వైసీపీ ఉండేది రెండేళ్లే

0
183
Spread the love

‘వైసీపీ ప్రభుత్వం ఇంకా ఉండేది రెండేళ్లే. గెలిచే సర్పంచ్‌ ఉండేది ఐదేళ్లు. గెలిచిన సర్పంచులను ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదు. వచ్చేది టీడీపీ సర్కారే. పాత బిల్లుల బకాయిలను వడ్డీతో సహా చెల్లిస్తాం.

కొత్త పనులు మీ ద్వారానే జరుగుతాయి’ అని టీడీపీ అధినేత చంద్రబాబు భరోసా ఇచ్చారు. అన్ని నియోజకవర్గాల టీడీపీ ఇన్‌చార్జులతో, రెండోదశలో పంచాయతీ ఎన్నికలు జరగబోతున్న నియోజకవర్గాల నేతలతో సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ప్రతి పంచాయతీలో సరాసరిన ఐదేళ్లలో రూ.5 కోట్ల పనులు జరుగుతాయని, కేంద్రం నుంచి ఒక్క ఉపాధి హామీ పథకం కిందే ఇన్ని నిధులు అందబోతున్నాయన్నారు. ‘వచ్చే ఐదేళ్లలో 13వేల పంచాయతీల్లో ఉపాధి హామీ పధకం కింద కేంద్రం రూ.70వేల కోట్లతో పనులు చేపట్టబోతోంది. ఇవిగాక ఆర్థికసంఘం నిధులు వస్తాయి. వైసీపీ గెలిస్తే ఈ డబ్బులన్నీ వాళ్లే తినేస్తారు. టీడీపీ సర్పంచ్‌లు గెలిస్తే అభివృద్ధి జరుగుతుంది’ అని తెలిపారు. తొలిదశలో వైసీపీ దౌర్జన్యాలు, అక్రమాలపై వీరోచితంగా పోరాడారని, 3,200 పంచాయతీల్లో సర్పంచ్‌ స్థానాలకు 22 వేల నామినేషన్లు, వార్డు స్థానాలకు 77 వేల నామినేషన్లు పడ్డాయని చెప్పారు. రెండోదశలో కూడా ప్రతిచోటా పోటీ చేయాలని, బలవంతపు ఏకగ్రీవాలకు అడ్డుకట్ట వేయాలన్నారు.
ఓటమి భయంతోనే పంచాయతీ ఎన్నికల్లో ఆన్‌లైన్‌ నామినేషన్లకు వైసీపీ ప్రభుత్వం మోకాలడ్డిందని దుయ్యబట్టారు. తర్వాతి దశల్లోనైనా అనుమతించాలని కోరారు. ‘భయోత్పాతం సృష్టించి.. బెదిరించి.. ప్రలోభపెట్టి.. ఏకగ్రీవాలు చేసుకోవాలని వైసీపీ నేతలు అనుకున్నారు. కానీ ప్రజలు ఎదురు తిరిగి నిలబడ్డారు. నామినేషన్ల ఉపసంహరణకు బెదిరింపులకు దిగే ప్రమాదం ఉంది. ఏ పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సన్నద్ధంగా ఉండాలి’ అని సూచించారు. నామినేషన్లలో ఇబ్బందులు ఎదురైతే పార్టీ కంట్రోల్‌ రూం దృష్టికి తేవాలని, నామినేషన్‌ పత్రాలు, ఫిర్యాదు నకళ్లను జతపర్చిన పత్రాలను కలెక్టర్‌కు, ఎన్నికల సంఘానికి, టీడీపీ కేంద్ర కార్యాలయానికి పంపాలన్నా రు. అచ్చెన్నాయుడి స్వగ్రామం నిమ్మాడలో వైసీపీ గూండాల స్వైరవిహారంపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. ఒక వాహనంపై ధీమాగా కూర్చుని పోలీసుల ఎదుటే పచ్చి బూతులు తిడుతూ వైసీపీ మూకలను రెచ్చగొడుతున్న ఆ పార్టీ నేత దువ్వాడ శ్రీనివాస్‌ ఫొటోను పోస్టు చేశారు.

పూజార్లపై నెట్టడం రాక్షసం..

దేవాలయాల్లో జరిగిన విధ్వంసం కేసులను పూజార్లపైకి నెట్టడం రాక్షస చర్యని చంద్రబాబు విమర్శించారు. ‘రాజమండ్రిలో ఆలయ విధ్వంసం ఘటనలో పూజారిపై కేసు పెట్టడం హేయం. రామతీర్థంలో రాముడి విగ్రహం తల నరికిన కేసును సూరిబాబు అనే టీడీపీ సానుభూతిపరుడిపై నెట్టాలని చూశారు. కర్నూలు జిల్లా ఓంకార క్షేత్రంలో పూజారి కుమారులను వైసీపీ నేతలు చర్నాకోలతో కొట్టి హింసించారు. మూడు నెలలు జీతాలు నిలిపివేసి చీరాలలో పూజారి శ్రీనివాస చక్రవర్తి ఆత్మహత్యకు కారణమయ్యారు. వీటిపై ప్రజలు వైసీపీకి కచ్చితంగా బుద్ధి చెబుతారు’ అని అన్నారు. కుప్పం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై చంద్రబాబు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here