మూడు మేజర్ పంచా యతీలను కలిపి ఏర్పాటు చేసిన నర్సీపట్నం మునిసి పాలిటీలో ఈసారి ఎన్నికల్లో పాత నర్సీపట్నం పంచాయతీ పరిధిలో టీడీపీ సత్తా చాటగా, పెదబొడ్డేపల్లి, బలిఘట్టం ప్రాంతాల్లో అధికార పార్టీ పట్టునిలుపుకుంది. నర్సీపట్నం టౌన్ పరిధిలోకి వచ్చే 1, 7 వార్డులతోపాటు 22 నుంచి 28 వార్డులు… మొత్తం 9 స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. వైసీపీ అభ్యర్థులు ఐదు వార్డుల్లో (2, 4, 5, 6, 8) విజయం సాధించారు. పెదబొడ్డేపల్లి పరిధిలోని ఆరు వార్డుల్లో నాలుగింటిని వైసీపీ, రెండు వార్డులను టీడీపీ కైవసం చేసుకున్నాయి. బలిఘట్టం పరిధిలో మూడు వార్డులు వైసీపీ, ఒక వార్డు టీడీపీ గెలుచుకున్నాయి.

14వ వార్డులో టీడీపీ అభ్యర్థి 2 ఓట్ల మెజారిటీతో గెలుపు
మునిసిపల్ ఎన్నికల్లో 14వ వార్డు నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన ఇసంశెట్టి వరహాలమ్మ అత్యల్పంగా రెండు ఓట్ల తెడాతో గెలుపొందారు. పోలైన ఓట్లతో ఈమెకు 523 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థికి 524 ఓట్లు వచ్చాయి. మూడు పోస్టల్ బ్యాలెట్లు టీడీపీకి పడడంతోవరహాలమ్మ కౌన్సిలర్‌గా గెలుపొందారు. కాగా వైసీపీ అభ్యర్థి కోరిక మేరకు ఎన్నికల అధికారి రీకౌంట్ నిర్వహించినప్పటికీ అదే ఫలితం వచ్చింది. కాగా 15వ వార్డులో వైసీపీ అభ్యర్థి మాకిరెడ్డి బుల్లిదొర, స్వతంత్ర అభ్యర్థి పెదిరెడ్ల వెంకటనరసింగరావుపై కేవలం 6 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇంకా 18వ వార్డులో వైసీపీ అభ్యర్థి శెట్టి విజయాంబ 18 ఓట్లు మెజారిటీతో టీడీపీ అభ్యర్థిపై విజయం సాధించారు. ఇక్కడ 25 ఓట్లు చెల్లకపోగా… నోటాకు 29 ఓట్లు పడడం గమనార్హం