రాజీనామాలే ప్రధానాస్త్రం!

0
218
Spread the love

విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి ప్రజాప్రతినిధుల రాజీనామాలే ప్రధాన అస్త్రమని విశాఖ తూర్పు ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. గురువారం శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో సూర్యనారాయణస్వామిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం ఆమదాలవలసలో స్పీకర్‌ తమ్మినేని సీతారాంను కలిశారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ.. సీతారాం తనకు మంచి మిత్రుడని, అందుబాటులో ఉన్నారని తెలిసి రాజీనామా విషయం మాట్లాడేందుకు వచ్చానని తెలిపారు.

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పరిరక్షించుకోవడానికి.. కార్మికులకు బాసటగా రాజీనామా చేశానని.. దానిని ఆమోదించాలని కోరగా.. స్పీకర్‌ ఫార్మాట్‌లో చేస్తే పరిశీలిస్తామని చెప్పారని.. ఇందుకోసమే స్పీకర్‌ను కలిశానని వివరించారు. అమరావతి వెళ్లిన తర్వాత రాజీనామా ఆమోదం విషయాన్ని పరిశీలిస్తామని స్పీకర్‌ చెప్పారని అన్నారు. జగన్మోహన్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో రాజీనామాలతోనే ప్రత్యేక హోదా సాధ్యమంటూ అప్పట్లో వైసీపీ ఎంపీలతో రాజీనామా చేయించారని తెలిపారు.

ఎంపీలు, ఎమ్మెల్యేల రాజీనామాలతోనే ఢిల్లీ దిగివస్తుందన్నారు. ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి బాధ్యత తీసుకుని ముందుండి ఉద్యమం నడపాలని కోరారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు తన సీనియారిటీని పక్కనపెట్టి ఉక్కు పరిశ్రమను కాపాడేందుకు ముఖ్యమంత్రితో కలిసి పనిచేస్తామని ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. పార్టీలకతీతంగా రాజకీయ జేఏసీని ఏర్పాటుచేసి ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తామని చెప్పారు.

తెలుగువాడి గుండె చప్పుడు ఢిల్లీలో వినిపించేందుకు ప్రతిఒక్కరూ చొరవ చూపాలన్నారు. తాను 1982లో చదువుకునేందుకు విశాఖ వచ్చి స్థిరపడ్డానని.. విశాఖవాసుల అభిమానంతో ఎంపీ, ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశానని తెలిపారు. విశాఖ రుణం తీర్చుకునేందుకు రాజీనామా చేశానన్నారు. ఖాళీ అయిన స్థానంలో మళ్లీ పోటీచేయనని.. స్టీల్‌ప్లాంట్‌ నిర్వాసితులను పోటీ చేయిస్తామని చెప్పారు.

పాత మిత్రులం: తమ్మినేని

గంటా శ్రీనివాసరావు.. తాను పాత మిత్రులమని స్పీకర్‌ తమ్మినేని విలేకరులకు తెలిపారు. టీడీపీలో, ప్రజారాజ్యంలో కలిసి పనిచేశామని చెప్పారు. ఆయన అరసవల్లి వచ్చారని, తాను అందుబాటులో ఉన్నానని తెలియడంతో గౌరవార్థం కలిసేందుకు వచ్చారని తెలిపారు. రాజీనామాపై చర్చించామని, దీనిపై పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here