‘రాజధానులు’ వైసీపీకే!

0
151
Spread the love

వైసీపీ నేతల అధికార బలం… టీడీపీ నేతల్లో కొరవడిన సమన్వయం! ఫలితం… గుంటూరు నగరం వైసీపీ కైవశమైంది. ఈ నగరంలో గెలుపు కోసం అధికారపక్షం పకడ్బందీగా వ్యవహరించింది. అనుకున్నట్లుగానే… గుంటూరు నగరపాలక సంస్థతోపాటు జిల్లాలోని అన్ని మునిసిపాలిటీల్లో గెలు పు జెండా ఎగరవేసింది. నిజానికి… మాచర్ల, పిడుగురాళ్ల తరహాలోనే గుంటూరు నగరాన్ని కూడా ఏకగ్రీవంగా సొంతం చేసుకోవాలని భావించారు. టీడీ పీ మేయర్‌ అభ్యర్థిగా ప్రకటించిన కోవెలమూడి రవీంద్ర(నాని)ను ఎన్నికల బరిలో నుంచి తప్పించేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారు. ఆయన వ్యాపారాలను దెబ్బతీస్తామని పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు.

టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తారని ఊహించిన నగర ప్రముఖులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇక… ధన ప్రవాహం సరేసరి. వైసీపీ మేయర్‌ అభ్యర్థిని ముందుగా ప్రకటించకుండా.. ‘మీకే పదవి’ అంటూ ముగ్గురు, నలుగురికి ఆశపెట్టి కోట్లాది రూపాయలు వసూలు చేశా రు. పారిశ్రామిక సంస్థల అసోసియేషన్‌ల నుంచి కూడా వసూళ్లు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఇలా పోగేసిన డబ్బు నుంచి ఒక్కో డివిజన్‌కు రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఖర్చు చేశారు.

గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికను వైసీపీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకోగా… టీడీపీలో ఇలాంటి పరిస్థితి కనిపించలేదు. సహజంగా ఉన్న బలంతోపాటు అమరావతి ఉద్యమం వంటి సానుకూల అస్త్రాలు ఉన్నప్పటికీ సమర్థంగా వాడుకోలేదు. టీడీపీ తరఫున మేయర్‌ అభ్యర్థిగా బరిలోకి దిగిన కోవెలమూడి రవీంద్రతోపాటు పార్టీ అభ్యర్థులు తమ కష్టాలు తాము పడ్డారు. అధినేత చంద్రబాబు తనవంతుగా గుంటూరులో ప్రచారం చేసినప్పటికీ పార్టీ సీనియర్‌ నేతలెవరూ చొరవ తీసుకుని వీరికి అండగా నిలబడలేదు. సమష్టి పోరాటం, సమన్వయం కనిపించలేదు. తగిన ప్రచార వ్యూహమూ రచించలేదు. దీని ఫలితంగా కేవలం 9 స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది. ‘గెలవడం కష్టం’ అని ముందుగానే కాడి పడేయడంవల్లే గుంటూరులో దెబ్బతిన్నామని ఇప్పుడు పలువురు నేతలు వాపోతున్నారు. ఇక… గుంటూరు నగరపాలకసంస్థలో జనసేన-బీజేపీ అభ్యర్థులు 42 స్థానాల్లో పోటీ చేశారు. ఫలితాలను విశ్లేషించగా.. 12 డివిజన్లలో వైసీపీకి వచ్చిన ఆధిక్యతకంటే జనసేన అభ్యర్థులకే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి.

బెజవాడ: తమ్ముళ్ల తగవుతో తంటా

సంక్షేమ పథకాలు ఆగిపోతాయన్న భయం.. తెలుగు తమ్ముళ్ల నడుమ విభేదాలు.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లలో చీలిక.. వైసీపీ అధికార-ధన బలం! ఇవన్నీ కలిశాయి! విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో వైసీపీ విజయానికి బాటలు వేశాయి. రాష్ట్రమంతా ఫలితం ఎలా ఉన్నా విజయవాడలో ఎక్స్‌అఫిషియో బలంతోనైనా టీడీపీ విజయం సాధిస్తుందని విశ్లేషకులు భావించారు. కానీ… ఇక్కడా తెలుగుదేశానికి నిరాశే ఎదురైంది. నగరానికి చెందిన మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ మల్లాది విష్ణు ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన దేవినేని అవినాశ్‌ కూడా తన సత్తా చాటుకునేందుకు ఈ ఎన్నికలను ఓ వేదికగా చేసుకున్నారు. వైసీపీలో అంతర్గత విభేదాలు ఉన్నా ఎక్కడా వాటిని బయటపడనివ్వలేదు. అందరూ కలిసి కట్టుగా ప్రజల్లోకి వెళ్లారు. మరోవైపు రాష్ట్ర మంత్రులందరూ విజయవాడపైనే తమ దృష్టిని కేంద్రీకరించారు. దాదాపు కేబినెట్‌లోని మంత్రులందరూ విజయవాడలో ప్రచారంలో పాల్గొనడం గమనార్హం. జిల్లా ఇన్‌చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి సైతం ఇక్కడ గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఆర్థిక దన్నుతోపాటు అధికార దన్ను తోడవడంతో వైసీపీ గెలుపు నల్లేరుమీద నడక అయింది.

