రైతన్నపై ధరల బాదుడు?

0
289
Spread the love

పెట్రో ధరల పెంపుతో సామాన్యుడి నడ్డి విరుస్తోన్న కేంద్రం ఇప్పుడు వ్యవసాయ రంగంపైనా అదనపు భారం మోపడానికి సిద్ధమవుతోంది. నూతన వ్యవసాయ చట్టాలపై రైతాంగం రగిలిపోతున్న తరుణంలోనే వారిపై ధరల దరువు వేయడానికి సన్నాహాలు చేస్తోంది. దీనిలో భాగంగా రసాయన ఎరువుల ధరల పెంపుదలకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. 50 కిలోల ఎరువుల బస్తాపై రూ.100 నుంచి రూ.150 వరకూ ధర పెంచడానికి తయారీ కంపెనీలు కసరత్తు చేస్తున్నాయి.

ఇప్పటికే గ్యాస్‌, పెట్రోలు, డీజిల్‌ ధరలు ఆమాంతం పెంచేసిన కేంద్రం… తాజాగా ఎరువులపై దృష్టి సారించింది. నూతనంగా తెచ్చిన అగ్రిసె్‌సతో యూరియా, డీఏపీ, కాంప్లెక్స్‌ ఎరువులపై 5శాతం అదనపు భారం వేయనుంది. త్వరలో పలు రాష్ట్రాలకు జరగనున్న అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఎరువుల ధరలు పెంచి రైతాంగానికి వాత పెట్టనుంది. ఏప్రిల్‌ నుంచే ధరలు పెరగనున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అందుకే ఈ నెలలో ఎరువులు తెప్పించొద్దని డీలర్లకు మౌఖిక ఆదేశాలున్నట్లు వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. ధరలు పెంచే క్రమంలో ఎరువులు నిల్వలు చేయొద్దని డీలర్లకు వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు హుకుం జారీ చేసినట్లు సమాచారం.

ముడిసరుకు ముసుగులో…

ఎరువుల తయారీకి వాడే ముడిసరుకుల ధర లు పెరిగాయన్న సాకుతో తయారీ కంపెనీలు ఏప్రి ల్‌ 1నుంచే ధరలు పెంచేందుకు సిద్ధమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో నత్రజని, భాస్వరం, పొటాష్‌, క్రూ డాయిల్‌ తదితరాల రేట్ల పెరుగుదలతో తయారీ కంపెనీలకు ధరలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే కేంద్రం అమలులోకి తెచ్చిన అగ్రిసెస్‌ పరోక్షంగా ఎరువుల ధరలు పెరగానికి దోహదమవుతోంది. 5 శాతం వరకూ ఈ సెస్‌ పడనున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే కొన్ని రకాల కాంప్లెక్స్‌ ఎరువులు 50 కిలోల బస్తాకు రూ.100కు పైగా ధర పెరగ్గా, వచ్చేనెల నుంచి కనీసం రూ.150కి పైగా పెరగనుంది. డీఏపీ బస్తా రూ.250 వరకూ పెరగనుంది. కాంప్లెక్స్‌ ఎరువులను మూడు రకాలుగా వర్గీకరించి కనీనం రూ.100, రూ.125, రూ.150 చొప్పున పెంచే ఆలోచనలో తయారీ కంపెనీలున్నట్లు సమాచారం.

ఎరువుల ధరల పెరుగుదల రైతుకు సాగు భారం కానుంది. ఇప్పటికే ఎరువుల ధరలు భరించలేకపోతున్నామని, వచ్చే సీజన్‌ నుంచి వీటిని మరింత పెంచితే, పెట్టుబడులు భారమవుతాయని రైతు నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎకరా వరి సాగుకు రూ.60వేల వరకూ ఖర్చు అవుతుంటే, పత్తికి రూ.లక్ష, మిర్చికి రూ.లక్షన్నర దాకా అవుతోంది. తీసుకున్న రుణాలు పెట్టుబడులకే చాలక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పంట ఉత్పత్తులు మద్దతు ధరకు అమ్ముడుపోకపోతే రైతుకు నష్టాలే మిగులుతున్నాయి.

రాయితీలే కీలకం

రసాయన ఎరువుల వాడకం తగ్గాలంటే, సేంద్రియ ఎరువులకు రాయితీలివ్వడం ముఖ్యమని రైతులు, వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. కానీ ప్రభుత్వాలు ఈ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రకృతి సేద్యానికి అధిక ప్రాధాన్యం ఇచ్చిన రైతులు.. రెండేళ్లుగా మళ్లీ రసాయన ఎరువుల వాడకాన్ని కొనసాగిస్తున్నారు. 2020 ఖరీ్‌ఫలో 18.37లక్షల టన్నుల ఎరువులు వాడారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే 2021 ఖరీఫ్‌ సీజన్‌కు 21.70 లక్షల టన్నులు కేటాయించాలని కేంద్రాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ కోరింది. అయితే కేంద్ర ఎరువుల శాఖ మాత్రం 20.45లక్షల టన్నుల కేటాయింపునకు ఓకే చెప్పింది. రాష్ట్రంలో 73.70శాతం నేలల్లో నత్రజని లభ్యత తక్కువగా ఉందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. దీంతో నత్రజని ఆధారిత ఎరువుల వాడకం ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో ఎరువుల అమ్మకాన్ని కేవలం రైతు భరోసా కేంద్రాల ద్వారానే ఎక్కువగా జరిగేలా చూడాలని జగన్‌ సర్కారు అధికారులకు నిర్దేశం చేస్తోంది. రైతులకు అరువు ఇస్తూ, నిరంతరం అందుబాటులో ఉండే డీలర్ల వ్యవస్థను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని డీలర్లు ఆరోపిస్తున్నారు. సేంద్రియ ఎరువుల సరఫరాను మెరుగుపర్చని ప్రభుత్వాలు రసాయన ఎరువులపై మాత్రం భారం మోపడానికి కసరత్తు చేయడంపై విమర్శలొస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here