బ్రోచర్‌ వారెవరురా!

0
336
Spread the love

రికార్డుల్లో అది ఇప్పటికీ ప్రభుత్వ భూమి! వివాదాల్లో ఉంది. ప్రభుత్వం కానీ, ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న సంస్థ కానీ ఇప్పుడు తెరపైన లేవు. ఇంకెవరో తెర వెనుక నుంచి చక్రం తిప్పేస్తున్నారు. ‘విశాఖలో న్యూయార్క్‌ను దించేస్తాం’ అని ఊదరగొడుతున్నారు. గజం రూ.45 వేల చొప్పున అమ్ముతున్నారు. లావాదేవీలు జరుగుతున్నప్పటికీ… రిజిస్ట్రేషన్లు మాత్రం లేవు. ‘సైట్‌’ ఎలా ఉందో అని చూద్దామని ఎవరైనా వెళితే… కొండలు, గుట్టలతో కూడిన భూమిని కొత్తగా చదును చేసినట్లు కనిపిస్తుంది. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు 30 అడుగుల తారు రోడ్డు కూడా తాజాగా వేశారు. ‘వైజాగ్‌ వన్‌’ అంటూ అందమైన బ్రోచర్లు ముద్రించి… ‘రియల్‌’ మాయ చేస్తున్నారు. అసలు కథలోకి వెళితే…అది వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయం! 2007లో నాగార్జున కన్‌స్ట్రక్షన్‌ కంపెనీకి (ఎన్‌సీసీ) విశాఖ మధురవాడలో ఐటీ సెజ్‌ హిల్‌ నంబరు 3ని ఆనుకొని ఉన్న 97.3 ఎకరాల భూమిని ఇచ్చారు. ఏపీ హౌసింగ్‌ బోర్డుతో జాయింట్‌ వెంచర్‌గా అక్కడ ఇళ్లు నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం ఆ సంస్థ… ఎన్‌సీసీ వైజాగ్‌ అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ పేరుతో మరో కంపెనీ ఏర్పాటుచేసింది. ఈ భూమిని అభివృద్ధి చేయడానికి ఎకరాకు రూ.93.2 లక్షలు చొప్పున ఖర్చు చేసేందుకు, ప్లాట్లు వేసి విక్రయించగా వచ్చే మ్తొతంలో రెసిడెన్షియల్‌ ఏరియాపై 1.75 శాతం, వాణిజ్య ప్రాంతంపై రెండు శాతం ప్రభుత్వానికి ఇవ్వడానికి ఒప్పందం జరిగింది. మొత్తం భూమిలో 90 శాతం రెసిడెన్షియల్‌ కోసం, మిగిలిన 10 శాతం వాణిజ్య అవసరాల కోసం వినియోగించుకోవచ్చు. అయితే అందులో ఐదు శాతం భూమిలో పేద, దిగువ మధ్య తరగతి వారికి ప్లాట్లు వేయాలని నిర్ణయించారు. రెవెన్యూ షేరింగ్‌లో కొన్ని మార్పులు చేశారు. రెసిడెన్షియల్‌ ఆదాయంలో 3.5 శాతం, వాణిజ్య విభాగం ద్వారా వచ్చే ఆదాయంలో 4 శాతం ప్రభుత్వానికి ఇవ్వాలని నిర్ణయించారు. భూమిలో కార్యకలాపాలకు ఎన్‌సీసీకి పవర్‌ ఆఫ్‌ అటార్నీ ఇచ్చారు. ఇదంతా 2010 వరకు జరిగిన కథ.