విశాఖ: అస్త్రాలున్నా అంతే!

సంప్రదాయంగా అండగా నిలిచే నగర ఓటరు, విశాఖ స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణ అంశం… ఇలాంటి కీలకమైన సానుకూల అంశాలున్నప్పటికీ… విశాఖ మహానగర పాలక సంస్థను టీడీపీ చేజిక్కించుకోలేకపోయింది. అయితే… విజయవాడ, గుంటూరుతో పోల్చితే మంచి ఫలితాలనే సాధించగలిగామన్న తృప్తి మాత్రం ఆ పార్టీకి మిగిలింది. విశాఖలో విజయం కోసం వైసీపీ అన్ని శక్తులను ప్రయోగించింది. మొదట… బలమైన ప్రత్యర్థులు బరిలో లేకుండా బెదిరించింది. పాత కేసులు బయటకు తీస్తామని భయపెట్టి కొందరిని పోటీలో లేకుండా చేసింది. ఇక ఎన్నికల్లో డబ్బు పంపిణీ విచ్చలవిడిగా జరిగింది. ఈ ఒక్క ఎన్నికకే రూ.200 కోట్లు వరకు వెచ్చించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల ప్రక్రియ మొత్తం తమకు అనుకూలంగా జరిగేలా వైసీపీ నేతలు దగ్గరుండి చూసుకున్నారు. ప్రశ్నించిన ప్రతిపక్ష పార్టీ నాయకులను పోలీస్‌ స్టేషన్‌లో పెట్టించారు. అంతటితో సరిపెట్టుకోకుండా… బలంగా జనంలోకి వెళ్లారు. మురికివాడల్లో పర్యటించారు. సమస్యలు పరిష్కరిస్తామంటూ హామీలు గుప్పించారు. విశాఖలో అపజయం ఎదురైతే అక్కడి పార్టీ బాధ్యులంతా పదవులకు రాజీనామాలు చేయాల్సి ఉంటుందని పార్టీ అధినేత హెచ్చరించారని ప్రచారం జరగడంతో ప్రతి ఒక్కరూ భయంతో పనిచేశారు. ఫలితం సాధించారు.

తెలుగుదేశంలో లోపించిన సమన్వయం

విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీకి మంచి పట్టుంది. నగరంలో తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ నియోజకవర్గాల్లో టీడీ పీ ఎమ్మెల్యేలే ఉన్నారు. దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌కుమార్‌ వైసీపీలో చేరిపోయారు. ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గెలిచినప్పటి నుంచి పార్టీకి దూరంగా ఉన్నారు. ఇటీవ లే మళ్లీ పార్టీ కార్యక్రమాల్లో పా ల్గొంటున్నప్పటికీ… కేడర్‌ చెదిరిపోయింది. విశాఖ ఎన్నికల్లో సమన్వయ బాధ్యతను పా ర్టీ అధిష్ఠానం ఎవరికీ అప్పగించలేదు. పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అభ్యర్థుల ఎంపికను పర్యవేక్షించారు. నేతలు ఎవరికి వారు తమ నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకున్నా రు. ఇన్ని ప్రతికూలతల మధ్య కూడా టీడీపీ 30 వార్డులు గె లుచుకుని జీవీఎంసీలో గట్టి ప్రతిపక్షంగా నిలబడింది.

ప్రభావం చూపని అంశాలు..

బూత్‌ దాకా వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడానికి ఉద్యోగులు, వ్యాపారులు సాహసించలేదు. స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణ అంశం కూడా అనుకున్నంత ప్రభావం చూపలే దు. ప్లాంటు ఉద్యోగులు, కార్మికులు, నిర్వాసితులు ఎక్కువగా ఉన్న గాజువాక నియోజకవర్గంలో 17 వార్డులు ఉండగా… తెలుగుదేశం 7, వైసీపీ 7 దక్కించుకున్నాయి. వామపక్షాలకు రెండు, జనసేనకు 1 వచ్చాయి. అంతకుమించి… నగరమంతా విశాఖ ఉక్కు ప్రభావం కనిపించలేదు.

‘‘గుంటూరు, విజయవాడ నగరాల్లో పాగా వేయాలి! విశాఖ కార్పొరేషన్‌నూ సొంతం చేసుకోవాలి. అమరావతి ఉద్యమాన్ని నీరుగార్చాలి. మూడు రాజధానులకు మద్దతు ఉందని చాటాలి’’…

ఇదీ వైసీపీ లక్ష్యం! ఈ దిశగానే ఎన్నికల వ్యూహాన్ని రచించింది. గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం నగరపాలక సంస్థలపై ప్రత్యేక దృష్టిసారించింది. ‘ఏది ఏమైనా’ అనుకున్నది సాధించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here