పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సవరణలను ప్రతిపాదిస్తుందని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూనే ఆయన తమ పార్టీ ప్రతిపాదించిన సవరణ వివరాలను వెల్లడించారు. విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, విశాఖపట్నానికి ప్రత్యేక రైల్వేజోన్, వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర లాంటి ప్రధాన డిమాండ్లను ప్రతిపాదించారు. అలాగే వ్యవసాయ రంగానికి బడ్జెట్‌లో నిధులు పెంచాలని, జాతీయ వ్యవసాయ కమిషన్ ఏర్పాటుకు ప్రైవేట్ బిల్లు పెడుతున్నామని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో నదులు అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఆయన స్పందిస్తూ.. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని, మొదటి నుంచి ఆయన ధోరణి సరిగా లేదని ఆరోపించారు. గతంలో కూడా ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే కరోనా సాకు చూపి ఎన్నికలు నిలిపివేశారని, ఇప్పుడు కరోనా ముప్పు తగ్గక పోయినా ఎన్నికలంటూ హడావిడి చేస్తున్నారని విమర్శించారు. అత్యుత్తమ రాజ్యాంగ పదవిలో ఉన్న నిమ్మగడ్డ, ఇలా వ్యవహరించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరుగుతాయన్న విషయం 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబుకు తెలీదా అని ప్రశ్నించారు. కనీస అవగాహన లేని వ్యక్తిలా పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టోను ఎలా విడుదల చేస్తారని ఆయన చంద్రబాబును నిలదీశారు. 2024కు పార్టీ ఉండదనే భయంతోనే, చంద్రబాబు ఇవి చివరి ఎన్నికలుగా భావించి పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేశారని ఎద్దేవా చేశారు.
విధులను అలక్ష్యం చేశారంటూ అధికారులపై చర్యలు తీసుకుంటున్న ఎస్‌ఈసీ.. మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబుపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. చంద్రబాబు చంద్రముఖిగా మారి వ్యవస్థలోకి ప్రవేశించారని ఆయన ఎద్దేవా చేశారు. 2018లో జరగాల్సిన ఎన్నికలను నాడు ఎందుకు నిర్వహించలేదో, ఎస్ఈసీ నిమ్మగడ్డ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకు మేలు చేసే విధంగా నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అధికారులపై ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తున్న నిమ్మగడ్డ.. ఐఏఎస్‌లతో పాటు ఉన్నతాధికారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ఎక్కడ ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాలో కూడా తెలీని నిమ్మగడ్డ.. రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌గా వ్యవహరించడం దురదృష్టకరమని పేర్కొన్నారు.