక్కన పెట్టేశారు. ‘లోడింగ్‌కు ఆలస్యమవుతోంది’ అనే సాకును చూపించి… బియ్యం కార్గోను పక్కనే ఉన్న ప్రైవేటు పోర్టుకు అప్పగించారు. దీనిపై రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ బుధవారం జీవో నెంబరు 4 జారీ చేసింది. ‘‘యాంకరేజ్‌ పోర్టు నుంచి బియ్యం ఎగుమతులు ఆలస్యమవుతున్నందున ప్రైవేటు పోర్టు అయిన డీప్‌ వాటర్‌ సీ పోర్టుకు కార్గోను మళ్లిస్తున్నాం’’ అని తెలిపారు. అదే సమయంలో… యాంకరేజ్‌ పోర్టుకు బియ్యం ఎగుమతులు దెబ్బతినకుండా కచ్చితంగా పది నౌకల వరకు కార్గో ఉండేలా చూడాలంటూ ఓ మొక్కుబడి నిబంధన కూడా పెట్టారు.

కోట్లు కొట్టేద్దామనే….

యాంకరేజ్‌ పోర్టు నుంచి బియ్యం కార్గోను కొట్టేయడానికి డీప్‌ వాటర్‌ పోర్టు ఎప్పటినుంచో ఎత్తులు వేస్తోంది. ఇందుకు గత ప్రభుత్వాల నుంచి సహకారం లభించలేదు. ఇప్పుడు… ‘పెరిగిన ఎగుమతులు – లోడింగ్‌లో ఆలస్యం’ అనే పాత కారణమే చూపించి కొత్త ‘డీల్‌’ను సొంతం చేసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here