వివాదానికి ఫుల్‌స్టాప్‌

0
169
Spread the love

విజయవాడ 39వ డివిజన్‌ నుంచి టీడీపీ అభ్యర్థిగా శివశర్మను అధిష్ఠానం ఖరారు చేసింది. తద్వారా ఈ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి తెలుగు తమ్ముళ్ల మధ్య తలెత్తిన వివాదానికి కూడా ఫుల్‌స్టాప్‌ పెట్టింది. 39వ డివిజన్‌ నుంచి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, పార్టీ అధికార ప్రతినిధి నాగుల్‌మీరాలు బలపర్చిన మాజీ ఫ్లోర్‌ లీడర్‌ గుండారపు హరిబాబు కుమార్తె పూజితకు ఇంతకుముందే టీడీపీ టికెట్‌ను ప్రకటించి బి.ఫారం కూడా అందజేశారు. ఆ తర్వాత ఎంపీ కేశినేని నాని అదే డివిజన్‌ నుంచి టీడీపీ అభ్యర్థిగా శివశర్మను రంగంలోకి దించడంతో వివాదం మొదలైంది. ఎంపీ కేశినేని నాని, బుద్దా వెంకన్న, నాగుల్‌ మీరా పంతాలు, పట్టింపులకు పోయి ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ రచ్చకెక్కడంతో ఈ విషయాన్ని పార్టీ అధిష్ఠానం సీరియ్‌సగా తీసుకుంది. తొలుత అచ్చెన్నాయుడు, తరువాత చంద్రబాబు రంగంలోకి దిగారు. వివాదానికి కారణమైన 39వ డివిజన్‌ అభ్యర్థి విషయంలో పార్టీ నిర్ణయం తీసుకుంటుందని, అంతవరకు ఎవరూ బహిరంగంగా విమర్శలు చేసుకోవద్దని ఆదేశించారు. దీంతో ఇరువర్గాల నాయకులు మౌనంగానే ఉన్నారు.

ఎంపీ కేశినేని నాని బలపర్చిన శివశర్మనే టీడీపీ అభ్యర్థిగా అధిష్ఠానం ఖరారు చేయడంతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని బుద్దా వెంకన్న, నాగుల్‌మీరా కలిశారు. ఆ డివిజన్‌ నుంచి టీడీపీ అభ్యర్థిగా బీసీ వర్గానికి చెందిన మాజీ ఫ్లోర్‌ లీడర్‌ హరిబాబు కుమార్తె పూజితను ఇంతకుముందే ప్రకటించి.. బి.ఫారం కూడా ఇచ్చామని, ఇప్పుడు అభ్యర్థిని మారిస్తే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లడంతోపాటు పార్టీకి కూడా నష్టం జరుగుతుందంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఎన్నికల్లో విజయావకాశాలను పరిగణనలోకి తీసుకునే శివశర్మను పార్టీ అభ్యర్థిగా హైకమాండ్‌ ఖరారు చేసిందని అచ్చెన్నాయుడు వారికి వివరించారు. కుప్పం పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఫోన్‌ చేసి.. ఆయనతో కూడా వెంకన్న, నాగుల్‌మీరాలతో మాట్లాడించారు. చంద్రబాబు కూడా శివశర్మనే టీడీపీ అభ్యర్థిగా ఖరారు చేశామని, ఎన్నికల్లో పార్టీ నాయకులంతా కలిసికట్టుగా పనిచేయాలని నచ్చజెప్పడంతో వెంకన్న, నాగుల్‌మీరాలు తమ అధినేతకు ఓకే చెప్పి వెనుదిరిగారు. దీంతో బెజవాడ టీడీపీ నాయకుల వివాదానికి ఫుల్‌స్టాప్‌ పడినట్లయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here