‘ఉడకని అన్నం, పొగ వాసనతో కూర.. కంపుకొడుతున్న భోజనం’ తినలేకపోతున్నామంటూ విజయనగరం జిల్లా కురుపాం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఏకంగా మధ్యాహ్న భోజనం రిజిస్టర్‌లో రాయడం కలకలం రేపింది. పాఠశాలలో 470 మంది చదువుతున్నారు. శుక్రవారం 365 మంది హాజరయ్యారు. ఇందులో 210 మంది భోజనం చేసినట్లు రిజిస్టర్‌లో చూపారు. ఇలా భోజనాలు చేసినవారు.. భోజనం బాగాలేదని, ఉడకని అన్నం పెడుతున్నారని, కూర కంపుకొడుతుందంటూ, పొగ వాసన కారణంగా తినలేదని రిజిస్టర్‌లో రాశారు. ఆ తర్వాత భోజనం కోసం ఇళ్లకు వెళ్లడంతో విషయం వెలుగు చూసింది. ఈ విషయమై ఇన్‌చార్జి హెచ్‌ఎం తారకరామారావును వివరణ కోరగా.. రేషన్ అందించడం వరకే తన పని అని ముక్తాయించారు. విషయం తెలిసి.. ఐటీడీఏ పీవో కూర్మనాథ్ పాఠశాలకు వచ్చారు. విద్యార్థులను ప్రశ్నించగా.. రోజూ నాసిరకం భోజనం పెడుతున్నారని తెలిపారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పీవో స్పష్టం చేశారు.
