షర్మిలకు నిరాదరణ!

0
196
Spread the love

కడప జిల్లాలో జరిగే కార్యక్రమం ఏదైనా సరే సీఎం జగనే కాదు, వైఎస్‌ విజయలక్ష్మి, వైఎస్‌ షర్మిల ఎవరు హాజరైనా జిల్లాకు చెందిన వైసీపీ కీలక నాయకులు కలుస్తారు. అమ్మా.. అన్న అని సంబోధిస్తూ పర్యటన ఆసాంతం వెంటే ఉంటారు. గతంలో ఇదే జరిగేది. కానీ, సోమవారం పులివెందుల పట్టణానికి జగన్‌ తల్లి విజయలక్ష్మి, ఆయన చెల్లెలు వైఎస్‌ షర్మిల వచ్చిన సందర్భంగా పూర్తి భిన్నమైన వాతావరణం కనిపించింది. బంధువులు, వైఎస్‌ కుటుంబ సన్నిహితులు తప్ప అధికార పక్ష నేతలంతా ఈ పర్యటనలో వారికి దూరంగా ఉన్నారు. తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటును ప్రకటించిన తర్వాత, తొలిసారి షర్మిల తన తల్లితో కలిసి పులివెందుల వచ్చారు. మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందారెడ్డి రెండో వర్ధంతి కార్యక్రమంలో వారు పాలుపంచుకొన్నారు.

అనంతరం షర్మిల వేంపల్లి మండలం ఇడుపులపాయలోని వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఘాట్‌కు చేరుకొని తన తండ్రి సమాధి వద్ద నివాళులు ఆర్పించారు. ఈ కార్యక్రమంలో కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, వైసీపీ కీలక నాయకులు, గతంలో షర్మిలతో సన్నిహితంగా ఉన్న నాయకులు సైతం ఆమెను కలిసి పలకరించలేదు. గతంలో ఆమె ఏ కార్యక్రమానికైనా సరే జిల్లాకు వస్తున్నారంటే చాలు కలిసేందుకు పలువురు నాయకులు క్యూ కట్టేవారని ఆ పార్టీ నాయకులే అంటున్నారు. కొంత కాలంగా అన్న జగన్‌తో ఆమెకు సంబంధాలు బెడిసికొట్టాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. తెలంగాణలో ఆమె నూతన రాజకీయ పార్టీ ఏర్పాట్లలో భాగంగా ఆ రాష్ట్రానికి చెందిన నాయకులతో జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. షర్మిల రాజకీయ పార్టీ స్థాపించడం జగన్‌కు ఇష్టం లేదని కూడా ఆ పార్టీ నాయకులే అంటున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు ఆమెకు దూరంగా ఉన్నారని భావిస్తున్నారు.  రాజంపేట మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి ఒక్కరే షర్మిలను కలిశారు. ఈ పర్యటనలో షర్మిల మీడియాతో మాట్లాడలేదు. 

ఎంపీ అవినాశ్‌ కుటుంబం దూరం..

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందారెడ్డి 2019 మార్చి 14 అర్ధరాత్రి తర్వాత పులివెందులలో తన స్వగృహంలో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. వివేకా రెండో వర్ధంతిని పురస్కరించుకొని డిగ్రీ కళాశాల రోడ్డుకు సమీపంలో ఉన్న వైఎస్‌ కుటుంబీకుల సమాధుల ప్రాంగణంలో సోమవారం ఆయన సమాధి వద్ద పలువురు కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన స్మారకార్థం నిర్మించిన చిన్నపిల్లల పార్కును ప్రారంభించారు. అయితే, ఈ కార్యక్రమానికి కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డి (రాజశేఖర్‌రెడ్డి తండ్రి రాజారెడ్డి తమ్ముడి కుమారుడు) కుటుంబ సభ్యులు హాజరుకాలేదని స్థానికులు పేర్కొన్నారు. కాగా, వివేకా హత్య ఘటనపై ఆయన కూతురు మారెడ్డి సునీత హైకోర్టుకు ఇచ్చిన అనుమానితుల జాబితాలో ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిల పేర్లు ఉన్నాయి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here