విజిలెన్స్‌ నివేదికతో…

రకరకాల కారణాల వల్ల… ఈ ప్రాజెక్టు ముందుకు కదల్లేదు. కాలం గడుస్తున్నా పనులు చేపట్టకపోవడంతో విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం దృష్టిపెట్టింది. 2012 మార్చి 23న ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ప్రాజెక్టులో జాప్యం చేస్తున్న ఎన్‌సీసీ కంపెనీకి ఏపీ హౌసింగ్‌ బోర్డు షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. 2013 డిసెంబరులో టెర్మినేషన్‌ నోటీ్‌సతో పాటు పవర్‌ ఆఫ్‌ అటార్నీని కూడా రద్దు చేసింది. దీనిపై ఎన్‌సీసీ యాజమాన్యం కోర్టును ఆశ్రయించింది. 2014లో కోర్టు స్టేటస్‌ కో ఆర్డర్‌ ఇచ్చింది. అయితే… కోర్టులో వివాదాలు పరిష్కరించుకోవడానికి 2016లో ఎన్‌సీసీ 3 అంశాలతో ముందుకువచ్చింది. 1)రెవెన్యూ షేర్‌ హౌసింగ్‌ బోర్డుకు ఇచ్చాక, ఆ భూమిపై కంపెనీకి ఫ్రీ హోల్డ్‌ ఇవ్వాలి. 2)అప్పటివరకు తాము చెల్లించిన రూ.91 కోట్ల మొత్తాన్ని 12 శాతం వడ్డీకి తక్కువ లేకుండా చెల్లించాలి. 3)ఇరువర్గాలకు అంగీకారమైన నిబంధనలతో ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లడానికి కొత్త ఒప్పందం చేసుకోవాలి. దీనిపై ప్రభుత్వం స్పందించలేదు. దాంతో ఎన్‌సీసీ 2019లో మరోసారి ప్రభుత్వాన్ని కలిసింది. ఈ ప్రాజెక్టులో హౌసింగ్‌ బోర్డును తప్పించి, స్టాంపు డ్యూటీ మినహాయిస్తూ భూమి రిజిస్టర్‌ చేయాలని కోరింది. అయితే, ప్రభుత్వం మినహాయింపు ఇవ్వకుండా మళ్లీ పవర్‌ ఆఫ్‌ అటార్నీ ఇవ్వాలని హౌసింగ్‌ బోర్డును ఆదేశించింది. ఈలోగా ఎన్నికలతో విషయం ఆగిపోయింది. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం రావడంతో ఈ ప్రాజెకు అధ్యయనానికి నలుగురు సభ్యులతో ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. వారం రోజుల్లోనే నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అయితే, కమిటీ ఏమని నివేదిక ఇచ్చిందనేది బయటకు రాలేదు. కానీ… ఈ ఏడాది జనవరి తరువాత ఉన్నట్టుండి కొండలు, గుట్టలుగా ఉన్న ఆ ప్రాంతంలో పనులు మొదలయ్యాయి.

విశాఖలో ‘న్యూ’యార్క్‌

వైజాగ్‌ వన్‌… ఇది ప్రాజెక్టు టైటిల్‌! ‘ఇన్‌స్పైర్డ్‌ బై ది న్యూయార్క్‌ లైఫ్‌ స్టైల్‌’… ఇది సబ్‌టైటిల్‌! ఈ పేరుతో 64 పేజీల అందమైన బ్రోచర్‌ను తయారు చేశారు. హౌసింగ్‌బోర్డు, ఎన్‌సీసీ జాయింట్‌ వెంచర్‌కు చెందిన వివాదాస్పద భూమిలోనే ఈ లేఔట్‌ ఉండటం గమనార్హం. ఇదంతా చేస్తున్నది ఇటు ఎన్‌సీసీ కాదు. అటు హౌసింగ్‌ బోర్డు కాదు. మధ్యలో ఓ మరో కొత్త సంస్థ వచ్చింది. దానికి సారథ్యం వహిస్తున్నది వైసీపీ పెద్దలు, వారి బినామీలు అని ప్రచారం జరుగుతోంది. ఉత్తరాంధ్ర బాధ్యతలు చూస్తున్న నాయకుడి కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మధురవాడ హౌసింగ్‌ ప్రాజెక్టు కోసం కేటాయించిన 97.3 ఎకరాల భూమి విలువ ప్రస్తుత మార్కెట్‌ రేటు ప్రకారం వెయ్యి కోట్లు. ఎన్‌సీసీకి ఎంతోకొంత ఇచ్చేసి… మొత్తం ప్రాజెక్టు థర్డ్‌ పార్టీకి అప్పగించి, అందులో లబ్ధి పొందడానికి పెద్దలు ఏర్పాట్లు చేసుకున్నారని సమాచారం. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మధురవాడకు సమీపంలోనే ఎండాడలో 100 ఎకరాలకు పైగా వైవీ సుబ్బారెడ్డికి కట్టబెట్టారు. వుడాతో జాయింట్‌ వెంచర్‌ కింద ఆ భూమి తీసుకొని అందులో విల్లాలు, అపార్ట్‌మెంట్లు కడతామని గ్లోబల్‌ ఎంట్రోపాలిస్‌ అనే కంపెనీని తెర పైకి తెచ్చారు. తమ పేరు మీదకు భూమి రాగానే ఆ ప్రాజెక్టును శ్రీరామ్‌ ప్రాపర్టీ్‌సకు అప్పగించి, వీరి వాటాగా వచ్చిన ప్లాట్లు (సుమారుగా రూ.200 కోట్లు) అమ్మేసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here